చెప్పి మరీ దెబ్బకొట్టిన బట్లర్.. సెమీస్ లోనే ఇండియాను ఇంటికి పంపిన ఇంగ్లాండ్
T20 World Cup 2022: ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ అన్నంత పని చేశాడు. తాము సెమీస్ లో ఇండియాకు షాకిస్తామని, ఫైనల్లో ఇండియా-పాక్ మ్యాచ్ జరగనివ్వమని శపథం చేసిన బట్లర్.. తన మాటను నిలబెట్టుకున్నాడు.
ఇండియా - ఇంగ్లాండ్ రెండో సెమీస్ కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్ లో బట్లర్ మాట్లాడుతూ.. ‘ ‘చూడండి.. మాకు ఈ టోర్నీ ఫైనల్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూడాలని లేదు. అందుకే మేం మా ప్రణాళికలతో ఉన్నాం. అలాంటిది జరుగకుండా భారత జట్టును అడ్డుకుంటాం. అందుకు ఏం చేయాలో అది చేస్తాం. భారత జట్టు చాలా స్ట్రాంగ్ టీమ్. అయినా మేం రోహిత్ సేనకు షాకులిస్తాం..’ అని చెప్పాడు.
ఇప్పుడు బట్లర్ చెప్పంది చేసి కూడా చూపెట్టాడు. ఇండియాతో ముగిసిన సెమీస్ మ్యాచ్ లో టీమిండియాను దారుణంగా ఓడించాడు. టీమిండియాను తొలుత 168 పరుగులకే కట్టడి చేసిన బట్లర్ గ్యాంగ్.. తర్వాత బ్యాటింగ్ లోనూ అదరగొట్టింది.
భారత్ నిర్దేశించిన 169 పరుగుల లక్ష్యాన్ని ఇంగ్లాండ్ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండానే ఛేదించింది. లక్ష్య ఛేదనలో ఓపెనర్లు జోస్ బట్లర్ (49 బంతుల్లో 80 నాటౌట్, 9 ఫోర్లు, 3 సిక్సర్లు) కు తోడుగా అలెక్స్ హేల్స్ (47 బంతుల్లో 86 నాటౌట్, 4 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేశారు. ఇద్దరూ కలిసి తొలి వికెట్ కు 170 పరుగులు జోడించి ఇంగ్లాండ్ ను ఫైనల్ కు చేర్చారు.
ఈ మ్యాచ్ ద్వారా ఇంగ్లాండ్ పలు రికార్డులు బద్దలుకొట్టింది. టీ20లలో ఆ జట్టుకు ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. గతంలో డేవిడ్ మలన్ - ఇయాన్ మోర్గాన్ లు.. న్యూజిలాండ్ మీద 182 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఇప్పుడు బట్లర్ - హేల్స్ 170 పరుగులు చేశారు.
ఇక టీ20 ప్రపంచకప్ లో ఇదే అత్యధిక పార్ట్నర్ షిప్. ఇంతకుముందు ఇదే టోర్నీలో రిలీ రొసో - క్వింటన్ డికాక్ లు బంగ్లాదేశ్ పై 168 పరుగులు జోడించారు. ఇండియా మీద ఏ వికెట్ కైనా టీ20లలో ఇది రెండో అత్యధిక భాగస్వామ్యం. గతంలో క్వింటన్ డికాక్.. డేవిడ్ మిల్లర్ లు (2022 టీ20 సిరీస్ గువహతిలో) 174 పరుగులు చేశారు. ఆ తర్వాత బట్లర్ - హేల్స్ ఉండగా మూడో స్థానంలో బాబర్ ఆజమ్ - మహ్మద్ రిజ్వాన్ (152, దుబాయ్ 2021 ప్రపంచకప్ లో ) లు ఉన్నారు.