- Home
- Sports
- Cricket
- IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీకి అక్షర్ పటేల్ గుడ్‌బై? రేసులో ఉన్న ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు వీరే
IPL 2027: ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీకి అక్షర్ పటేల్ గుడ్‌బై? రేసులో ఉన్న ఆ ముగ్గురు స్టార్ ప్లేయర్లు వీరే
IPL 2027: ఐపీఎల్ 2027లో ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ నుంచి అక్షర్ పటేల్ తప్పుకునే ఛాన్స్ ఉంది. ఒకవేళ తను వద్దంటే జట్టును నడిపించగల ముగ్గురు స్టార్ ప్లేయర్ల వివరాలు ఇవే.

ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీపై సస్పెన్స్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2027 సీజన్ కోసం కొన్ని ఫ్రాంచైజీలు కొత్త కెప్టెన్లతో బరిలోకి దిగే అవకాశం కనిపిస్తోంది. ఆ జాబితాలో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు కూడా ముందు వరుసలో ఉంది. రాబోయే ఐపీఎల్ 2027 సీజన్లో ఢిల్లీ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించడానికి ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఆసక్తి చూపించడం లేదని వార్తలు వస్తున్నాయి. గత రెండు సీజన్లలో జట్టు ప్రదర్శన ఆశించిన స్థాయిలో లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది.
అక్షర్ పటేల్ వెనకడుగు.. గంగూలీ ఫోకస్
పలు మీడియా రిపోర్టుల ప్రకారం.. గత రెండు సీజన్లలో జట్టు ప్లేఆఫ్స్‌కు చేరకపోవడంతో అక్షర్ పటేల్ కెప్టెన్‌గా కొనసాగడానికి విముఖత చూపుతున్నాడు. అక్షర్ సారథ్యంలో ఢిల్లీ క్యాపిటల్స్ 2025, 2026 సీజన్లలో ప్లేఆఫ్స్ అర్హత సాధించడంలో విఫలమైంది. అయితే, కొత్త హెడ్ కోచ్ సౌరవ్ గంగూలీ ఆధ్వర్యంలోని ఫ్రాంచైజీ యాజమాన్యం మాత్రం అక్షర్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని భావిస్తోంది.
ఇందుకోసం ఆ స్టార్ ఆల్‌రౌండర్‌ను ఒప్పించే ప్రయత్నాలు చేస్తోంది. కానీ, త్వరలో జరగనున్న ఐపీఎల్ 2027 మినీ వేలం తర్వాతే కెప్టెన్సీపై తుది నిర్ణయం వెలువడే అవకాశం ఉంది. ఒకవేళ అక్షర్ పటేల్ ససేమిరా అంటే, ఢిల్లీ జట్టును నడిపించగల మూడు ప్రధాన ఆప్షన్లు గమనిస్తే..
నితీష్ రాణా
కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్న ఆసక్తికరమైన పేర్లలో నితీష్ రాణా ఒకరు. దేశవాళీ క్రికెట్లో తన రాష్ట్ర జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించిన అనుభవం అతనికి ఉంది. అంతేకాకుండా 2023 ఐపీఎల్ ఎడిషన్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు కూడా అతను సారథ్యం వహించాడు.
ఆ సీజన్లో నితీష్ కెప్టెన్సీలో కేకేఆర్ ఆడిన 14 మ్యాచ్‌లలో ఆరు మ్యాచ్‌లు గెలిచింది. ఐపీఎల్లో అతని కెప్టెన్సీ రికార్డు అంత గొప్పగా లేకపోయినా, గతంలో జట్టును నడిపించిన అనుభవం అతనికి కలిసొచ్చే అంశం. ఒక అనుభవజ్ఞుడైన భారత ఆటగాడిగా నితీష్ రాణాను కొత్త కెప్టెన్‌గా ఢిల్లీ యాజమాన్యం పరిగణించే అవకాశం ఉంది.
రిషబ్ పంత్
ఢిల్లీ క్యాపిటల్స్ చివరిసారిగా 2021 సీజన్లో ప్లేఆఫ్స్‌కు చేరుకుంది. అప్పుడు జట్టుకు రిషబ్ పంత్ కెప్టెన్‌గా ఉన్నాడు. కెప్టెన్‌గా పంత్‌కు అదే మొదటి సీజన్ అయినప్పటికీ, జట్టును చాలా బాగా నడిపించాడు. అయితే, ఆ తర్వాత వచ్చిన మూడు సీజన్లలో పంత్ నాయకత్వంలో ఢిల్లీ జట్టు ప్లేఆఫ్స్ చేరలేకపోయింది.
ఆ తర్వాత ఢిల్లీని వీడిన పంత్, లక్నో సూపర్ జెయింట్స్ జట్టులో చేరి రెండు సీజన్ల పాటు ఆ ఫ్రాంచైజీకి కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు మళ్లీ తన పాత జట్టు ఢిల్లీ క్యాపిటల్స్‌లోకి తిరిగి వచ్చాడు. కెప్టెన్‌గా అతనికి ఉన్న మొత్తమ్మీద అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుంటే, ఐపీఎల్ 2027లో ఢిల్లీని నడిపించడానికి పంత్ సరైన ఎంపిక కావొచ్చు.
కేఎల్ రాహుల్
ప్రస్తుతం ఢిల్లీ క్యాపిటల్స్ జట్టులో ఉన్న అత్యంత ప్రముఖ భారత ఆటగాడు కేఎల్ రాహుల్. ఐపీఎల్ 2025లో ఢిల్లీ జట్టుతో చేరిన రాహుల్, గత రెండు సీజన్లలో వరుసగా 539, 593 పరుగులు సాధించాడు. గత రెండు ఎడిషన్లలో ఢిల్లీ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ కూడా రాహులే.
దీనికి తోడు గతంలో పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్లకు కెప్టెన్‌గా పనిచేసిన అపార అనుభవం అతని సొంతం. ఐపీఎల్ బయట కూడా కొన్ని మ్యాచ్‌లలో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ నేపథ్యంలో 2027 సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ పగ్గాలు చేపట్టేందుకు రాహుల్ బలమైన పోటీదారుగా నిలుస్తున్నాడు.













