బంగ్లాపై విజయంతో సేఫ్ సైడ్‌లో భారత్.. అయినా సెమీస్ రేసు ఆసక్తికరమే..!
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో మరోసారి ఉత్కంఠ పోరులో భారత జట్టు అద్భుత విజయాన్ని అందుకుంది. బంగ్లాదేశ్ పై 5 పరుగుల తేడా (డక్‌వర్త్ లూయిస్ విధానంలో)తో విక్టరీ కొట్టి గ్రూప్ టాపర్ గా నిలిచింది. అయినా గ్రూప్-1లో మాదిరిగానే గ్రూప్-2లో కూడా సెమీస్ బెర్త్ లు ఇంకా ఖరారు కాలేదు.

అడిలైడ్ ఓవల్ వేదికగా బంగ్లాదేశ్ తో ముగిసిన మ్యాచ్ లో థ్రిల్లింగ్ విక్టరీ కొట్టిన భారత జట్టు.. టీ20 ప్రపంచకప్ సెమీస్ రేసులో మరో అడుగు ముందుకేసింది. బంగ్లాదేశ్ తో విజయం అనంతరం గ్రూప్-2 నుంచి అగ్రస్థానం దక్కించుకున్న టీమిండియా.. సెమీస్ బెర్త్ ను దాదాపుగా ఖాయం చేసుకున్నట్టే.
ఈ టోర్నీలో భారత్ ఇదివరకు నాలుగు మ్యాచ్ లు ఆడింది. భారత్, నెదర్లాండ్స్ తో గెలిచిన భారత్.. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ లో ఓడి బంగ్లాదేశ్ పై సూపర్ విక్టరీ కొట్టింది. దీంతో భారత్.. మూడు మ్యాచ్ లు గెలిచి ఒకటి ఓడి.. 6 పాయింట్లతో అగ్రస్థానానికి ఎగబాకింది.
పాయింట్లతో పాటు టీమిండియా నెట్ రన్ రేట్ (+0.746) కూడా ఆశాజనకంగా ఉంది. ఈ గ్రూప్ లో భారత్ తన తర్వాత మ్యాచ్ ను జింబాబ్వేతో ఆడాల్సి ఉంది. బంగ్లాదేశ్ పై విజయంతో భారత్ సెమీస్ బెర్త్ ను దాదాపు ఖాయం చేసుకున్నా ఇతర మ్యాచ్ ల ఫలితాలు కూడా దీనిని మార్చే అవకాశమున్నది.
గ్రూప్-2లో దక్షిణాఫ్రికా.. 3 మ్యాచ్ లు ఆడి రెండింటిలో గెలిచి (ఒకటి వర్షం కారణంగా ఫలితం తేలలేదు) ఐదు పాయింట్లతో ఉంది. ఆ జట్టు నెట్ రన్ రేట్ (+2.772) కూడా మెరుగ్గా ఉంది. సఫారీలు తమ తర్వాత మ్యాచ్ లలో పాకిస్తాన్, నెదర్లాండ్స్ తో ఆడనున్నారు. ఈ రెండు మ్యాచ్ లలో భాగంగా.. పాక్ తో సౌతాఫ్రికా ఓడితే మాత్రం బంగ్లాదేశ్ సెమీస్ రేసులోకి వస్తుంది. అప్పుడు ఈ రెండు జట్ల మధ్య సెమీస్ రేసు ఉండే అవకాశాలుంటాయి.
భారత్ తో ఓడినా సెమీస్ రేసు నుంచి బంగ్లాదేశ్ తప్పుకోలేదు. ఆ జట్టు తర్వాత మ్యాచ్ లో పాకిస్తాన్ తో ఆడాల్సి ఉంది. ఆ జట్టు పాకిస్తాన్ ను భారీ తేడాతో ఓడించి.. సఫారీలు పాక్ తో మ్యాచ్ తో పాటు నెదర్లాండ్స్ తోనూ ఓడితే షకిబ్ అల్ హసన్ జట్టు పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకుంటుంది.
సౌతాఫ్రికా గనక రేపు పాకిస్తాన్ తో జరుగబోయే మ్యాచ్ లో గనక గెలిస్తే సెమీస్ రేసులో గొడవే ఉండదు. సఫారీలు మళ్లీ గ్రూప్ టాపర్స్ గా వెళ్తారు. ఇప్పటికే జింబాబ్వే, నెదర్లాండ్స్ అనధకారికంగా సెమీస్ రేసు నుంచి నిష్క్రమించగా.. పాకిస్తాన్ కూడా ఇంటి బాట పడుతుంది. ఆ తర్వాత ఇండియా..జింబాబ్వేను ఓడిస్తే సెమీస్ కు దర్జాగా చేరుకోవచ్చు.