- Home
- Sports
- Cricket
- అప్పుడు ఆఖరు నిమిషంలో సిరీస్ రద్దు.. ఇప్పుడేమో సుదీర్ఘ షెడ్యూల్.. మళ్లీ పాక్ కు రానున్న కివీస్
అప్పుడు ఆఖరు నిమిషంలో సిరీస్ రద్దు.. ఇప్పుడేమో సుదీర్ఘ షెడ్యూల్.. మళ్లీ పాక్ కు రానున్న కివీస్
New Zealand Tour Of Pakistan: మూడు నెలల క్రితం వన్డే మ్యాచ్ ప్రారంభానికి కొన్ని నిమిషాల ముందు సిరీస్ రద్దు చేసుకుని స్వదేశం వెళ్లిన న్యూజిలాండ్.. తాజాగా మళ్లీ ఆ దేశానికి వచ్చేందుకు అంగీకారం తెలిపింది.

పాకిస్థాన్-న్యూజిలాండ్ మధ్య వచ్చే ఏడాది రెండు టెస్టులు, 8 వన్డేలు, 5 టీ20 లు జరుగనున్నాయి. ఈ మేరకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది.
వచ్చే ఏడాది డిసెంబర్ లో న్యూజిలాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు రానున్నది. పర్యటనలో భాగంగా డిసెంబర్, జనవరిలో రెండు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది.
ఆ తర్వాత 2023 ఏప్రిల్ లో పాక్ కు వచ్చే కివీస్.. ఈసారి ఏకంగా 5 వన్డేలు, 5 టీ20లు ఆడేందుకు అంగీకారం తెలిపింది. అయితే ఈ సిరీస్ లకు సంబంధించిన తుది తేదీలపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
ఈ ఏడాది సెప్టెంబర్ లో రాక రాక పాక్ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్.. రావల్పిండి లో మొదటి వన్డే ప్రారంభం కావడానికి కొద్దిసేపటి ముందు భద్రతా కారణాలను చూపి సిరీస్ అర్థాంతరంగా రద్దు చేసుకుని వెళ్లింది కివీస్.
కివీస్ వెళ్లడంతో ఇంగ్లాండ్ కూడా తన పర్యటనను రద్దు చేసుకుంది. ఇది పాకిస్థాన్ క్రికెట్ ను పెద్ద షాక్ కు గురి చేసింది. ప్రపంచంలోనే తమకు అత్యంత మెరుగైన ఇంటిలిజెన్స్ వ్యవస్థ ఉన్నదని, ఆటగాళ్లను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఏకంగా పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ చెప్పినా న్యూజిలాండ్ విన్లేదు.
అదే కోపం, కసి తో టీ20 ప్రపంచకప్ లో అడుగుపెట్టిన పాక్.. తమ చిరకాల ప్రత్యర్థి భారత్ తో పాటు న్యూజిలాండ్ పై కూడా ప్రతీకారం తీర్చుకుంది. గ్రూప్ స్టేజీలో పాక్.. ఐదు మ్యాచులాడగా ఐదింటిలో విజయం సాధించిన విషయం తెలిసిందే.
ఇదిలాఉండగా.. వచ్చే ఏడాది ఏప్రిల్-మే లో ఆస్ట్రేలియా జట్టు కూడా మూడు ఫార్మాట్ల సిరీస్ ల కోసం పాక్ కు రానున్నది. ఆసీస్ తో పాటు ఇంగ్లాండ్ కూడా పాక్ కు రావాల్సి ఉంది. దీంతో 2009లో శ్రీలంక క్రికెటర్ల పై ఉగ్రవాదుల దుశ్చర్య తర్వాత మసకబారిపోయిన పాకిస్థాన్ క్రికెట్ కు ఊపిరిలూదటానికి ఆ దేశ క్రికెట్ బోర్డు చైర్మన్ రమీజ్ రాజా ప్రయత్నాలు చేస్తున్నారు.
ఏ ఆటంకం లేకుండా ఈ సిరీస్ లు జరిగితే వచ్చే ఏడాది పాక్ లో.. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్ లు.. 8 టెస్టులు, 11 వన్డేలు, 13 టీ20లు ఆడాల్సి ఉంది. మరి ఇవైనా సజావుగా సాగుతాయా..? లేదా అర్థాంతరంగా రద్దవుతాయా..? తెలియాలంటే కొద్దికాలం పాటు వేచి చూడాల్సిందే.