- Home
- Sports
- Cricket
- కోహ్లీకి మరోసారి జరిమానా.. ఆర్సీబీ ప్లేయర్లకూ షాక్.. ఇదే రిపీట్ అయితే మ్యాచ్ నిషేధం తప్పదు!
కోహ్లీకి మరోసారి జరిమానా.. ఆర్సీబీ ప్లేయర్లకూ షాక్.. ఇదే రిపీట్ అయితే మ్యాచ్ నిషేధం తప్పదు!
IPL 2023: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. కోహ్లీతో పాటు ఆర్సీబీ టీమ్ కు భారీ జరిమానా విధించారు.

ఐపీఎల్ లో ఆడిన ఏడు మ్యాచ్ లలో నాలుగు విజయాలతో ప్లేఆఫ్స్ వైపు దూసుకెళ్తున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీమ్ తో పాటు ఆ జట్టు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ఉన్న విరాట్ కోహ్లీకి ఐపీఎల్ నిర్వాహకులు షాకిచ్చారు. రాజస్తాన్ రాయల్స్ తో మ్యాచ్ లో ఆ జట్టు ఐపీఎల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను ఉల్లంఘించినందుకు గాను భారీ జరిమానా విధించారు.
రాజస్తాన్ తో మ్యాచ్ లో స్లో ఓవర్ రేట్ మెయింటెన్ చేసినందుకు గాను కోహ్లీకి రూ. 24 లక్షల జరిమానా పడింది. స్టాండ్ ఇన్ కెప్టెన్ గా కోహ్లీకి స్లో ఓవర్ రేట్ జరిమానా పడటం ఈ సీజన్ లో ఇదే మొదటిసారి. కానీ ఇదివరకే ఆర్సీబీ.. ఒకసారి ఈ నిబంధనను ఉల్లంఘించింది. ఫాఫ్ డుప్లెసిస్ సారథిగా బెంగళూరు ఆడిన మూడో మ్యాచ్ లో జరిమానా పడింది.
రెండోసారి ఇదే తప్పు పునరావృతమైనందున ఆర్సీబీ కెప్టెన్ కు రూ. 24 లక్షలు, ఆటగాళ్లకు రూ. 6 లక్షలు లేదా మ్యాచ్ ఫీజులో 25 శాతం కోతవిధించారు. ఈ మేరకు బెంగళూరు రాజస్తాన్ మ్యాచ్ కు రిఫరీ గా వ్యవహరించిన అమిత్ శర్మ ఓ ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించాడు.
ఇదిలాఉండగా మరోసారి ఇదే తప్పు రిపీట్ అయితే అప్పుడు ఆర్సీబీ కెప్టెన్ గా కోహ్లీ లేదా డుప్లెసిస్.. ఎవరుంటే వారి మీద ఒక మ్యాచ్ నిషేధం పడుతుంది. ఆటగాళ్లు కూడా రూ. 12 లక్షలు జరిమానాకు గురవుతారు.
Image credit: PTI
కోహ్లీకి ఐపీఎల్-16 సీజన్ లో జరిమానా పడటం ఇది రెండోసారి. చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో కోహ్లీ.. జరిమానా ఎదుర్కున్నాడు. ఆ మ్యాచ్ లో కోహ్లీ ప్రవర్తన కారణంగా ఫైన్ పడింది. చెన్నై బ్యాటర్ శివమ్ దూబే నిష్క్రమించిన తర్వాత కోహ్లీ సెలబ్రేషన్స్ శృతి మించడంతో ఐపీఎల్ మందలించింది. అప్పుడు కోహ్లీ.. 12 లక్షల జరిమానా ఎదుర్కున్నాడు.
Image credit: PTI
కాగా ఏడు మ్యాచ్ లు ఆడి నాలుగు విజయాలు మూడు ఓటములతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉన్న ఆర్సీబీ.. ఏప్రిల్ 26 బెంగళూరు వేదికగా కోల్కతా నైట్ రైడర్స్ తో తలపడనుంది. పంజాబ్, రాజస్తాన్ మీద గెలిచిన బెంగళూరు.. కోల్కతాను ఓడిస్తే హ్యాట్రిక్ విజయం సాధిస్తుంది.