వాళ్లపై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యా.. అందుకే అంత కసిగా బాదా : హెట్మెయర్
IPL 2023: గుజరాత్ తో ఆదివారం ముగిసిన మ్యాచ్ లో రాజస్తాన్ గెలవడం దాదాపు అసాధ్యమనుకున్న స్థితి నుంచి ఆ జట్టు గెలిచిందంటే దానికి కారణం ఆ జట్టు సారథి సంజూ శాంసన్, షిమ్రన్ హెట్మెయర్ ల పోరాటమే.

Image credit: PTI
ఐపీఎల్ - 16లో మరో సూపర్ సండే విజయవంతంగా ముగిసింది. ముంబై ఇండియన్స్ - కోల్కతా నైట్ రైడర్స్ తో పాటు గుజరాత్ టైటాన్స్ - రాజస్తాన్ రాయల్స్ జట్లు అభిమానులను అలరించాయి. ఇరు జట్లలోనూ తొలుత బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోర్లు నమోదుకాగా ఛేదన చేసిన టీమ్స్ కూడా దుమ్ము దులిపాయి.
Image credit: PTI
గుజరాత్ - రాజస్తాన్ మధ్య అహ్మదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్ లో రాజస్తాన్ రాయల్స్ సూపర్ విక్టరీ కొట్టింది. అసలు ఈ మ్యాచ్ లో రాజస్తాన్ గెలవడం అద్భుతమే అని చెప్పొచ్చు. 55 కే నాలుగు వికెట్లు కోల్పోయి చివరి 8 ఓవర్లలో 100 పరుగులు చేయాల్సి ఉన్న పరిస్థితుల్లో లక్ష్యాన్ని చేరుకోవడం అంత ఈజీ కాదు.
రాజస్తాన్ గెలవడం దాదాపు అసాధ్యమనుకున్న స్థితి నుంచి ఆ జట్టు గెలిచిందంటే దానికి కారణం ఆ జట్టు సారథి సంజూ శాంసన్, షిమ్రన్ హెట్మెయర్ ల పోరాటమే. రాజస్తాన్ విజయానికి సంజూ పునాధులు వేస్తే దానిని ఆసరాగా చేసుకుని హెట్మెయర్ గుజరాత్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే విజయం అనంతరం హెట్మెయర్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ మ్యాచ్ లో తాము గెలవడానికి బలమైన కారణముందని.. గుజరాత్ పై ప్రతీకారం తీర్చుకోవాలని ఫిక్స్ అయ్యామని హెట్మెయర్ చెప్పాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత పోస్ట్ మ్యాచ్ ప్రజెంటేషన్ లో హెట్మెయర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. గత సీజన్ లో గుజరాత్ తమను మూడు సార్లు ఓడించిందని.. వాళ్లపై ప్రతీకారం తీర్చుకునేందుకే ఇలా బాదానని చెప్పుకొచ్చాడు.
సంజయ్ మంజ్రేకర్ తో హెట్మెయర్ మాట్లాడుతూ.. ‘ఈ మ్యాచ్ లో ఎలాగైనా గెలవాలనే కసితో ఆడాం. ఎందుకంటే గుజరాత్ టైటాన్స్ 2022 లో మమ్మల్ని మూడు సార్లు ఓడించింది. ఇది మాకు ప్రతీకారం తీర్చుకోవడం వంటిది. అందుకే చివరి 8 ఓవర్లలో వంద పరుగులు చేయాల్సి ఉన్నా తాను అందుకు సిద్ధమయ్యాను’అని చెప్పాడు. కాగా 2022 సీజన్ లో గుజరాత్ - రాజస్తాన్ లు లీగ్ దశలో ఒకసారి.. ప్లేఆఫ్స్ లో భాగంగా మరోసారి తలపడ్డాయి. ఫైనల్ కూడా ఈ రెండింటి మధ్యే జరిగింది. మూడుసార్లూ గుజరాత్ దే గెలుపు.
Image credit: PTI
గుజరాత్ తో మ్యాచ్ లో 178 పరుగుల లక్ష్య ఛేదనలో పది ఓవర్లల 55 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో సంజూ శాంసన్ - హెట్మెయర్ లు రాజస్తాన్ ను ఆదుకున్నారు. శాంసన్.. 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో 60 పరుగులు చేయగా హెట్మెయర్.. 26 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 సిక్సర్లతో 56 రన్స్ చేశాడు.