వరల్డ్ కప్‌కు రెడీ అవుతున్న బుమ్రా.. అయ్యర్ ఆరోగ్యంపై బీసీసీఐ కీలక ప్రకటన
ఆగస్టు నుంచి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. వెన్ను గాయంతో అతడు టీమ్ లోకి వస్తూ పోతూ ఉన్నా ఒక్క మ్యాచ్ అయితే పూర్తిగా ఆడలేదు. అయ్యర్ కూడా వెన్నునొప్పితోనే బాధపడుతున్నాడు.

టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వెన్ను గాయం నుంచి కోలుకున్నాడు. ఐపీఎల్ తో పాటు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కు దూరమైన అతడు ప్రస్తుతం బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీ (ఎన్సీఎ)లో రిహాబిటేషన్ కేంద్రానికి చేరుకుని వైద్యులు, ఫిజియోల సమక్షంలో గడపనున్నాడు.
ఈ మేరకు బీసీసీఐ కీలక ప్రకటన చేసింది. బుమ్రా సర్జరీ విజయవంతంగా ముగిసిందని.. అతడు వెన్నునొప్పి నుంచి కోలుకున్నాడని తెలిపింది. ఇక టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ గాయంపై కూడా బీసీసీఐ కీలక అప్డేట్ ఇచ్చింది.
ఒక ప్రకటనలో ‘వెన్ను నొప్పితో బాధపడుతూ చాలాకాలంగా క్రికెట్ కు దూరంగా ఉన్న బుమ్రా సర్జరీ విజయవంతంగా పూర్తయింది. బుమ్రా ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడు. వైద్యుల సూచన మేరకు ఆరు వారాల పాటు ఎన్సీఎలో రిహాబిటేషన్ లో ఉంటాడు..’అని తెలిపింది.
గత ఆగస్టు నుంచి బుమ్రా అంతర్జాతీయ క్రికెట్ కు దూరంగా ఉంటున్నాడు. వెన్ను గాయంతో అతడు టీమ్ లోకి వస్తూ పోతూ ఉన్నా ఒక్క మ్యాచ్ అయితే పూర్తిగా ఆడలేదు. అక్టోబర్, జనవరిలలో టీమ్ లోకి వచ్చినా అలా వచ్చి ఇలా వెళ్లాడు. ఇక ఫిబ్రవరిలో న్యూజిలాండ్ లో ఆపరేషన్ చేయించుకున్నాడు.
వరల్డ్ కప్ ద కోసం సిద్ధమవాలని బుమ్రా భావిస్తున్నాడు. అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే ప్రపంచకప్ భారత్ కు చాలా కీలకం. 12 ఏండ్ల తర్వాత భారత్ లో జరుగుతున్న ఈ ప్రపంచకప్ లో నెగ్గి మళ్లీ విశ్వవిజేతగా ఆవిర్భవించాలని భారత్ కోరుకుంటున్నది. ఈ క్రమంలో భారత్ కు బుమ్రా చాలా కీలకం.
ఇక శ్రేయాస్ అయ్యర్ ఆరోగ్యం గురించి బీసీసీఐ స్పందిస్తూ.. ‘అయ్యర్ కు వచ్చే వారం సర్జరీ జరుగనుంది. సర్జరీ అయ్యాక రెండు వారాల వరకూ అతడు వైద్యుల పర్యవేక్షణలోనే ఉంటాడు. ఆ తర్వాత ఎన్సీఎకు చేరుకుంటాడు. వచ్చాక అతడు కూడా రిహాబిటేషన్ లో ఉంటాడు’అని తెలిపింది.
అయ్యర్ కూడా వెన్నునొప్పితోనే బాధపడుతున్నాడు. ఆస్ట్రేలియా తో అహ్మదాబాద్ టెస్టు నుంచి అర్థాంతరంగా తప్పుకున్న అతడు ఐపీఎల్ తో పాటు డబ్ల్యూటీసీ ఫైనల్ కు కూడా దూరమయ్యాడు. అయ్యర్ బ్యాక్ సర్జరీ ముగించుకుని తిరిగి ఫీల్డ్ లోకి రావడానికి కనీసం నాలుగైదు నెలలు టైమ్ పట్టే అవకాశముంది.