Impact Player: ఆ విషయంలో ఫుల్ క్లారిటీ.. 12వ బ్యాటర్ క్రీజులోకి రాలేదు!
Impact Player: ఐపీఎల్ -16లో కొత్తగా తీసుకొచ్చిన నిబంధన ఇంపాక్ట్ ప్లేయర్. ఈ రూల్ పై ఇప్పుడంతగా ఎవరూ పట్టించుకోకపోయినా గతంలో మాత్రం తీవ్ర చర్చ జరిగింది.

ఐపీఎల్-2023లో బీసీసీఐ ప్రవేశపెట్టిన నిబంధన ఇంపాక్ట్ ప్లేయర్. నిజంగా ఇంపాక్ట్ ప్లేయర్లు మ్యాచ్ లో ‘ఇంపాక్ట్’ చూపించిన సందర్భాలు తక్కువే ఉన్నా గతంలో దీని గురించి చాలా చర్చ జరిగింది. ఈ నిబంధనకు కొత్త అర్థం చెబుతున్నాయి ఐపీఎల్ ఫ్రాంచైజీలు. ఆల్ రౌండర్ల అవసరాన్ని తగ్గించుకుంటూ టాస్ ను బట్టి ఒక బౌలర్, ఒక బ్యాటర్ ను వాడుకుంటున్నాయి.
అయితే ఈ నిబంధన మొదట్లో కాస్త వివాదాస్పదమైంది. లక్నో - ఢిల్లీ మధ్య ఏప్రిల్ 2న జరిగిన మ్యాచ్ లో లక్నో.. ఆఖరి ఓవర్లో ఐదో బంతికి అవుట్ అయిన ఆయుష్ బదోనీ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్‌గా కృష్ణప్ప గౌతమ్‌ని తీసుకుని, అతన్ని బ్యాటింగ్‌కి పంపింది. అంటే దీని ప్రకారం ఒక ఆటగాడు అప్పటికే బ్యాటింగ్ చేయడం.. అతడి స్థానంలో వచ్చిన ఇంపాక్ట్ ప్లేయర్ కూడా బ్యాటింగ్ చేశాడు.
Image: PTI
అవుటైన ప్లేయర్ ప్లేస్‌లో అదే ఇన్నింగ్స్‌లో మరో ప్లేయర్‌ని ఇంపాక్ట్ ప్లేయర్‌గా తీసుకురావడం అంటే 12 మందిని బ్యాటింగ్ చేయించడం లాంటిదని.. అవుటైన ప్లేయర్ కే మళ్లీ బ్యాటింగ్ ఇవ్వడం వంటిదని వాదనలు వినిపించాయి.
అయితే దీనిపై ఏదైనా జట్టు అచ్చం లక్నో మాదిరిగానే ఇలా ఆడించి ఒక టీమ్ ఆలౌట్ అయితే అప్పుడు ఎంత మంది బ్యాటింగ్ చేస్తారు..? స్కోరు బోర్డును ‘110-11’ కూడా చూస్తామా..? అన్న అనుమానాలు, ఆసక్తి ప్రేక్షకుల్లో కలిగాయి. కానీ ఇన్ని రోజుల పాటు ఈ స్ట్రాటెజీని వాడిన ఏ జట్టు కూడా ఆలౌట్ కాలేదు.
కానీ ఈ సందేహం తాజాగా తీరింది. రాజస్తాన్ - గుజరాత్ మ్యాచ్ దీనికి బదులిచ్చింది. ఈ మ్యాచ్ లో రాజస్తాన్.. ఓపెనర్ గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ స్థానంలో ఇంపాక్ట్ ప్లేయర్ గా రియాన్ పరాగ్ ను బరిలోకి దింపింది.
నిన్నటి మ్యాచ్ లో జైస్వాల్ తో పాటు పరాగ్ కూడా బ్యాటింగ్ చేశాడు. కానీ తుది జట్టులో ఉన్న చాహల్ కు మాత్రం బ్యాటింగ్ రాలేదు. జంపా నిష్క్రమించగానే రాజస్తాన్ ఇన్నింగ్స్ 118-10 గా ముగిసింది. దీంతో 12వ బ్యాటర్ క్రీజులోకి రాలేదు.
కాగా రాజస్తాన్ - గుజరాత్ మధ్య జైపూర్ వేదికగా ముగిసిన మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన శాంసన్ సేన.. 17.5 ఓవర్లకు 118 పరుగులకే ఆలౌట్ అయింది. లక్ష్యాన్ని గుజరాత్.. 13.5 ఓవర్లలోనే ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 119 పరుగులు చేసింది.