కోహ్లీ గురించి ఒక్క ముక్కలో చెప్పమన్న ట్విటర్ యూజర్.. అక్తర్ రిప్లై అదుర్స్
Shoaib Akhtar about Kohli: పాకిస్తాన్ మాజీ పేసర్ షోయభ్ అక్తర్ తన బయోపిక్ ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలో సోషల్ మీడియాలో..

తన క్రికెట్ కెరీర్ లోని ఎత్తుపల్లాలను ప్రపంచానికి చాటి చెప్పడానికి షోయభ్ అక్తర్ సోమవారం తన బయోపిక్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్’ అనే పేరుతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంబంధించిన మోషన్ పోస్టర్ ను అక్తర్ నేడు తన సామాజిక మాధ్యమ ఖాతాలలో పంచుకున్నాడు.
మోషన్ పోస్టర్ ను అభిమానులతో పంచుకున్న తర్వాత అక్తర్.. ట్విటర్ లో అభిమానులతో ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని నిర్వహించాడు. అరగంట సేపు తనను ఎవరైనా Rawalpindiexpressthefilm గురించి గానీ ఆటకు సంబంధించిన మరేదైనా విషయమైనా అడగొచ్చని ట్వీట్ చేశాడు.
దీంతో జయన్ ఖాన్ అనే ఓ ట్విటర్ యూజర్.. ‘విరాట్ కోహ్లీ గురించి వన్ వర్డ్ లో చెప్పమంటే ఏం చెబుతారు..?’ అని ప్రశ్న వేశాడు. దీనికి అక్తర్ అదిరిపోయే ఆన్సర్ చెప్పాడు. ‘అతడిప్పటికే లెజెండ్..’అని అక్తర్ కామెంట్ చేశాడు.
ఈ ప్రశ్న, అక్తర్ చెప్పిన ఆన్సర్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కోహ్లీ గతకొంతకాలంగా పేలవ ఫామ్ తో తంటాలు పడుతున్నా అక్తర్ మాత్రం అతడికి మద్దతుగా నిలుస్తున్న విషయం తెలిసిందే.
ప్రపంచంలో క్రీడాకారులందరి మాదిరిగానే కోహ్లీ ప్రస్తుతం గడ్డుకాలం ఎదుర్కుంటున్నాడని దానిని దాటడం పెద్ద విషయమేమీ కాదని అక్తర్ గతంలో పలుమార్లు వ్యాఖ్యానించాడు. ఒక్కసారి అతడు పామ్ లోకి వస్తే ఆపడం ఎవరి తరమూ కాదని క్రికెట్ పండితులు అభిప్రాయపడుతున్నారు.
ఇక రావల్పిండి ఎక్స్‌ప్రెస్ విషయానికొస్తే అక్తర్ తన సోషల్ మీడియా వేదికగా.. ‘ఈ అందమైన ప్రయాణానికి ప్రారంభం. నా కథ, నా జీవితానికి సంబంధించి తెరకెక్కబోతున్న నా బయోపిక్ ను అనౌన్స్ చేస్తున్నాను. సినిమా పేరు ‘రావల్పిండి ఎక్స్‌ప్రెస్-రన్నింగ్ అగేనెస్ట్ ది ఆడ్స్ (అసమానతలకు వ్యతిరేకంగా నా పరుగు) మీరు ఇంతవరకు వెళ్లని రైడ్ కు మీరు వెళ్లనున్నారు. పాకిస్తాన్ క్రీడాకారునికి సంబంధించి తొలి విదేశీ చిత్రం.. వివాదాస్పదంగా అది నీదే.. షోయభ్ అక్తర్’ అని తన ట్విటర్ వేదికగా రాసుకొచ్చాడు.
2023, నవంబర్ 16న విడుదల కాబోతున్న ఈ సినిమాకు మహ్మద్ ఫరాజ్ కైజర్ దర్శకత్వం వహించనున్నాడు. అక్తర్ మోషన్ పోస్టర్ విడుదల చేసిన అనంతరం పలువురు పాక్ క్రికెట్ ఫ్యాన్స్.. అక్తర్ తో పాటు మరికొంతమంది క్రీడాకారుల జీవితాలు కూడా తెరకెక్కాలని ఆశిస్తున్నారు.