మొతేరా స్టేడియానికి నరేంద్ర మోదీ పేరు... విమర్శలు గుప్పిస్తున్న నెటిజన్లు...
ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా రూపొందించిన మొతేరా క్రికెట్ స్టేడియానికి ‘నరేంద్ర మోదీ స్టేడియం’గా నామకరణం చేశారు. మొతేరా స్టేడియానికి ఇంతకుముందు సర్దార్ పటేల్ స్టేడియంగా పేరు ఉండగా... సర్దార్ పటేల్ పేరు కేవలం స్పోర్ట్స్ కాంప్లెక్స్‌కి మాత్రమే పరిమితం చేశారు.
సర్దార్ పటేల్ స్పోర్ట్స్ ఎంక్లేవ్‌లో నరేంద్ర మోదీ స్టేడియం వస్తుందని బీజేపీ వర్గాలు చెబుతున్నా, స్టేడియం పేరు మార్చడంతో సోషల్ మీడియాలో తీవ్రమైన ట్రోలింగ్ మొదలైంది.
ప్రధాని మోదీ, ఇలా ప్రపంచంలోని అతిపెద్ద స్టేడియానికి స్వయంగా తన పేరు పెట్టుకోవడంతో తీవ్రమైన అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. వాస్తవానికి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కావాల్సింది.
అయితే స్టేడియానికి తన పేరు పెట్టడం వల్లే, మోదీ ఈ స్టేడియం ప్రారంభ వేడుకలకు దూరంగా ఉన్నారని టాక్..
భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా ప్రారంభమైన ఈ స్టేడియం ప్రారంభ వేడుకలకి గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవ్‌రత్‌తో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజుజు, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి నితిన్ పటేల్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు.
బీజేపీ నాయకులు కావాలనే సర్దార్ పటేల్ పేరును తొలగించారని కాంగ్రెస్ వర్గాలు ఆరోపిస్తున్నాయి. పటేల్ విగ్రహానికి వందల కోట్లు ఖర్చు చేసిన కేంద్రం, ప్రపంచంలో అతిపెద్ద స్టేడియానికి ఆయన పేరును తొలగించడం ఎందుకని నిలదీస్తున్నారు...
ప్రపంచంలోనే అతిపెద్ద అవుట్ డోర్ క్రికెట్ స్టేడియమైన మొతేరా స్టేడియం పూర్తి కెపాసిటీ లక్షా 32 వేలు... 11 ఏళ్ల తర్వాత ఈ స్టేడియంలో తొలిసారిగా అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది.