13 నెలల తర్వాత రీఎంట్రీకి రెఢీ అవుతున్న జస్ప్రిత్ బుమ్రా... ఐర్లాండ్‌తో సిరీస్ నుంచే...
జస్ప్రిత్ బుమ్రా, ఫార్మాట్ ఏదైనా టీమిండియా ప్రధాన బౌలర్. అయితే అప్పుడెప్పుడో 2022 ఆసియా కప్ టోర్నీకి ముందు గాయపడిన జస్ప్రిత్ బుమ్రా, ఏడాదిగా క్రికెట్‌కి దూరంగా ఉన్నాడు. బుమ్రా అప్పుడొస్తాడు? ఇప్పుడొస్తాడు? అని వార్తలు రావడం తప్ప, మనోడు రీఎంట్రీ ఇచ్చింది లేదు..
Jasprit Bumrah
ఐపీఎల్ 2023 సీజన్ ఆరంభానికి ముందే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో జస్ప్రిత్ బుమ్రా ఆడతాడని ప్రచారం జరిగింది. ఆ తర్వాత నేరుగా ఐపీఎల్ 2023 సీజన్ ఆడతాడని టాక్ వినిపించింది. ఆ తర్వాత డబ్ల్యూటీసీ ఫైనల్ ఆడతాడని అన్నారు..
అయితే ఆ సిరీస్‌లన్నీ అయిపోయాయి కానీ జస్ప్రిత్ బుమ్రా ఫిట్‌నెస్ గురించి ఎలాంటి కబురూ చెప్పలేదు బీసీసీఐ. కొన్నాళ్లుగా జాతీయ క్రికెట్ అకాడమీలో రోజుకి 7 ఓవర్లు బౌలింగ్ చేస్తూ వస్తున్న జస్ప్రిత్ బుమ్రా, త్వరలో పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సమాచారం అందుతోంది..
ఫిజియో అంచనా ప్రకారం బుమ్రా కోలుకుంటే, ఆగస్టులో జరిగే ఐర్లాండ్ సిరీస్‌లో ఆడే అవకాశం ఉంది. వెస్టిండీస్ టూర్ ముగిసిన తర్వాత ఐర్లాండ్‌లో మూడు టీ20 మ్యాచుల సిరీస్ ఆడనుంది టీమిండియా. ఈ సిరీస్‌లో జస్ప్రిత్ బుమ్రా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం..
జస్ప్రిత్ బుమ్రాతో పాటు యంగ్ బౌలర్ ప్రసిద్ధ్ కృష్ణ కూడా గాయంతో బాధపడుతున్నాడు. 2022లో జింబాబ్వేతో మ్యాచ్‌లో ఆడిన ప్రసిద్ధ్ కృష్ణ, గాయంతో ఐపీఎల్ 2023 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. నడుము గాయంతో బాధపడుతూ సర్జరీ కూడా చేయించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ, సర్జరీ కూడా చేయించుకున్నాడు..
Shreyas Iyer
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023 టోర్నీలో మూడో టెస్టులో గాయంతో రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కి కూడా రాని శ్రేయాస్ అయ్యర్, ఐపీఎల్ 2023 సీజన్‌లో కూడా ఆడలేదు. అయ్యర్ కూడా ప్రస్తుతం ఎన్‌సీఏలో బ్యాటింగ్ చేస్తున్నాడు. త్వరలోనే శ్రేయాస్ అయ్యర్ కూడా రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు..
ఐపీఎల్ 2023 సీజన్‌లో ఫీల్డింగ్ చేస్తూ తొడ కండరాల పట్టేయడంతో ఆటకు దూరమైన కెఎల్ రాహుల్, ఆసియా కప్ 2023 టోర్నీ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తాడని సమాచారం. మరో వారం రోజుల్లో ఎన్‌సీఏలో ప్రాక్టీస్ సెషన్స్‌లో పాల్గొనబోతున్నాడు కెఎల్ రాహుల్..