కృనాల్ పాండ్యా మళ్లీ అదే తప్పు... సాటి ముంబై ప్లేయర్‌తోనే దురుసుగా ప్రవర్తిస్తూ...
రంగం ఏదైనా సరే... ఎంత పైకి ఎదిగినా ఒదిగి ఉంటే వ్యక్తిత్వం కలిగి ఉండే ప్లేయర్లు, చరిత్రలో స్టార్లుగా, లెజెండ్స్‌గా చిరకాలం నిలిచిపోతారు. కొద్దిగా పాపులారిటీ రాగానే, మనకంటే తోపు ఎవడూ లేడని మిడిసి పడితే... కెరీర్ మధ్యలోనే ఆగి, చీకట్లో కలిసిపోవాల్సి ఉంటుంది. ఈ విషయం భారత ఆల్‌రౌండర్ హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యాకి ఇంకా తెలిసినట్టు లేదు.
కొన్నాళ్ల క్రిందట దీపక్ హుడాను అందరి ముందు తీవ్రంగా దూషిస్తూ, అవమానించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్నాడు కృనాల్ పాండ్యా. అయితే ఆ గొడవకు సంబంధించి ఎలాంటి వీడియో అందుబాటులో లేకపోవడంతో హుడానే దోషిగా తేల్చింది బరోడా క్రికెట్ అసోసియేషన్.
అయితే తాజాగా ఐపీఎల్ 2021 సీజన్‌లో జరిగిన ఓ సంఘటన, క్రికెట్ ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తోటి ప్లేయర్‌తో కృనాల్ పాండ్యా వ్యవహారించిన తీరు... అతని ప్రవర్తనపై అనేక అభ్యంతరాలు లేవనెత్తడానికి కారణమైంది...
రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టూ డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన కృనాల్ పాండ్యా 26 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేసి ఇంప్రెస్ చేశాడు. ఇషాన్ కిషన్ లేకపోవడంతో వచ్చిన బ్యాటింగ్ ప్రమోషన్‌ను పర్ఫెక్ట్‌గా వాడుకున్నాడు.
అయితే స్ట్రాటెజిక్ టైమ్ అవుట్ సమయంలో ముంబై ప్లేయర్ అన్‌కుల్ రాయ్, ఫీల్డ్‌లో ఉన్నవారి కోసం మాశ్చరైజర్ తీసుకొచ్చాడు. మాశ్చరైజర్‌ను చేతులను పూసుకున్న కృనాల్ పాండ్యా, ఆ తర్వాత అన్‌కుల్ రాయ్‌వైపు చూడకుండానే అతని పైకి విసిరేశాడు.
ఎంతటి స్టార్ ప్లేయర్ అయినా సాటి ప్లేయర్‌ను గౌరవించడం కనీస బాధ్యత. సచిన్ టెండూల్కర్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో డ్రింక్స్ తీసుకొచ్చే అజింకా రహానే, స్టీవ్ స్మిత్ కూడా ఎప్పుడూ తోటి ప్లేయర్లతో ఈ విధంగా నడుచుకున్న దాఖలాలు లేవు.
2019 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారించిన అజింకా రహానే, ఏ మాత్రం గర్వం లేకుండా 2020 సీజన్‌లో ఎక్కువ మ్యాచులు వాటర్ బాయ్‌గా వ్యవహారించాడు. 41 ఏళ్ల ఇమ్రాన్ తాహీర్ కూడా 2020 సీజన్‌లో డ్రింక్స్ మోస్తూ చాలా మ్యాచులు గడిపేశాడు. వారిపై అభిమానం పెరగడానికి ఇదే కారణం.
అలాంటిది మిడి మిడి టాలెంట్‌తో మిడిసిపడుతున్న కృనాల్ పాండ్యా, తోటి ప్లేయర్లకు ఏ మాత్రం గౌరవం ఇవ్వకుండా ప్రవర్తిస్తూ... నిత్యం వార్తల్లో నిలుస్తున్నాడు.
యూఏఈ నుంచి స్వదేశానికి వస్తూ పరిమితికి మించిన బంగారంతో కృనాల్ పాండ్యా ముంబై ఎయిర్‌పోర్టులో అధికారులకు దొరికిపోయిన విషయం తెలిసిందే. అధికారులు నిలదీయడంతో తనకి కస్టమ్స్ డ్యూటీ గురించి తెలియదని చెప్పి, భారీ జరిమానా చెల్లించాడు పాండ్యా బ్రదర్...