- Home
- Sports
- Cricket
- కీలక మ్యాచ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన స్టార్ పేసర్లు.. స్వదేశాలకు వెళ్లిన ఆ ఇద్దరు బౌలర్లు..
కీలక మ్యాచ్ ముందు ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాకిచ్చిన స్టార్ పేసర్లు.. స్వదేశాలకు వెళ్లిన ఆ ఇద్దరు బౌలర్లు..
IPL 2023: ఐపీఎల్ -16 లో పాయింట్ల పట్టికలో అట్టడుగున ఉన్న ఢిల్లీ క్యాపిటల్స్ కు డబుల్ షాక్. ఆ జట్టు కీలక బౌలర్లు స్వదేశాలకు వెళ్లారు.

ఐపీఎల్ లో శనివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్ - రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య కీలక మ్యాచ్ జరుగనుంది. పాయింట్ల పట్టికలో ఆఖరు స్థానంలో నిలిచిన ఢిల్లీ.. ఈ మ్యాచ్ లో ఓడితే ప్లేఆఫ్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే నేడు ఆర్సీబీతో జరుగబోయే మ్యాచ్ తో పాటు రాబోయే మ్యాచ్ లలో గెలవాల్సి ఉంటుంది.
కానీ కీలక మ్యాచ్ ముందు ఢిల్లీకి భారీ షాక్ తాకింది. ఆ జట్టుకు చెందిన ఇద్దరు స్టార్ పేసర్లు అన్రిచ్ నోర్జే, ముస్తాఫిజుర్ రెహ్మాన్ లు ఢిల్లీ టీమ్ క్యాంప్ ను వీడారు. ఈ మేరకు ఢిల్లీ క్యాపిటల్స్ తన అధికారిక ఖాతాలో ఈ విషయాన్ని వెల్లడించింది.
ముస్తాఫిజుర్ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఈనెల 9 నుంచి బంగ్లాదేశ్ జట్టు ఐర్లాండ్ తో వన్డే సిరీస్ ఆడేందుకు వెళ్లాడు. ఐర్లాండ్ పర్యటనలో బంగ్లా మూడు వన్డేలు ఆడాల్సి ఉంది. ఈ మేరకు అతడు శుక్రవారం రాత్రి ఢాకా ఫ్లైట్ ఎక్కాడు. అయితే ఐర్లాండ్ సిరీస్ ముగిసినా అతడు ఐపీఎల్ లోకి వచ్చేది అనుమానమే. ఇదే కారణంతో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ లిటన్ దాస్ కూడా జట్టును వీడిన విషయం తెలిసిందే.
ఇక నోర్జే.. ఢిల్లీ క్యాంప్ వీడటానికి కారణం ఫ్యామిలీ ఎమర్జెన్సీ అని ఢిల్లీ ట్విటర్ లో పేర్కొంది. అతడు కూడా శుక్రవారం రాత్రే దక్షిణాఫ్రికా వెళ్లిపోయాడని తెలిపింది. అయతే నోర్జే ఆర్సీబీతో పాటు రాబోయే చెన్నై మ్యాచ్ (మే 10) కు కూడా అందుబాటులో ఉండేది అనుమానమేనని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఇద్దరూ దూరమవడం ఢిల్లీ బౌలింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ. గత రెండు మ్యాచ్ లలో రాణించిన ఇషాంత్ శర్మకు తోడుగా ఖలీల్ అహ్మద్, ముకేష్ కుమార్ లు ఆడే అవకాశాలున్నాయి.
కాగా గత నెల 15న చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆర్సీబీ చేతిలో ఓడిన ఢిల్లీ నేడు తమ స్వంత గ్రౌండ్ లో జరుగబోయే మ్యాచ్ లో ఆ జట్టుకు షాకిచ్చేందుకు సిద్ధంగా ఉంది. అయితే కేజీఎఫ్ (కోహ్లీ, గ్లెన్ మెక్ గ్రాత్, ఫాఫ్ డుప్లెసిస్) ధాటికి తట్టుకుని ఢిల్లీ నిలువగలదా..? అన్నదే ఆసక్తికరం. బెంగళూరు మాదిరిగానే ఢిల్లీ స్టేడియం కూడా చిన్నదే.