ఉనద్కత్ రిప్లేస్మెంట్‌ను ప్రకటించిన లక్నో.. ముంబై బ్యాటర్‌కు ఛాన్స్
IPL 2023: ఐపీఎల్ -16 లో భాగంగా గాయపడ్డ లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్ జయదేవ్ ఉనద్కత్ కు ఆ జట్టు రిప్లేస్మెంట్ ప్రకటించింది.

ఈ ఏడాది ఐపీఎల్ సీజన్ లో భాగంగా మే 1న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మ్యాచ్ కు ముందు గాయపడ్డ వెటరన్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ కు తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ రిప్లేస్మెంట్ ప్రకటించింది. ఉనద్కత్ స్థానంలో ముంబై యువ బ్యాటర్ సూర్యాన్ష్ షెడ్గేను జట్టులోకి తీసుకుంది.
బెంగళూరుతో మ్యాచ్ కు ముందు ప్రాక్టీస్ చేస్తుండగా ఉనద్కత్ భుజానికి గాయమైంది. దీంతో అతడిని వైద్య పరీక్షల నిమిత్తం ముంబైకి తరలించగా అతడికి మూడు నుంచి నాలుగు వారాల పాటు విశ్రాంతి అవసరమని వైద్యులు తేల్చారు.
ఇన్నాళ్లు అతడి రిప్లేస్మెంట్ ఊసెత్తని లక్నో.. లీగ్ దశ ముగింపునకు చేరిన క్రమంలో ఉనద్కత్ స్థానాన్ని భర్తీ చేయడం గమనార్హం. ముంబైకి చెందిన సూర్యాన్ష్ ను రూ. 20 లక్షల కనీస ధరతో లక్నో జట్టులోకి చేర్చుకుంది. ముంబైకి చెందిన ఈ యువ బ్యాటర్.. 14 ఏండ్ల వయసులోనే గైల్స్ షీల్డ్ టోర్నమెంట్ లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. బ్యాటింగ్ తో పాటు సూర్యాన్ష్ బౌలర్ గా రాణించగలడు.
లక్నో జట్టులో ఉనద్కత్ తో పాటు కెఎల్ రాహుల్ కూడా గాయపడి ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే. ఈ ఇద్దరూ ఒకేసారి జట్టును వీడారు. రాహుల్ స్థానంలో లక్నో జట్టు.. కరుణ్ నాయర్ ను భర్తీ చేసుకుంది.
రాహుల్ ఈ ఐపీఎల్ సీజన్ తో పాటు ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ నుంచి కూడా తప్పుకున్నాడు. దీంతో బీసీసీఐ.. రాహుల్ ప్లేస్ ను ఇషాన్ కిషన్ తో భర్తీ చేయించింది. ఉనద్కత్ గాయం తీవ్రత గురించి గానీ, అతడి రిప్లేస్మెంట్ గురించి గానీ బీసీసీఐ ఇంతవరకూ అధికారిక ప్రకటన చేయలేదు.