- Home
- Sports
- Cricket
- ఓపెనర్‌గా కెఎస్ భరత్... అతనికి ప్రత్యామ్నాయం వెతుకుతున్న టీమిండియా! ఎంత మంది ఓపెనర్లున్నా...
ఓపెనర్‌గా కెఎస్ భరత్... అతనికి ప్రత్యామ్నాయం వెతుకుతున్న టీమిండియా! ఎంత మంది ఓపెనర్లున్నా...
టీమిండియాలో చోటు కోసం ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న క్రికెటర్లలో తెలుగు వికెట్ కీపర్ శ్రీకర్ భరత్ ఒకడు. టెస్టు టీమ్‌కి ఎంపిక అవుతున్నా, తుది జట్టులో చోటు దక్కించుకోలేకపోతున్న కెఎస్ భరత్, ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. తాజాగా లీస్టర్‌షైర్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భరత్‌ని ఓపెనర్‌గా ప్రయోగించింది భారత జట్టు...

వీరేంద్ర సెహ్వాగ్, గౌతమ్ గంభీర్ రిటైర్మెంట్ తర్వాత టెస్టుల్లో సరైన ఓపెనింగ్ జోడి కోసం ప్రయత్నాలు చేస్తూనే ఉంది టీమిండియా. మురళీ విజయ్ కొన్నాళ్లు సరిగ్గానే ఆడినా, ఆ తర్వాత నిలకడగా పరుగులు చేయడంలో విఫలమై జట్టులో చోటు కోల్పోయాడు...
మూడేళ్ల క్రితం ఓపెనర్‌గా ప్రమోషన్ దక్కించుకున్న రోహిత్ శర్మ, అప్పటి నుంచి టెస్టుల్లో తన స్థానాన్ని పదిలం చేసుకున్నాడు. అయితే రోహిత్ శర్మకు సరైన జోడిని మూడేళ్లుగా వెతుకుతూనే ఉంది భారత జట్టు...
పృథ్వీషా, మయాంక్ అగర్వాల్ వంటి ప్లేయర్లు ఆరంభంలో ఆకట్టుకున్నా, ఆ తర్వాత జట్టులో చోటు కోల్పోయారు. దీంతో పోటీలోకి శుబ్‌మన్ గిల్, కెఎల్ రాహుల్ వచ్చారు... ఆస్ట్రేలియా టూర్‌లో అదరగొట్టిన శుబ్‌మన్ గిల్, ఆ తర్వాత స్వదేశంలో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు...
డబ్ల్యూటీసీ ఫైనల్ తర్వాత శుబ్‌మన్ గిల్ జట్టుకి దూరం కావడం, తొలి టెస్టుకి ముందు మయాంక్ అగర్వాల్ కూడా గాయపడడంతో రెండేళ్ల పాటు టెస్టు టీమ్‌లో చోటు కోల్పోయిన కెఎల్ రాహుల్, ఇంగ్లాండ్ టూర్‌లో తుది జట్టులోకి వచ్చి, తన ప్లేస్‌ని స్థుస్థిరం చేసుకున్నాడు...
ఇంగ్లాండ్ టూర్ తర్వాత భారత టెస్టు టీమ్‌కి వైస్ కెప్టెన్‌గా ప్రమోషన్ కూడా దక్కించుకున్న కెఎల్ రాహుల్, గాయం కారణంగా జట్టుకి దూరమయ్యాడు. ఈ మధ్యకాలంలో కెఎల్ రాహుల్ తరుచుగా గాయపడుతుండడంతో అతను మూడు ఫార్మాట్లకు అందుబాటులో ఉండడం కష్టంగా మారింది...
దీంతో కెఎల్ రాహుల్, శుబ్‌మన్ గిల్‌లకు ప్రత్యామ్నాయం వెతికే పనిలో పడిన బీసీసీఐ, లీస్టర్‌షైర్‌తో జరిగిన మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో 71 పరుగులు చేసి అజేయంగా నిలిచిన తెలుగు క్రికెటర్ కెఎస్ భరత్‌ని, సెకండ్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్‌గా పంపించింది...
రెండో రోజు ఆట ముగిసే సమయానికి 59 బంతుల్లో 5 ఫోర్లతో 31 పరుగులు చేసిన శ్రీకర్ భరత్, ఓపెనర్‌గానూ రాణించనని నిరూపించుకునే పనిని పాజిటివ్‌గానే మొదలెట్టాడు. వర్షం కారణంగా మూడో రోజు ఆట ఆలస్యంగా ప్రారంభం కానుంది. శ్రీకర్ భరత్ నుంచి భారీ ఇన్నింగ్స్ వస్తే... భవిష్యత్తులో అతన్ని ఓపెనర్‌గా ప్రయత్నించేందుకు టీమిండియా సిద్ధమవుతుందని అంటున్నారు విశ్లేషకులు..
శ్రీకర్ భరత్ ఓపెనర్‌గా ఫిక్స్ అయితే, ఇప్పటికే టెస్టుల్లో రీఎంట్రీ కోసం ఆశగా ఎదురుచూస్తున్న పృథ్వీషాకి మరిన్ని కష్టాలు ఎదురుకావచ్చు. ఇప్పటికే కెఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్, శుబ్‌మన్ గిల్‌లతో పోటీపడుతున్న పృథ్వీషా, ఇకపై శ్రీకర్ భరత్‌తోనూ పోటీపడాల్సి ఉంటుంది.