మొహాలీ కంటే మెల్‌బోర్న్‌దే బెస్ట్ ఇన్నింగ్స్ అన్న కోహ్లీ.. అసలు మొహాలీలో ఏం జరిగింది..?
IND vs PAK: పాకిస్తాన్ తో ఆదివారం ఉత్కంఠభరితంగా ముగిసిన పోరులో విరాట్ కోహ్లీ విరోచితంగా పోరాడి మ్యాచ్‌ను గెలిపించాడు. అయితే మ్యాచ్ ముగిశాక కోహ్లీ.. తాను ఇప్పటివరకు ఆడిన ఇన్నింగ్స్ (టీ20లలో) మొహాలీ కంటే మెల్‌బోర్న్‌దే బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు.
పరుగుల యంత్రం విరాట్ కోహ్లీ మరోసారి తన క్లాస్ ను చూపిస్తూ తనలో ఇంకా పరుగులదాహం తగ్గలేదని నిరూపిస్తూ మెల్‌బోర్న్ లో రెచ్చిపోయాడు. ఒత్తిడిని చిత్తు చేస్తూ కీలక ఇన్నింగ్స్ ఆడి టీమిండియాకు మరిచిపోలేని విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ తర్వాత కోహ్లీ.. రవిశాస్త్రితో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘నాకు మాటలు రావడం లేదు. ఏ మాట్లాడాలో కూడా తెలియడం లేదు. మనం చివరివరకు క్రీజులో ఉంటే విజయం సాధించగలమని పాండ్యా నాతో చెప్పాడు. ఇప్పటివరకు నా టీ20 కెరీర్ లో మొహాలీ బెస్ట్ ఇన్నింగ్స్.. కానీ ఇది (మెల్‌బోర్న్) అంతకుమించి..’ అని చెప్పాడు. అసలు మొహాలీలో ఏం జరిగింది..? కోహ్లీ దానిని ఎందుకు బెస్ట్ ఇన్నింగ్స్ అన్నాడు.
మొహాలీ బెస్ట్ ఇన్నింగ్స్ అని కోహ్లీ చెప్పడానికి కారణముంది. ఇప్పటిమాదిరిగానే అది కూడా టీ20 ప్రపంచకప్ లో మ్యాచ్. 2016లో ఐసీసీ టీ20 ప్రపంచకప్ కు భారత్ ఆతిథ్యమిచ్చిన విషయం తెలిసిందే. సూపర్-10లో భాగంగా గ్రూప్-2లో ఉన్న భారత్-ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్. వేదిక మొహాలీ (పంజాబ్).
తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 160 పరుగులు చేసింది. ఆరోన్ ఫించ్ (43), గ్లెన్ మ్యాక్స్‌వెల్ (31), డేవిడ్ వార్నర్ (26) లు రాణించారు. భారత బౌలర్లు సమిష్టిగా రాణించి ఆస్ట్రేలియాను తక్కువ పరుగులకే నిలువరించారు.
అయితే లక్ష్య ఛేదనలో భారత్ కు మెల్‌బోర్న్ లో మాదిరిగానే షాకులు తగిలాయి. శిఖర్ ధావన్ (13), రోహిత్ శర్మ (12), సురేశ్ రైనా (10) లు తక్కువ స్కోరుకే పెవిలియన్ కు చేరారు. 7 ఓవర్లలో 49 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు కోల్పోయింది. క్రీజులో కోహ్లీ.
యువరాజ్ సింగ్ జతగా కోహ్లీ రెచ్చిపోయాడు. జోష్ హెజిల్వుడ్, షేన్ వాట్సన్, ఫాల్కనర్, నాథన్ కౌల్టర్ నైల్ వంటి బలమైన ఆసీస్ పేస్ దాడిని సమర్థవంతంగా ఎదుర్కున్నాడు. సింగిల్స్, డబుల్స్ తో ఇన్నింగ్స్ నిర్మించాడు. వీలుచిక్కినప్పుడల్లా బంతిని బౌండరీ దాటించాడు. 39 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తయింది.
చివరి 18 బంతుల్లో 39 పరుగులు కావాలి. తాజాగా పాకిస్తాన్ తో మ్యాచ్ లో హరీస్ రౌఫ్, షాహీన్ షా అఫ్రిది బౌలింగ్ లో ఎలాంటి మెరుపులు మెరిపించాడో.. అప్పుడూ అదే జరిగింది. ఫాల్కనర్, హెజిల్వుడ్ ల బౌలింగ్ లో ఫోర్ల వర్షం కురిపించాడు. చివరి ఓవర్ వరకు వచ్చేసరికి ఆరు బంతుల్లో 4 పరుగులు చేయాల్సి వచ్చింది. ఫాల్కనర్ వేసిన చివరి ఓవర్ తొలి బంతికి బౌండరీ కొట్టి లక్ష్యాన్ని పూర్తి చేశాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ.. 51 బంతుల్లో 82 పరుగులు చేశాడు. ఇందులో 9 ఫోర్లు, 2 సిక్సర్లున్నాయి.
మొహాలీలో ఏది జరిగిందో దాదాపు అదే సీన్ కూడా మెల్‌బోర్న్ లో కూడా రిపీట్ అయింది. ఛేదించాల్సిన లక్ష్యం కూడా అంతే (160). 31 పరుగులకే రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్ పెవిలియన్ కు చేరారు. కానీ విరాట్ మాత్రం హార్ధిక్ పాండ్యాతో కలిసి సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో పాండ్యా ఔటైనా కోహ్లీ విరోచిత పోరాటం చేసి భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు.