అసలే ఫామ్‌లో లేడు.. ఆ పై షాకులు.. కోర్టులో హాజరుకావాలంటూ పృథ్వీ షాకు నోటీసులు..
IPL 2023: ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షా కు మరో షాక్ తాకింది. సప్నా గిల్ తో ‘సెల్ఫీ వివాదం’లో తాజాగా ముంబై లోని ఓ డివిజన్ కోర్టు అతడిని విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది.

ఢిల్లీ క్యాపిటల్స్ ఓపెనర్ పృథ్వీ షాకు బ్యాడ్ టైమ్ నడుస్తోంది. గత ఐపీఎల్ సీజన్ లో అదరగొట్టి.. దేశవాళీలో రెచ్చిపోయి ఆడి ఆ తర్వాత మూడేండ్లకు భారత జట్టులో స్థానం దక్కించుకుని కెరీర్ మళ్లీ గాడిన పడుతుందనుకున్న తరుణంలో ఐపీఎల్ -16లో చెత్త ప్రదర్శనలతో విమర్శలు ఎదుర్కుంటున్నాడు ఈ ముంబై బ్యాటర్.
Prithvi Shaw sapna gill
తాజాగా పృథ్వీ కి మరో షాక్ తాకింది. ఫిబ్రవరిలో సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్ సప్నా గిల్ తో ‘సెల్ఫీ వివాదం’లో తాజాగా ముంబై లోని ఓ డివిజన్ కోర్టు అతడిని విచారణకు రావాలంటూ నోటీసులు పంపింది. షా తో పాటు ముంబై పోలీసులకు కూడా నోటీసులు ఇచ్చింది.
ఈ ఏడాది ఫిబ్రవరిలో సప్నా గిల్ సెల్పీ ఇవ్వాలని పృథ్వీ షాను అడిగినందుకు గాను వారిద్దరి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ క్రమంలో షా తనను అభ్యంతరకరంగా తాకాడని, తానేం తప్పు చేయకున్నా పోలీసులు తనను అరెస్టు చేశారని ఆరోపిస్తూ సప్నా ఆరోపించింది.
తాను పోలీసులకు ఫిర్యాదు చేసినా వాళ్లు పట్టించుకోకపోగా తననే అరెస్ట్ చేశారని.. ఘటనకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజీని పరిశీలిస్తే అసలు విషయం అర్థమవుతుందని సప్నా గిల్ తరఫున న్యాయవాది అలీ కశిఫ్ ఖాన్ తన వాదనలు వినిపించాడు. తన క్లయింట్ పై తప్పుడు కేసు పెట్టారని, నిందితులను వదిలిపెట్టారని ఆయన ఆరోపించాడు.
కాగా ఈ కేసులో అలీ కశిఫ్ ఖాన్ వాదనలు విన్న న్యాయస్థానం.. కోర్టులో హాజరుకావాలని పృథ్వీ షా తో పాటు ముంబై పోలీసులకు నోటీసులు జారీ చేసింది. మరి ఈ కేసులో షా ఎలాంటి వాదనలు వినిపిస్తాడననేది ఆసక్తికరంగా మారింది.
ఇదిలాఉండగా ఐపీఎల్ లో పృథ్వీ షా ఢిల్లీ క్యాపిటల్స్ కు ఆడుతూ దారుణంగా విఫలమవుతున్నాడు. ఈ ఏడాది లక్నో తో జరిగిన మ్యాచ్ లో 12 పరుగులే చేసిన షా.. తర్వాత గుజరాత్ తో 7, రాజస్తాన్ తో మ్యాచ్ లో డకౌట్ అయ్యాడు. ముంబై ఇండియన్స్ తో పోరులో 15 పరుగులు చేశాడు. నాలుగు మ్యాచ్ లలో కలిపి 34 పరుగులే చేశాడు.