జగడాలు సరే.. మరి జరిమానాలు కట్టేదెవరు..? ఫ్రాంచైజీలా.. ఆటగాళ్లా..?
IPL 2023: విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్‌లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించిన ఐపీఎల్ నిర్వాహకులు.. నవీన్ ఉల్ హక్‌కు 50 శాతం ఫైన్ వేశారు. మరి ఈ జరిమానాను చెల్లించేదెవరు..?

ఐపీఎల్ -16లో మూడు రోజుల క్రితం లక్నో సూపర్ జెయింట్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ముగిసిన మ్యాచ్ లో విరాట్ కోహ్లీ - గౌతం గంభీర్ - నవీన్ ఉల్ హక్ ల ప్రవర్తన కారణంగా బీసీసీఐ వారిపై భారీ జరిమానా విధించిన విషయం తెలిసిందే. నవీన్ ఉల్ హక్ ను కోహ్లీ స్లెడ్జ్ చేయడం.. అతడు కూడా దానికి ధీటుగా బదులివ్వడం.. కొద్దిసేపటికే కోహ్లీతో గంభీర్ వాగ్వాదం.. అది కాస్తా ముదిరి నానా రచ్చ జరిగింది. అయితే దీనికి ఐపీఎల్ పాలకమండలి కూడా అంతే ఘాటుగా బదులిచ్చింది. ఈ ప్లేయర్లందరిపై జరిమానాలు విధించింది.
లెవల్ 2 అఫెన్స్ కింద విరాట్ కోహ్లీ, గౌతం గంభీర్‌లకు మ్యాచ్ ఫీజులో 100 శాతం కోత విధించిన ఐపీఎల్ నిర్వాహకులు.. నవీన్ ఉల్ హక్‌కు 50 శాతం ఫైన్ వేశారు. మరి ఈ జరిమానాను చెల్లించేదెవరు..? ఇవన్నీ ఎప్పుడు చెల్లించాలి..? వంద శాతం మ్యాచ్ ఫీజులో కోత అంటే కోహ్లీ నష్టపోయేదెంత..? ఇలాంటి ఆసక్తికర విషయాలివిగో..
వంద శాతం మ్యాచ్ ఫీజు కోత అంటే కోహ్లీకి దాదాపు కోటి రూపాయలు బొక్క పడ్డట్టే. ఐపీఎల్ లో కోహ్లీకి ఆర్సీబీ జట్టు యేటా వార్షిక వాతనం కింద రూ. 15 కోట్లను చెల్లిస్తున్నది. ఇప్పుడు బీసీసీఐ వేసే జరిమానా కూడా దీనిమీదే ఆధారపడి ఉంటుంది. ఒక్క లీగ్ లో 14 మ్యాచ్ లకు పరిగణనలోకి తీసుకుంటే కోహ్లీకి వంద శాతం ఫైనల్ అంటే సుమారు రూ. 1.07 కోటి రూపాయలు చెల్లించాలి. ఒకవేళ ఆర్సీబీ గనక ప్లేఆఫ్స్ కు క్వాలిఫై మ్యాచ్ ల సంఖ్య పెరిగితే అప్పుడు ఇది కాస్త తగ్గుతుంది. ఎలా చూసినా కోహ్లికి కోటి రూపాయలు లాసే.
కోహ్లీతో పాటు గంభీర్ కు కూడా హండ్రెడ్ పర్సెంట్ జరిమానా విధించారు. గంభీర్.. లక్నో మెంటార్ గా ఎంత తీసుకుంటున్నాదనేదానిపై స్పష్టత లేదు. కొన్నినివేదికల ప్రకారం గంభీర్ ఒక్కో మ్యాచ్ కు రూ. 25 లక్షల దాకా తీసుకుంటాడని తెలుస్తున్నది. అంటే ఫైన్ ప్రకారం గంభీర్ రూ. 25 లక్షలు కోల్పోవాల్సిందే.
ఈ జరిమానాలను ఎవరు కడుతారు..? అంటే మాత్రం అది ఫ్రాంచైజీల మీదే ఆధారపడి ఉంటుంది. వాస్తవానికి ఐపీఎల్ నుంచి వచ్చే ఆదాయం ఫ్రాంచైజీలకే దక్కుతుంది. దీంతో చాలావరకూ ఫ్రాంచైజీలు ఈ జరిమానాలను ఆటగాళ్ల మీద వేయకుండా తమ సొంత డబ్బుతో చెల్లిస్తాయి.
ఇదే విషయమై ఆర్సీబీ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా జట్టు కోసం ఆటగాళ్లు గ్రౌండ్ లో చాలా కష్టపడతారు. ఏదైనా జరిమానాలు పడితే వారి తరఫున మేమే చెల్లిస్తాం. వాళ్ల జీతాల లోంచి కూడా కట్ చేయం..’అని తెలిపాడు. లక్నో వర్గాలు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి.
అయితే ఇది కూడా ఫ్రాంచైజీలకు భారమే. స్లో ఓవర్ రేట్ కారణంగా జరిమానా పడితే అప్పుడు చాలా వరకూ ఫ్రాంచైజీలు తమ సొంత ఖర్చుతో దానిని భరిస్తాయి. లేదంటే ఒక్క కెప్టెన్ ను మాత్రమే బలిచేయకుండా ఆటగాళ్లందరిని కొంత భరించాలని కోరతాయని సమాచారం. అయితే ఇవి అన్ని టీమ్స్ కాదు. కొన్ని ఫ్రాంచైజీలు మాత్రమే ఇలా చేస్తాయట.
ఇక ఆటగాళ్ల మీద పడ్డ జరిమానాలన్నీ లీగ్ ముగిశాక ఇన్వాయిస్ ను ఫ్రాంచైజీలకు పంపిస్తారు ఐపీఎల్ నిర్వాహకులు. ఆ తర్వాత లెక్కలన్నీ చూసి ఆటగాళ్ల మీద వేయాలా..? తామే భరించాలా..? అన్న సంగతి ఫ్రాంచైజీలు నిర్ణయించుకుంటాయి.