అట్లుంటది మరి ముంబైతోని.. ఆటగాళ్ల భద్రత విషయంలో తగ్గేదేలే.. బబుల్ ను మించిన రక్షణ
IPL 2022 Live Updates: ఐపీఎల్ లో అత్యంత క్రేజ్ తో పాటు రిచెస్ట్ ఫ్రాంచైజీగా గుర్తింపు పొందిన ముంబై ఇండియన్స్ ఆటగాళ్ల భద్రత విషయంలో రాజీ పడనంటున్నది. ఆ మేరకు ఏర్పాట్లను కూడా అదరగొడుతున్నది.

ఐపీఎల్ లో అత్యంత విజయవంతమైన జట్టుగా పేరున్న ముంబై ఇండియన్స్ జట్టు ఆటగాళ్లు, వారి కుటుంబ సభ్యుల భద్రత విషయంలో రాజీ పడే సమస్యే లేదంటున్నది.
భారత్ లో గాక ఆసియాలోనే అత్యంత ధనవంతుడిగా గుర్తింపు పొందిన ముఖేశ్ అంబానీ యాజమాన్యంలోని ముంబై ఇండియన్స్.. ఐపీఎల్-2022 సీజన్ కోసం తమ ఆటగాళ్లు బస చేసేందుకు దేశ ఆర్థిక రాజధానిలో బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో అత్యంత విలాసవంతమైన ట్రిడెంట్ హోటల్ మొత్తాన్ని బుక్ చేసిన విషయం తెలిసిందే.
అయితే ఇప్పుడు హోటల్ బుక్ చేయడమే కాదు కరోనా నేపథ్యంలో ఏ ఆటగాడు గానీ, వారి కుటుంబ సభ్యులు గానీ వైరస్ బారీన పడకుండా ఉండేందుకు బయో బబుల్ ను మించిన రక్షణను కల్పిస్తున్నది.
ట్రిడెంట్ హోటల్ చుట్టూ సుమారు 13 వేల స్క్వేర్ మీటర్ల దాకా ఎంఐ ఎరీనా ను ఏర్పాటు చేసింది. ఇది కూడా బయో బబుల్ లో ఒక భాగం. ఎంఐ ఎరినా లోకి ముంబై ఆటగాళ్లు, కోచులు, ఇతర సిబ్బంది మినహా ఎవ్వరినీ అనుమతించరు.
ఎంఐ ఎరీనాను సృష్టించడమే గాక ఆటగాళ్లు, వారి కుటుంబసభ్యులు సేద తీరడానికి అనువైన ఆహ్లాదకర వాతావరణాన్ని కూడా సృష్టించింది. ఇక చిన్న పిల్లలు ఆడుకోవడానికి బాక్స్ క్రికెట్, గోల్ఫ్, కిడ్స్ ప్లే ఏరియాలను కూడా క్రియేట్ చేసింది. బబుల్ లో ఉండి ఆసక్తిఉన్నవాళ్లు ఆడుకోవడానికి టేబుల్ టెన్నిస్, కేఫ్, ఇండోర్ బాస్కెట్ బాల్, మసాజ్ చైర్స్ ఇతర గేమ్స్ కూడా ఉన్నాయి.
ఆటగాళ్లలో ఎవరికైనా మూడ్ బాగోలేనప్పుడు మ్యూజిక్ వినాలకుంటే అందుకు తగిన ఏర్పాట్లను కూడా చేసింది. ఇందుకోసం ప్రత్యేక మ్యూజిక్ బ్యాండ్ ను కూడా సిద్ధం చేసింది. అభిమానులను అలరించడానికి, అప్పుడప్పుడు ఆటగాళ్లు తమ ఫ్యాన్స్ ను కలుసుకునేందుకు ప్రత్యేకంగా ఫ్యాన్ వాల్ ను కూడా ఏర్పాటు చేసింది.
ఈ ఏర్పాట్లపై ముంబై ఇండియన్స్ కు చెందిన ఓ ప్రతినిధి మాట్లాడుతూ.. ‘ఆటగాళ్లు, వాళ్ల కుటుంబసభ్యులకు ఒకరితో ఒకరు అనుబంధం ఏర్పాటు చేసేందుకు ప్రోత్సహిస్తుంది. ఆటగాళ్లు విశ్రాంతి తీసుకోవడంతో పాటు బ్యాలెన్స్డ్ లైఫ్ గడపడానికి ఇలాంటి వాతావరణం ఎంతగానో ఉపయోగపడుతుంది.
ఆటగాళ్ల భద్రత విషయంలో ఎంఐ ఒక బెంచ్ మార్క్ సెట్ చేసింది. మేమంతా ఒక కుటుంబం. గత రెండేండ్లలో మేము చాలా సవాళ్లను ఎదుర్కున్నాం. అయితే మేము ‘వన్ ఫ్యామిలీ’ అనే సూత్రాన్ని మాత్రం ఎప్పుడూ మరువలేదు. ప్రతి ఆటగాడిని, వారి కుటుంబ సభ్యులను సంరక్షించడం మా బాధ్యత..’ అని తెలిపాడు.
మార్చి 27న ముంబై ఇండియన్స్ జట్టు ఢిల్లీ క్యాపిటల్స్ తో తొలి మ్యాచ్ ఆడాల్సి ఉంది. ఈ మేరకు జట్టు ప్రాక్టీస్ సెషన్ లో తలమునకలై ఉంది.