- Home
- Sports
- Cricket
- IPL: భావి సారథులకు ఇదో మంచి వేదిక.. టీమిండియా కెప్టెన్సీపై మాజీ హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
IPL: భావి సారథులకు ఇదో మంచి వేదిక.. టీమిండియా కెప్టెన్సీపై మాజీ హెడ్ కోచ్ సంచలన వ్యాఖ్యలు
Ravi Shastri Comments On IPL: ప్రతి ఐపీఎల్ తర్వాత ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తుందని, ఈసారి మెగా సీజన్ మాత్రం భావి కెప్టెన్లకు మంచి అవకాశంగా నిలుస్తున్నదని అంటున్నాడు టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి...

టీమిండియాకు ప్రస్తుతం రోహిత్ శర్మ మూడు ఫార్మాట్లకు సారథిగా వ్యవహరిస్తున్నాడు. అయితే హిట్ మ్యాన్ వయసు దృష్ట్యా అతడు మరో రెండు మూడేండ్లకు మించి సారథిగా పని చేయడం కష్టమే.
రోహిత్.. 2023 వన్డే ప్రపంచకప్ వరకు భారత్ ను నడిపించినా ఆ తర్వాత అతడు ఏ మేరకు ఫిట్ గా ఉండగలడు..? అనేది ప్రశ్నార్థకమే. దీంతో భారత్ కొత్త కెప్టెన్ కోసం కూడా చూస్తున్నది. ఈ నేపథ్యంలో మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
భారత్ కు భావి కెప్టెన్ ను తయారుచేయడానికి ఐపీఎల్ మంచి వేదిక అవుతుందని రవిశాస్త్రి చెప్పాడు. త్వరలో ఐపీఎల్ ప్రారంభం కానున్న నేపథ్యంలో అతడు మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
రవిశాస్త్రి మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి ఇప్పటికే భారత్ కు కెప్టెన్ గా చేశాడు. ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్ గాఉన్నాడు. అయితే తర్వాత ఐపీఎల్ సీజన్ లో భావి భారత కెప్టెన్ గా నిరూపించుకునేందుకు చక్కటి అవకాశం. ప్రస్తుతం ఐపీఎల్ లో వివిధ జట్లకు కెప్టెన్ గా ఉన్న రిషభ్ పంత్, కెఎల్ రాహుల్, శ్రేయస్ అయ్యర్ లు భారత జట్టుకు భావి సారథులుగా కనబడుతున్నారు.
ఒకరకంగా చెప్పాలంటే ఈ ఐపీఎల్ సీజన్ భావి కెప్టెన్ ను తయారుచేసే ఓ వేదిక అని చెప్పకతప్పదు.. మనం చూస్తే ప్రతి ఐపీఎల్ సీజన్ లో ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుస్తున్నది. గతేడాది వరకు వెంకటేశ్ అయ్యర్ గురించి ఎవరికీ తెలియదు. అతడు ఐపీఎల్ లో రాణించడంతో ఇప్పుడు అతడు భారత జట్టుకు ఎంపికయ్యాడు. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు...’ అని అన్నాడు.
ఏడేండ్ల పాటు టీమిండియాకు హెడ్ కోచ్ గా పనిచేసిన శాస్త్రి.. ఈ ఐపీఎల్ సీజన్ లో మళ్లీ కామెంటేటర్ అవతారం ఎత్తనున్నాడు. ఈ నెల 26న ఐపీఎల్ లో సీఎస్కే-కేకేఆర్ మధ్య జరిగే మ్యాచుతో శాస్త్రి.. టీమిండియా మాజీ ఆటగాడు సురేశ్ రైనాతో కలిసి హిందీ కామెంట్రీ చెప్పనున్నాడు.