- Home
- Sports
- Cricket
- ఇంకొక్క మ్యాచ్ ఓడితే అంతే.. ఇక అస్సామే.. చెత్త రికార్డుకు అత్యంత చేరువలో ఇద్దరు మాజీ ఛాంపియన్లు
ఇంకొక్క మ్యాచ్ ఓడితే అంతే.. ఇక అస్సామే.. చెత్త రికార్డుకు అత్యంత చేరువలో ఇద్దరు మాజీ ఛాంపియన్లు
TATA IPL 2022: ఒక జట్టు ఐదు సార్లు ఛాంపియన్. మరో జట్టు 4 సార్లు విజేత 9 సార్లు ఫైనలిస్టు. గతేడాది ట్రోఫీ గెలిచింది కూడా. కానీ ఈ ఏడాది వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓటమి. స్టార్ స్టేటస్, భీకరమైన ప్లేయర్లు ఉన్న ఆ రెండు జట్ల భవితవ్యం ఇక అస్సామేనా..?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో ఇది పదిహేనవ సీజన్. గడిచిన పద్నాలుగు సీజన్లలో ఐదు సార్లు ముంబై ఇండియన్స్ విజేత కాగా.. నాలుగు సార్లు చెన్నై సూపర్ కింగ్స్ ట్రోఫీని గెలుచుకుంది.
అంటే.. 14 సీజన్లలో ఈ రెండు జట్ల (9 సార్లు)దే అగ్రభాగం.. మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ (ఈ సీజన్ లో రవీంద్ర జడేజా) అయితే ఏకంగా తొమ్మిది సార్లు ఐపీఎల్ ఫైనలిస్టు. గత సీజన్ లో ట్రోఫీ విన్నర్..
కానీ ఇప్పుడో..? అంతా తలకిందులైతున్నది. ఈ లీగ్ లో ఇప్పటివరకు ట్రోఫీ నెగ్గని పంజాబ్ కింగ్స్ తో పాటు తొలి సీజన్ లో కప్పు గెలిచి మళ్లీ ఇన్నాళ్లు ప్లే ఆఫ్స్ ముఖం కూడా చూడని రాజస్థాన్ రాయల్స్ ఇప్పుడు అదరగొట్టే విజయాలతో ముందుకు దూసుకెళ్తున్నాయి. కానీ ఛాంపియన్ జట్లైన ముంబై, చెన్నై చతికిలపడుతున్నాయి.
ఈ సీజన్ లో చెన్నై, ముంబైలు ఆడిన నాలుగు మ్యాచులలో ఓడి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయాయి. నాలుగు ఓటములతో చెన్నై 9వ స్థానంలో ఉండగా.. అన్నే ఓటములతో ముంబై అట్టడుగన నిలిచింది.
పాయింట్ల పట్టికలో ముంబై, చెన్నై ఇలా అట్టడుగుకు పడిపోవడం ఇదేం కొత్త కాకపోయినా మరో మ్యాచ్ ఓడితే మాత్రం ఆ జట్ల ప్లే ఆఫ్ అవకాశాలు మరింత సంక్లిష్టంగా మారతాయి.
గతంలో ముంబై ఇండియన్స్.. 2014లో వరుసగా 5 మ్యాచులు ఓడింది. అదే ఆ జట్టుకు అత్యంత చెత్త రికార్డు. ఈ సీజన్ లో గనక ఇంకో మ్యాచులో ఓడితే ఇక ముంబై గతి అస్సామే..
ముంబై జట్టు వరుసగా మూడు లేదా అంతకంటే ఎక్కువ మ్యాచులు వరుసగా ఓడిన సీజన్లు.. 2014లో వరుసగా 5 ఓటములు ఎదురయ్యాయి. తర్వాత సీజన్ (2015)లో కూడా వరుసగా 4 ఓటములు.. కానీ ఆ సీజన్ విజేత ముంబై ఇండియన్స్.
ఇక 2008లో కూడా ముంబై వరుసగా నాలుగు మ్యాచుల్లో ఓడింది. 2018లో వరుసగా 3 మ్యాచుల్లో గెలుపు దక్కలేదు. ఈ సీజన్ లో కూడా ఆడిన నాలుగు మ్యాచుల్లో ముంబైని ఓటమే పలకరించింది. ఇక మరో మ్యాచ్ ఓడితే ఆ జట్టు 2015 లో నెలకొల్పిన చెత్త రికార్డును సమం చేస్తుంది.
ఇక చెన్నై పరిస్థితి కూడా అంతే.. 2010లో కూడా సీఎస్కే వరుసగా నాలుగు మ్యాచులు ఓడింది. కానీ అనూహ్యంగా పుంజుకున్న ఆ జట్టు.. వరుస విజయాలతో ఆ యేటి టైటిల్ నిలబెట్టుకుంది.
ఈసారి కూడా అవే ఫలితాలు రిపీట్ కావాలని ఐపీఎల్ లో ఈ జట్ల అభిమానులు కోరుకుంటున్నారు. మరి రోహిత్ సేన, మహేంద్రుడి అండ ఉన్న రవీంద్రుడి సైన్యం ఏం చేస్తారో వేచి చూడాల్సిందే.