ఆస్ట్రేలియా 2024 బెస్ట్ టీమ్ కెప్టెన్ గా భారత స్టార్ ప్లేయర్.. ఇంకా ఎవరెవరు ఉన్నారంటే..
Cricket Australia's Test team of 2024: ఆస్ట్రేలియా 2024 బెస్ట్ టెస్టు జట్టును ప్రకటించింది. ఈ టీమ్ లో మొత్తం ఆరు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఈ టీమ్ కు భారత స్టార్ ప్లేయర్ ను కెప్టెన్ గా ఎంపిక చేసింది.
బుమ్రా
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా భారత్ vs ఆస్ట్రేలియాలు 5 మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. ఈ సిరీస్ లో నాలుగు మ్యాచ్ లు పూర్తికాగా, ఒకటి భారత్ గెలిచింది. రెండు మ్యాచ్ లలో ఆసీస్ విజయం సాధించింది. ఒక మ్యాచ్ డ్రా అయింది. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో రెండు మ్యాచ్‌ల్లో ఘోరంగా ఓడిపోయిన భారత క్రికెట్ జట్టు ప్రస్తుతం తీవ్ర విమర్శలు ఎదుర్కొంటోంది. ఈ సిరీస్‌లో దాదాపు అందరు ఆటగాళ్ళు విఫలమవుతుంటే, ఒక్క జస్ప్రీత్ బుమ్రానే ఆసీస్‌లో నేనే కింగ్ అని నిరూపించుకున్నాడు. అద్భుతమైన బౌలింగ్ తో నేనే ప్రపంచ నెం.1 బౌలర్ అంటూ నిరూపిస్తున్నాడు.
బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఒంటరి పోరాటం చేస్తూ బుమ్రా కంగారు బ్యాట్స్‌మెన్ల గుండెల్లో గుబులు పుట్టించాడు. 4 మ్యాచ్‌ల్లో ఏకంగా 30 వికెట్లు తీసి సత్తా చాటాడు. విదేశీ సిరీస్‌లో అత్యధిక వికెట్లు తీసిన భారతీయుడిగా రికార్డు సృష్టించాడు. అలాగే, అద్భుతమైన సగటుతో 200 వికెట్ల మార్కును దాటాడు. అందుకే ఆస్ట్రేలియా జట్టు తన దేశ ప్లేయర్లను కాదని మనోడికి కెప్టెన్సీని అప్పగించింది.
ఆస్ట్రేలియా క్రికెట్ బెస్ట్ టీమ్
తాజాగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 2024 బెస్టు టెస్టు క్రికెట్ టీమ్ ను ప్రకటించింది. 2024 బెస్ట్ టీమ్ కు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్‌గా ఎంపిక చేసింది. 2024లో అన్ని దేశాల ఆటగాళ్ల ప్రదర్శన ఆధారంగా 11 మందితో కూడిన జట్టును ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ఎక్స్ వేదికగా విడుదల చేసింది.
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన 2024 బెస్టు క్రికెట్ జట్టుకు భారత స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్ గా ఎంపిక చేసింది. బుమ్రా 2024లో 13 మ్యాచ్‌లు ఆడి 71 వికెట్లు తీసుకున్నాడు. అందుకే ఆస్ట్రేలియా 2024 బెస్ట్ టీమ్ కు అతన్ని కెప్టెన్‌గా ప్రకటించింది. ఈ జట్టులో బుమ్రాతో పాటు భారత యంగ్ ఓపెనర్, ధనాధన్ ఇన్నింగ్స్ లు ఆడే యశస్వి జైస్వాల్ కూడా చోటు దక్కించుకున్నాడు.
కమిన్స్, హెడ్ లేరు
ఇద్దరు భారత ప్లేయర్లతో పాటు ఇంగ్లాండ్ నుంచి జో రూట్, బెన్ డకెట్, హ్యారీ బ్రూక్ కూడా ఈ జట్టులో ఉన్నారు. న్యూజిలాండ్ నుంచి రచిన్ రవీంద్ర, మ్యాట్ హెన్రీ, దక్షిణాఫ్రికా నుంచి కేశవ్ మహారాజ్, శ్రీలంక నుంచి కుశాల్ మెండిస్ కూడా ఉన్నారు. ఆస్ట్రేలియా నుంచి అలెక్స్ క్యారీ, జోష్ హాజిల్‌వుడ్ కూడా ఉన్నారు. ప్యాట్ కమిన్స్, ట్రావిస్ హెడ్‌లకు చోటు దక్కకపోవడం గమనార్హం.
ప్లేయింగ్ XI ఇదే
ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన జట్టులో పాకిస్తాన్, వెస్టిండీస్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లకు చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు ప్రకటించిన 2024 బెస్ట్ టీమ్ : జస్ప్రీత్ బుమ్రా (కెప్టెన్), యశస్వి జైస్వాల్, బెన్ డకెట్, జో రూట్, రచిన్ రవీంద్ర, హాజిల్‌వుడ్, కేశవ్ మహారాజ్, కుశాల్ మెండిస్, హ్యారీ బ్రూక్, మ్యాట్ హెన్రీ, అలెక్స్ క్యారీ (వికెట్ కీపర్).