- Home
- Sports
- Cricket
- అన్న కొట్టిన ఐదేళ్లకు తమ్ముడికి... ఐపీఎల్ ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన వాళ్లు వీరే...
అన్న కొట్టిన ఐదేళ్లకు తమ్ముడికి... ఐపీఎల్ ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన వాళ్లు వీరే...
ఐపీఎల్ 2022 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్‌ని ఊహించని దెబ్బ తీశాడు హార్ధిక్ పాండ్యా. ఈ సీజన్‌లో బౌలింగ్ చేస్తున్నా, పూర్తి ఫిట్‌గా లేడని భావించిన హార్ధిక్ పాండ్యా... జోస్ బట్లర్, సంజూ శాంసన్, సిమ్రాన్ హెట్మయర్ వంటి కీ వికెట్లు తీసి రాజస్థాన్ రాయల్స్‌ని చావు దెబ్బ తీశాడు...

బౌలింగ్‌లో 17 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీసిన హార్ధిక్ పాండ్యా, బ్యాటింగ్‌లో 30 బంతుల్లో 3 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 34 పరుగులు చేసి ఫైనల్ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు... సరిగ్గా ఐదేళ్ల క్రితం 2017లో హార్ధిక్ పాండ్యా అన్న కృనాల్ పాండ్యా, ఫైనల్ మ్యాచ్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిస్తే, 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్ తరుపున తమ్ముడు ఈ ఫీట్ సాధించాడు...
2008 ఫైనల్ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ తరుపున ఆడిన యూసఫ్ పఠాన్, 39 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు. అంతకుముందు బౌలింగ్‌లో 22 పరుగులకే 3 వికెట్లు తీసి మొదటి సీజన్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచాడు...
2009 సీజన్‌లో ఆర్‌సీబీ కెప్టెన్ అనిల్ కుంబ్లే, 4 ఓవర్లలో 16 పరుగులిచ్చి 4 వికెట్లు తీసి ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచాడు. ఇప్పటికీ ఫైనల్ మ్యాచ్‌లో నమోదైన అత్యుత్తమ గణాంకాలు అనిల్ కుంబ్లేవే...
2010 ఐపీఎల్ ఫైనల్‌లో 35 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన సీఎస్‌కే మాజీ ప్లేయర్ సురేష్ రైనా, బౌలింగ్‌లోనూ హర్భజన్ సింగ్ వికెట్ తీసి ఫైనల్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచాడు...
2011 సీజన్ ఫైనల్ మ్యాచ్‌లో 52 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్సర్లతో 95 పరుగులు చేసి అవుటైన సీఎస్‌కే బ్యాటర్ మురళీ విజయ్ ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ గెలవగా, 2012 సీజన్‌లో 48 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లతో 89 పరుగులు చేసి అవుటైన కేకేఆర్ బ్యాటర్ మన్వీందర్ బిల్లా, ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు గెలిచాడు...
2013 సీజన్‌లో 32 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసిన కిరన్ పోలార్డ్, బౌలింగ్‌లోనూ ఓ వికెట్ తీసి ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ గెలిచాడు. 2014 సీజన్‌లో కేకేఆర్ తరుపున ఆడిన మనీశ్ పాండే 50 బంతుల్లో 7 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు...
2015 సీజన్‌లో 26 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 పరుగులు చేసిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ, ఫైనల్‌లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలవగా, 2016 సీజన్‌లో 15 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 39 పరుగులు చేసిన బెన్ కట్టింగ్, బౌలింగ్‌లో 2 వికెట్లు తీసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గెలిచాడు...
2017లో కృనాల్ పాండ్యా 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 47 పరుగులు చేసి మ్యాన్ ఆఫ్ ది ఫైనల్‌గా నిలిచాడు. 2018 సీజన్‌లో 57 బంతుల్లో 11 ఫోర్లు, 8 సిక్సర్లతో 117 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచిన షేన్ వాట్సన్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ వరించింది...
2019 సీజన్‌లో 4 ఓవర్లలో 14 పరుగులు మాత్రమే ఇచ్చి 2 వికెట్లు తీసిన ముంబై ఇండియన్స్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రాకి ‘మ్యాన్ ఆఫ్ ది ఫైనల్’ దక్కగా, 2020 సీజన్ ఫైనల్‌లో 4 ఓవర్లలో 30 పరుగులిచ్చి 3 వికెట్లు తీసిన ట్రెంట్ బౌల్ట్‌కి ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది...
2021 ఫైనల్ మ్యాచ్‌లో 59 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 పరుగులు చేసిన సీఎస్‌కే మాజీ ఓపెనర్ ఫాఫ్ డుప్లిసిస్ ఫైనల్ మ్యాచ్‌లో ‘ప్లేయర్ ఆఫ్ ది ఫైనల్’ అవార్డు దక్కించుకున్నాడు...