- Home
- Sports
- Cricket
- ఎందుకీ పనికిమాలిన చర్చ? ఎన్నిసార్లు చెప్పినా అవే ప్రశ్నలా? కోహ్లీ ఫామ్ పై అడిగిన ప్రశ్నకు రోహిత్ అసహనం
ఎందుకీ పనికిమాలిన చర్చ? ఎన్నిసార్లు చెప్పినా అవే ప్రశ్నలా? కోహ్లీ ఫామ్ పై అడిగిన ప్రశ్నకు రోహిత్ అసహనం
Virat Kohli: టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ గతకొంతకాలంగా ఫామ్ లేమితో ముప్పేట దాడి ఎదుర్కుంటున్నాడు. అయితే అతడి ఫామ్ పై బయట ఎంత చర్చనడిచినా టీమ్ లో మాత్రం సారథి కోహ్లీకి అండగా నిలుస్తున్నాడు.

క్రికెట్ గురించి అవగాహన ఉన్న ఏ నలుగురు కలిసినా అదే చర్చ. ఏ ఇద్దరు భారత క్రికెట్ అభిమానులు క్రికెట్ గురించి పిచ్చాపాటి మాట్లాడుకున్న అదే ముచ్చట. కోహ్లీ ఈ మ్యాచ్ లో అయినా ఫామ్ లోకి వస్తాడా..? లేదా..? ఈ మ్యాచ్ లో సెంచరీ చేస్తాడా..? గడిచిన మూడేండ్లుగా సా....గుతున్న ఈ చర్చలకు ఇప్పట్లో ముగింపు పడేట్టు కనిపించడం లేదు.
వాళ్ల చర్చలకు తోడు కోహ్లీ ఆట కూడా నానాటికీ తీసికట్టుగా మారిపోతుంది. ‘ఫామ్ కాదు.. క్లాస్ పర్మనెంట్’ అనే రొడ్డకొట్టుడు సమాధానాలు వినివిని అభిమానులకు కూడా బోర్ కొట్టింది. అయితే అభిమానులు, విమర్శకులు, విశ్లేషకుల సంగతి ఎలా ఉన్నా కోహ్లీ పై టీమిండియా మేనేజ్మెంట్ మాత్రం భీభత్సంగా నమ్మకముంచింది.
తాజాగా టీమిండియా సారథి రోహిత్ శర్మ వ్యాఖ్యలు చూస్తే ఇదే నిజమనిపించకమానదు. బయట ఎంత చర్చ జరిగినా తాము మాత్రం కోహ్లీకి అండగా నిలబడతామని రోహిత్ చెప్పాడు. చర్చలు ఎందుకు జరుగుతున్నాయో తనకు తెలియదని.. తనకు మాత్రం కోహ్లీ ఆటపై ఆందోళనేమీ లేదని అతడికి మద్దతుగా నిలిచాడు.
గురువారం ఇంగ్లాండ్ తో ముగిసిన రెండో వన్డే అనంతరం నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో రోహిత్ మాట్లాడుతూ.. ‘అసలు ఎందుకీ చర్చ..? అసలు నాకు అర్థం కావడం లేదు.. ఎందుకు కోహ్లీ గురించి చర్చ.
అతడు చాలాకాలంగా భారత జట్టుకు వందలాది మ్యాచులు ఆడాడు. కోహ్లీ చాలా మంచి బ్యాటర్. అసలు భరోసా ఉంచాల్సిన అవసరం కూడా లేనంతటి ఆటగాడు అతడు.
నేనిదివరకే చాలాసార్లు చెప్పాను. మొన్నటి ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా ఇదే చెప్పా. మళ్లీ అదే చెబుతున్నా. ఆటలో ఎత్తు పల్లాలు సహజం. ప్రతి క్రికెటర్ తన కెరీర్ లో ఇలాంటి దశను ఎదుర్కుంటాడు. ఇన్నాళ్లుగా క్రికెట్ ఆడుతూ వేలాది పరుగులు చేసి అన్నిసెంచరీలు చేసిన ఆటగాడు ఫామ్ కోల్పోతే తిరిగి పొందడానికి ఒకటి, రెండు ఇన్నింగ్స్ చాలు. నేనైతే అదే అనుకుంటున్నాను.
ఇక కోహ్లీ ఆట గురించి చర్చ నడుస్తుందన్న విషయం మాకు కూడా తెలుసు. కానీ ప్రతి ఆటగాడి ప్రదర్శన, ఎత్తుపల్లాలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొన్ని మ్యాచుల్లో సరిగా ఆడనంత మాత్రానా సదరు ఆటగాడి నైపుణ్యం ఎక్కడికి పోదు కదా.. ఈ ప్రపంచంలో ప్రతి మ్యాచ్ నిలకడగా ఆడే ఒక్క క్రికెటర్ కూడా లేడు. అందరూ ఇలాంటి దశను దాటాల్సిందే..’ అని రోహిత్ చెప్పాడు.
ఇంగ్లాండ్ పర్యటనలో కోహ్లీ.. ఎడ్జబాస్టన్ టెస్టులో 31 (రెండు ఇన్నింగ్స్ లలో) చేశాడు. రెండు టీ20లలో 12 పరుగులు చేశాడు. గురువారం ముగిసిన రెండో వన్డేలో 16 పరుగులు చేసి ఎప్పటిలాగే ఔటయ్యాడు.