- Home
- Sports
- Cricket
- ముంబై కథ ముగిసింది..! మరి చెన్నై సంగతేంటి..? డిఫెండింగ్ ఛాంపియన్లకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలున్నాయా..?
ముంబై కథ ముగిసింది..! మరి చెన్నై సంగతేంటి..? డిఫెండింగ్ ఛాంపియన్లకు ఇంకా ప్లేఆఫ్స్ అవకాశాలున్నాయా..?
TATA IPL 2022 Playoff Scenario: ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్లుగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్, ముంబై ఇండియన్స్ లు ఈ ఏడాది అత్యంత చెత్త ప్రదర్శనతో పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో నిలిచాయి.

ఐదు సార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో వరుసగా 8 మ్యాచుల్లో ఓడింది. మునుపెన్నడూ లేనివిధంగా అత్యంత అద్వాన్నమైన ప్రదర్శనలతో వరుస ఓటములు మూటగట్టుకుంటున్న ముంబై ఇండియన్స్ ఈ సీజన్ లో ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించినట్టే..
ఇక డిఫెండింగ్ ఛాంపియన్లుగా బరిలోకి దిగిన చెన్నై సూపర్ కింగ్స్ కథ కూడా అంతే. పడుతూ లేస్తూ ఈ సీజన్ లో రెండు మ్యాచులు (8 మ్యాచుల్లో ఆడి) మాత్రమే గెలిచింది. మరి రవీంద్ర జడేజా సారథ్యంలోని సీఎస్కేకు ప్లేఆఫ్ అవకాశాలున్నాయా..? ఉంటే ఎలా..?
సోమవారం పంజాబ్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో చెన్నై గెలిస్తే దానికి ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉండేవే. కానీ ఇప్పుడు కొంత సంక్లిష్టంగా మారాయి. ఇప్పటికే ఆ జట్టు 8 మ్యాచుల్లో 6 ఓడి 2 మాత్రమే గెలిచింది. పాయింట్ల పట్టికలో 9వ స్థానంలో ఉన్న సీఎస్కేకు 4 పాయింట్లు మాత్రమే దక్కాయి.
ఇక ఇప్పుడు ఆ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించాలంటే.. తర్వాత ఆడబోయే ఆరు మ్యాచుల్లో తప్పక గెలవాలి. గెలిచినా ప్లేఆఫ్స్ కు వెళ్తుందా..? అంటే అదీ నమ్మకం లేదు. నెట్ రన్ రేట్, ఇతర జట్ల విజయాలు, పాయింట్ల పట్టికలో టాప్ టీమ్ ల ప్రదర్శన కూడా సీఎస్కే ప్లేఆఫ్ అవకాశాలపై ఆధారపడి ఉన్నాయి.
ఈ సీజన్ లో చెన్నై తమ తదుపరి మ్యాచులను.. సన్ రైజర్స్ హైదరాబాద్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్, ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్, రాజస్తాన్ రాయల్స్ తో ఆడనున్నది.
ఇదిలాఉండగా అనధికారికంగా ఈ సీజన్ ప్లేఆఫ్ అవకాశాల నుంచి తప్పుకున్న ముంబై కి ఇంకా కూడా ఆ అవకాశముంది. ప్లేఆఫ్స్ ఆశలు నిలుపుకోవాలంటే ముంబై జట్టు తమ తదుపరి ఆరు మ్యాచులలో ప్రతి మ్యాచ్ భారీ తేడాతో నెగ్గాలి.
ఆరు మ్యాచులు గెలిచినా ముంబైకి వచ్చేవి 12 పాయింట్లు మాత్రమే. నెట్ రన్ రేట్ (-1) కూడా మైనస్ లలో ఉంది. ఐపీఎల్ పాయింట్ల పట్టికలో టేబుల్ టాపర్లుగా ఉన్న నాలుగు జట్లలో ఏ జట్టైనా ముంబై కంటే తక్కువ పాయింట్లు సాధించి నెట్ రన్ రేట్ కూడా రోహిత్ సేన కంటే తక్కువుంటే వారికి ఛాన్సుంటుంది. అది అయ్యే పనేనా..? చెన్నై కథ కూడా దాదాపు ఇంతే..