ఐపీఎల్‌లో నేడు‘ఎల్ క్లాసికో’ డే.. ఆ దిగ్గజ సారథులకు ఇదే చివరిది కానుందా..?
IPL 2023: ఐపీఎల్ -16లో నేడు మరో ఎల్ క్లాసికో డే. ముంబై - చెన్నైల మధ్య లీగ్ దశలో రెండో మ్యాచ్ కు రంగం సిద్ధమైంది.

ఐపీఎల్ లో అత్యధిక సార్లు ట్రోఫీలు నెగ్గిన జట్లుగా ఉన్న ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ ల మధ్య జరిగే మ్యాచ్ ను అభిమానులు ‘ఎల్ క్లాసికో’గా అభివర్ణిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సీజన్ లో ఇదివరకే ఒకసారి ముగిసిన ఎల్ క్లాసికోలో చెన్నైదే పైచేయి అయింది. వాంఖెడేలో చెన్నై.. ముంబైని మట్టికరిపించింది.
ఇక నేడు ముంబై బదులు తీర్చుకునే సమయం ఆసన్నమైంది. రోహిత్ సేన శనివారం మధ్యాహ్నం మెరీనా తీరాన ఉన్న చిదంబరం స్టేడియం (చెపాక్) లో ధోని సేనతో తలపడనుంది. వాంఖెడే ఓటమికి ముంబై ఇప్పుడు చెపాక్ లో బదులు తీర్చుకుంటుందా..? అన్నది ఆసక్తికరంగా మారింది. అయితే ఈ మ్యాచ్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది.
ఐపీఎల్ లో ధోనికి ఇదే చివరి సీజన్ (?) అన్న వాదనలు వినపడుతున్నాయి. దీనిపై ధోని ఎప్పటికప్పుడూ కొట్టిపారేస్తూనే ఉన్నా ఈ సీజన్ తర్వాత ధోని ఆడటం అనుమానమేనన్న వాదన బలంగా ఉంది. ఇదే జరిగితే మాత్రం ఐపీఎల్ లో ధోనికి ఇదే చివరి ఎల్ క్లాసికో కావొచ్చు.
అయితే ముంబై - చెన్నై లు ఈ సీజన్ లో ప్లేఆఫ్స్ కు చేరుకుంటే మాత్రం మళ్లీ మరో రసవత్తర పోరును చూసే అవకాశమైతే ఉంది. కానీ దానికి చాలా సమీకరణాలు అడ్డుగా ఉన్నాయి. ప్రస్తుతానికి దాదాపు అన్ని జట్లూ 9 మ్యాచ్ లు పూర్తి చేసుకుని పది మ్యాచ్ లు కూడా ఆడాయి. పాయింట్ల పట్టికలో చెన్నై.. 10 మ్యాచ్ లలో ఐదు గెలిచి ఐదింట ఓడి మూడోస్థానంలో ఉంది. చెన్నై ప్లేఆఫ్స్ కు చేరడం పెద్ద కష్టమేమీ కాదు. తర్వాత ఆడబోయే నాలుగింట్లో రెండు గెలిచినా ఆ జట్టుకు అవకాశాలు మెండుగా ఉంటాయి.
ముంబై కూడా దాదాపు ఇదే ఫ్లోలో ఉంది. ఇప్పటివరకు 9 మ్యాచ్ లు ఆడిన రోహిత్ సేన ఐదు గెలిచి నాలుగింట్లో ఓడింది. ప్లేఆఫ్స్ చేరేందుకు ఆ జట్టుకు ఆర్సీబీ, పంజాబ్, రాజస్తాన్ లు అడ్డుతగలొచ్చు. ముంబైతో పాటు పైన పేర్కొన్న టీమ్ లు మరో రెండు మ్యాచ్ లు ఆడితే గానీ రోహిత్ సేన ప్లేఆఫ్స్ అవకాశాల గురించి చెప్పలేం. ముంబై - చెన్నైలలో ఏ జట్టు ప్లేఆఫ్స్ కు అర్హత సాధించకున్నా వచ్చే సీజన్ లో ధోని - రోహిత్ ల ఎల్ క్లాసికో ను చూడటం అనుమానమే.
ధోనితో పాటు వచ్చే సీజన్ లో రోహిత్.. ముంబైని నడిపిస్తాడా..? అన్నది అనుమానమే. భారత్ లో అక్టోబర్ నుంచి జరిగే వన్డే వరల్డ్ కప్ తర్వాత రోహిత్ టీమిండియాకు గుడ్ బాయ్ చెప్పనున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. రోహిత్ తప్పుకోకపోయినా ఇప్పటికే బీసీసీఐ టీ20లలో అతడిని పక్కనబెట్టినట్టు వన్డే ఫార్మాట్ లో కూడా చేయదన్న గ్యారెంటీ లేదు.
ఇప్పటికే రోహిత్ ఐపీఎల్ లో ఫిట్నెస్, ఇతర సమస్యలతో సతమతమవుతున్నాడు. గతంలో హిట్‌మ్యాన్ లో ఉన్న జోష్ ఇప్పుడు కనిపించడం లేదన్నది బహిరంగ వాస్తవమే. ఈ నేపథ్యంలో రోహిత్ కూడా వచ్చే ఐపీఎల్ సీజన్ లో ఆడినా ప్లేయర్ గా తప్ప సారథిగా వచ్చేది కూడా అనుమానమే. ఈ అనుమానాలే నిజమైతే కెప్టెన్లుగా రోహిత్ - ధోనిలకు ఇదే చివరి ‘ఎల్ క్లాసికో’ కానుంది.
ముంబై - చెన్నై మధ్య ఇప్పటివరకు 35 మ్యాచ్ లు జరుగగా ఇందులో 20 సార్లు ముంబై.. 15 సార్లు చెన్నై నెగ్గింది. ఈ రెండు జట్లూ ఇప్పటివరకు లీగ్ దశలో 26 సార్లు తలపడ్డాయి. ఇందులో 15 సార్లు ముంబై.. 11 సార్లు చెన్నై గెలిచింది.