ఇదేం అంపైరింగ్..? మీకు నచ్చినట్టు చేస్తారా..? అశ్విన్ ఆగ్రహం.. షాకిచ్చిన ఐపీఎల్
IPL 2023: టీమిండియా వెటరన్ స్పిన్నర్, ఐపీఎల్ లో రాజస్తాన్ రాయల్స్ కు ఆడుతున్న రవిచంద్రన్ అశ్విన్.. ఈ లీగ్ లో అంపైర్ల వ్యవహారతీరుపై బహిరంగ విమర్శలకు దిగాడు. ఇందుకు గాను బీసీసీఐ కూడా అశ్విన్ కు షాకిచ్చింది.

క్రికెట్‌లో నిబంధనలను అవపోసన పట్టిన అతికొద్దిమంది క్రికెటర్లలో రవిచంద్రన్ అశ్విన్ కూడా ఒకడు. ఇప్పటికీ ‘మన్కడింగ్’ ను ఎలా వాడాలో ఆష్ అన్న (అతడి అభిమానులు ముద్దుగా పిలుచుకునే పేరు) కు తెలిసినంతగా మరెవరికీ తెలియదు. అయితే తాజగా అశ్విన్ చేసిన వ్యాఖ్యలు మాత్రం దుమారం రేపాయి.
ఐపీఎల్ లో అంపైర్లు వ్యవహరిస్తున్న తీరుపై అశ్విన్ బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రస్తుతం జరుగుతున్న సీజన్ లో కొన్ని నిబంధనలు ఇబ్బందికరంగా ఉన్నాయని అశ్విన్ వ్యాఖ్యానించాడు. బుధవారం చెన్నై సూపర్ కింగ్స్ తో మ్యాచ్ లో తాము కొత్త బంతిని అడగకున్నా తమకు ఇచ్చారని ఇది తనకు ఆశ్చర్యకరంగా ఉందని అన్నాడు.
Image credit: PTI
చెన్నైతో మ్యాచ్ ముగిసిన తర్వాత నిర్వహించిన విలేకరులు సమావేశంలో అశ్విన్ మాట్లాడుతూ..‘ఈ మ్యాచ్ లో అంపైర్లు వ్యవహరించిన తీరు నన్ను ఆశ్చర్యపరిచింది. మా కెప్టెన్ అడగకున్నా అంపైర్లు బంతిని మార్చారు. గతంలో ఇలా జరిగేది కాదు. అంపైర్లు వారి సొంత నిర్ణయం మేరకే కొత్త బంతిని తీసుకున్నారు.
అప్పటికీ నేను ఉండబట్టలేక మా కెప్టెన్ బాల్ ను మార్చమనలేదు కదా. ఎందుకు మారుస్తున్నారు.. అని అడిగాను. దానికి వాళ్లు.. తమకు బంతిని మార్చగల అధికారాలున్నాయని, మంచు ప్రభావం వల్ల మారుస్తున్నామని చెప్పారు. ఇకనుంచి కూడా ప్రతీ మ్యాచ్ లో మంచు కురిసిన ప్రతీసారి వాళ్లు బాల్ ను ఛేంజ్ చేస్తారని నేను ఆశిస్తున్నా..’ అని చెప్పాడు.
చెన్నై - రాజస్తాన్ మ్యాచ్ లో శివమ్ దూబే ఔట్ అయిన తర్వాత అంపైర్లు కొత్త బంతిని తీసుకున్నారు. అప్పటికీ సూపర్ కింగ్స్ ఛేదనలో 12 ఓవర్లలో 92-3 గా ఉంది. అశ్విన్.. ఈ ఓవర్ లో దూబే తో పాటు అంతకుముందు ఓవర్లో రహానేను కూడా ఔట్ చేసి రాజస్తాన్ కు బ్రేక్ ఇచ్చాడు.
కాగా మ్యాచ్ తర్వాత అశ్విన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపాయి. ఐపీఎల్ ప్రవర్తనా నియమావళికి వ్యతిరేకంగా మాట్లాడని ఆరోపిస్తూ అశ్విన్ మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత విధిస్తున్నట్టు మ్యాచ్ రిఫరీ జవగళ్ శ్రీనాథ్ ఒక ప్రకటనలో తెలిపాడు. ఐపీఎల్ రూల్స్ ఆర్టికల్ 2.7 ప్రకారం.. మ్యాచ్ జరిగినప్పుడు అందులో జరిగిన సంఘటనలు, ఆటగాళ్లు, అంపైర్ల గురించి గానీ బహిరంగంగా విమర్శలు చేస్తే అది నియమావళి ఉల్లంఘన కిందకే వస్తుంది.
ఇదే మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ సారథి సంజూ శాంసన్ కు కూడా జరిమానా పడ్డ విషయం తెలిసిందే. స్లో ఓవర్ రేట్ కారణంగా సంజూకు రూ. 12 లక్షల జరిమానా విధించారు.