INDW vs AUSW : భారత్ విజయం... మూడోసారి ఫైనల్ కి
ICC Womens World Cup 2025 : ఆస్ట్రేలియాపై టీమిండియా అద్భుత విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ సూపర్ సెంచరీ, కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ అద్భుత బ్యాటింగ్ తో టీమిండియాకు విజయాన్ని అందించారు.

టీమిండియాదే విజయం
ICC Womens World Cup 2025 : స్వదేశంలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఐసిసి ఉమెన్స్ వరల్డ్ కప్ 2025 లో టీమిండియా అదరగొట్టింది. 339 పరుగుల భారీ విజయలక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా అద్భుత విజయం సాధించింది. జెమిమా రోడ్రిగ్స్ చివరివరకు నిలిచి (127 పరుగులు నాటౌట్) భారత్ ను విజయతీరాలకు చేర్చారు.
అదరగొట్టిన జెమిమా
ఓపెనర్లు షఫాలీ శర్మ (10 పరుగులు), స్మృతి మందానా (24 పరుగులు) 10 ఓవర్లలోపే ఔటయ్యారు. ఇలా 59 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడ్డ జట్టును కెప్టెన్ హర్మన్ ప్రీత్, జెమిమా రోడ్రిగ్స్ ఆదుకున్నారు. అయితే సెంచరీకి చేరువైన సమయంలో హర్మన్ ప్రీత్ (89 పరుగులు) ఔటయ్యారు. దీంతో బ్యాటింగ్ భారం మొత్తాన్ని భుజానేసుకున్న జెమిమా సెంచరీతో అదరగొట్టడమే కాదు టీమిండియాను విజయతీరాలకు చేర్చారు.
రిచా ఘోష్ మెరుపులు
రిచా ఘోష్ కీలక సమయంలో మెరుపులు మెరిపించారు. కేవలం 16 బంతుల్లోనే 26 పరుగులు చేశారు... ఇందులో 2 ఫోర్లు, 2 సిక్సర్లు ఉన్నాయి. వేగంగా ఆడే క్రమంలో ఆమె వికెట్ కోల్పోయారు. చివర్లో అమ్ జ్యోత్ కౌర్ తో కలిసి జెమిమా విజయాన్ని అందించారు.
ఆస్ట్రేలియాకు తప్పని ఓటమి
ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరిగిన సెమీ ఫైనల్లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా మొదట బ్యాటింగ్ చేసింది. టీమిండియా బౌలర్లను సమర్దవంతంగా ఎదుర్కొన్న ఆసిస్ బ్యాటర్లు 338 పరుగులు చేసి భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.
భారత్ విజయం
మ్యాచ్ ఆరంభంలోనే సహచర ఓపెపర్, కెప్టెన్ అలిస్సా హేలీ (5 పరుగులు) వికెట్ పడినా యువ క్రీడాకారిణి ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ఆసిస్ ఓపెనర్ క్రీజులో కుదురుకున్నాక చెలరేగి సెంచరీ చేసింది... కేవలం 93 బంతుల్లోనే 119 పరుగులు చేసింది. ఈమెకు ఎల్లిసె పెర్రి (77 పరుగులు) చక్కని సహకారం అందించడంతో ఆసిస్ భారీ స్కోరు సాధించగలిగింది. చివర్లో గార్డ్నెర్ కేవలం 45 బంతుల్లోనే 63 పరుగులతో మెరిసింది.
భారత బౌలర్లలో రేణుకా సింగ్ ఒక్కరే ఎక్కువ పరుగులు సమర్పించకుండా బౌలింగ్ చేశారు... మిగతావారి బౌలింగ్ లో పరుగుల వరద పారింది. దీప్తి శర్మ బౌలింగ్ లో అయితే ఏకంగా 73 పరుగులు రాబట్టుకున్నారు ఆసిస్ బ్యాటర్లు. ఇక క్రాంతి గౌడ్ 58, అమన్ జ్యోత్ కౌర్ 51, రాధ యాదవ్ 66 పరుగులు సమర్పించుకున్నారు. శ్రీచరణి పరవాలేదనిపించింది... 49 పరుగులు ఇచ్చినా రెండు వికెట్లు పడగొట్టింది.