IND vs ENG: ఇంగ్లాండ్‌ను చీల్చి చెండాడిన భారత్.. వాంఖడేలో సూపర్ విక్టరీ
IND vs ENG: భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ లో చివరి, 5వ టీ20 వాంఖడే మైదానంలో జరగ్గా.. ఇంగ్లాండ్ ను 150 పరుగుల తేడాతో టీమిండియా ఓడించింది. 5 మ్యాచ్‌ల టీ20 ఇంటర్నేషనల్ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది.

india vs england: వాంఖడే మైదానంలో టీమిండియా 150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్‌ను ఓడించి 5 మ్యాచ్‌ల టీ20 అంతర్జాతీయ సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. బ్యాట్‌తో 135 పరుగులతో మెరుపు ఇన్నింగ్స్ ఆడడమే కాకుండా బౌలింగ్ లో రెండు వికెట్లు తీసిన అభిషేక్ శర్మ ముంబైలో టీమిండియా విజయానికి హీరోగా నిలిచాడు. అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ తో భారత్ ఈ మ్యాచ్ లో 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టు 97 పరుగులకే ఆలౌట్ అయింది.
బ్యాటింగ్ తో దుమ్మురేపిన భారత జట్టు
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జోస్ బట్లర్ ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో భారత జట్టు మొదట బ్యాటింగ్ కు దిగింది. ఆరంభం నుంచే టీమిండియా ప్లేయర్లు ధనాధన్ ఇన్నింగ్స్ ఆడటంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది.
అభిషేక్ శర్మ సునామీ బ్యాటింగ్ తో అభిషేక్ శర్మ సెంచరీ బాదాడు. అభిషేక్ శర్మ మొదట 17 బంతుల్లోనే హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత దానిని సెంచరీగా మార్చాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ కొట్టాడు. ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ 135 పరుగుల తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 13 సిక్సర్లు బాదాడు. అతనికి తోడుగా శివమ్ దుబే 30, తిలక్ వర్మ 24, సంజూ శాంసన్ 16 పరుగులు చేయడంతో భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది.
150 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ పై గెలిచన భారత్
భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లాండ్ జట్టుకు భారత బౌలర్లు కోలుకోలేని షాక్ ఇచ్చాడు. సూపర్ బౌలింగ్ తో ఇంగ్లాండ్ జట్టు 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఇంగ్లాండ్ జట్టుకు మంచి అరంభం లభించింది కానీ, ఆ తర్వాత వరుసగా వికెట్లు కోల్పోయింది. ఇంగ్లాండ్ ప్లేయర్లలో ఫిల్ సాల్ట్ ఒక్కడే 55 పరుగులతో హాఫ్ సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు.
భారత్ బౌలింగ్ దెబ్బకు ఇంగ్లాండ్ లోని కేవలం ఇద్దరు ప్లేయర్లు మాత్రమే డబుల్ డిజిట్ అందుకోగా, మిగతా ప్లేయర్లు సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. దీంతో భారత జట్టు ఇంగ్లాండ్ పై 150 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. భారత బౌలర్లలో షమీ 3 వికెట్లు తీసుకున్నాడు. వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ, శివమ్ దుబే లు రెండేసి వికెట్లు తీసుకున్నారు.
బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన అభిషేక్ శర్మ
వాంఖడేలో పూర్తిగా అభిషేక్ శర్మ షో కనిపించిందని చెప్పాలి. అతను మొదట బ్యాటింగ్ తో అదరగొట్టాడు. ఆ తర్వాత బౌలింగ్ తో కూడా ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టాడు. భారతదేశం తరపున రెండవ వేగవంతమైన T20 ఇంటర్నేషనల్ ఫిఫ్టీని కొట్టిన తర్వాత, అభిషేక్ శర్మ 37 బంతుల్లో తన సెంచరీని పూర్తి చేశాడు. అంతర్జాతీయ టీ20ల్లో భారత బ్యాట్స్‌మెన్ చేసిన రెండో వేగవంతమైన సెంచరీ ఇది. 35 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి రోహిత్ శర్మ తనకంటే ముందున్నాడు.
ఇక బౌలింగ్ విషయానికి వస్తే అభిషేక్ తాను వేసిన ఒకే ఓవర్ లో రెండు వికెట్లు తీసుకున్నాడు. ఆ ఓవర్ లో మూడు పరుగులు మాత్రమే ఇచ్చాడు.
గిల్ రికార్డు బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
ఫిబ్రవరి 2 ఆదివారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఇంగ్లాండ్ తో జరిగిన ఐదవ, చివరి T20I సిరీస్‌లో టీమిండియా బ్యాటర్ అభిషేక్ శర్మ మరో రికార్డును సాధించాడు. టీ20ల చరిత్రలో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన భారత బ్యాటర్‌గా శుభ్‌మన్ గిల్ రికార్డును అభిషేక్ శర్మ బద్దలు కొట్టాడు.
2023 ఫిబ్రవరిలో అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో న్యూజిలాండ్‌పై 126 పరుగులతో రికార్డు సాధించాడు. ఇప్పుడు అభిషేక్ శర్మ 135 పరుగులతో గిల్ ను అధిగమించాడు. అలాగే, టీ20 ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత బ్యాటర్ (13)గా నిలిచాడు.