- Home
- Sports
- Cricket
- విధ్వంసకర సెంచరీతో దినేశ్ కార్తీక్‌కు కౌంటర్ ఇచ్చిన రియాన్ పరాగ్.. అసోంను తక్కువంచనా వేయొద్దంటూ..
విధ్వంసకర సెంచరీతో దినేశ్ కార్తీక్‌కు కౌంటర్ ఇచ్చిన రియాన్ పరాగ్.. అసోంను తక్కువంచనా వేయొద్దంటూ..
టీమిండియా వెటరన్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ కు రాజస్తాన్ రాయల్స్ యువ ఆటగాడు, అసోంకు చెందిన రియాన్ పరాగ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చాడు. తమను తక్కువంచనా వేయొద్దని హెచ్చరించాడు.

దేశవాళీ క్రికెట్ లో భాగంగా జరుగుతున్న విజయ్ హజారే ట్రోఫీ (వీహెచ్‌టీ) లో ఊహించని ఫలితాలు నమోదవుతున్నాయి. ఈ ట్రోఫీలో క్వార్టర్స్ దశ పోటీలు ముగిశాయి. నవంబర్ 28న ముగిసిన నాలుగు క్వార్టర్స్ మ్యాచ్ లలో విజేతలు సెమీస్ చేరారు. పంజాబ్-కర్నాటక, మహారాష్ట్ర - ఉత్తరప్రదేశ్, జమ్మూకాశ్మీర్ - అసోం, తమిళనాడు - సౌరాష్ట్రల మధ్య మ్యాచ్ లు జరిగాయి. ఈ పోటీలలో కర్నాటక, మహారాష్ట్ర, అసోం, సౌరాష్ట్రలు విజయం సాధించి సెమీస్ కు చేరాయి.
జమ్మూకాశ్మీర్ తో జరిగిన మ్యాచ్ లో అసోం.. ఏడు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన జమ్మూకాశ్మీర్.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. అనంతరం భారీ లక్ష్య ఛేదనలో అసోం.. 46.1 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకుంది. ఆ జట్టు తరఫున రిషవ్ దాస్ (114 నాటౌట్), ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ తరఫున ఆడే రియాన్ పరాగ్ (116 బంతుల్లో 174, 12 ఫోర్లు, 12 సిక్సర్లు) వీరవిహారం చేశారు.
పరాగ్ విధ్వంసంతో భారీ లక్ష్యాన్ని అసోం మరో 3 ఓవర్లు మిగిలుండగానే ఛేదించింది. ఈ విజయంతో అసోం సెమీస్ కు దూసుకెళ్లింది. మహారాష్ట్రతో ఆ జట్టు.. నవంబర్ 30న అహ్మదాబాద్ లో తలపడనుంది. అయితే క్వార్టర్స్ మ్యాచ్ అనంతరం పరాగ్ ట్విటర్ వేదికగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశమయ్యాయి.
పరాగ్ ట్విటర్ లో.. ‘గట్టిగా చెప్పండి.. ఇది అసోం.. మమ్ములను ఈజీగా తీసుకోవద్దు..’ అని పోస్టు పెట్టాడు. దీంతో నెటిజన్లు ఇది దినేశ్ కార్తీక్ కు కౌంటర్ అనే భావిస్తున్నారు. వారం రోజుల క్రితం దినేశ్ కార్తీక్ తన ట్విటర్ లో.. ఎలైట్ లిస్ట్ లో ఉన్న టీమ్ లతో ఈశాన్య రాష్ట్రాల జట్లు పోటీ పడటంలో అర్థం లేదని వాపోయాడు.
కార్తీక్ తన ట్వీట్ లో.. ‘అసలు ఎలైట్ లిస్ట్ లో ఉన్న జట్లతో ఈశాన్య రాష్ట్రాల క్రికెట్ జట్లు లీగ్ దశలో పోటీ పడటం ఏమైనా సెన్స్ ఉందా..? ఇది ఎలైట్ జట్ల రన్ రేట్లను మార్చివేస్తుంది. ఒకవేళ వర్షం వచ్చి మ్యాచ్ కు అంతరాయం కలిగిస్తే పరిస్థితిని ఒకసారి ఊహించండి..
Dinesh Karthik
ఎలైట్ గ్రూప్ లో లేని జట్లను సెపరేట్ గ్రూప్ గా చేసి వాటితో క్వాలిఫై ఆడించలేరా..?’ అని ప్రశ్నలు సంధించాడు. కానీ పరాగ్ మాత్రం ఈశాన్య రాష్ట్రాల జట్లను తేలికగా తీసుకోవద్దని కార్తీక్ కు కౌంటర్ ఇచ్చాడని నెటిజన్లు గుసగుసలాడుకుంటున్నారు.