India vs New Zealand: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్ గా భారత్
India vs New Zealand: బ్యాటింగ్, బౌలింగ్ లో అదరగొట్టిన భారత్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తన జైత్రయాత్రను కొనసాగించింది. ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ ను చిత్తుగా ఓడించి ఛాంపియన్ గా నిలిచింది.

India vs New Zealand live, ICC Champions Trophy 2025 final: దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు విజయం సాధించింది. ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఛాంపియన్ గా నిలిచింది. భారత జట్టు విజయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అద్భుతమైన అర్ధ సెంచరీ ఇన్నింగ్స్ ను ఆడాడు. అలాగే, శ్రేయాస్ అయ్యర్, గిల్, అక్షర్ పటేల్, కేఎల్ రాహుల్ లు కీలకమైన ఇన్నింగ్స్ లతో భారత జట్టుకు విజయాన్ని అందించారు.
Image Credit: Getty Images
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ కు దిగింది న్యూజిలాండ్. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బౌలింగ్ తో న్యూజిలాండ్ 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 251 పరుగులు చేసింది. కీవీస్ టీమ్ లోని డారిల్ మిచెల్ 63 పరుగులు చేయగా, ఆల్ రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ 40 బంతుల్లో 53 పరుగులతో సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. అలాగే, రచిన్ రవీంద్ర, గ్లెన్ ఫిలిప్స్ 34 పరుగుల ఇన్నింగ్స్ లు ఆడారు.
252 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ కు దిగిన భారత జట్టుకు మంచి శుభారంభం లభించింది. శుభ్ మన్ గిల్, రోహిత్ శర్మలు భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. కీవీస్ బౌలింగ్ పై ఎదురుదాడికి దిగిన భారత జట్టు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 100 పరుగుల మార్కును అందుకుంది. ముఖ్యంగా రోహిత్ శర్మ సూపర్ బ్యాటింగ్ తో న్యూజిలాండ్ బౌలింగ్ ను దంచికొడుతూ హాఫ్ సెంచరీ పూర్తి చేశారు.
ఈ మ్యాచ్ లో రోహిత్ శర్మ సాధించిన హాఫ్ సెంచరీ ఛాంపియన్స్ ట్రోఫీలో వేగవంతమైన హాఫ్ సెంచరీగా రికార్డు సాధించింది. రోహిత్ శర్మ 76 పరుగుల వద్ద భారీ షాట్ ఆడబోయి వికెట్ల ముందు దొరికిపోయాడు.
Rohit Sharma. (Photo- BCCI X/@BCCI)
అయితే, ఆ తర్వాత శ్రేయాస్ అయ్యర్, అక్షర్ పటేల్ భారత ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. వీరి తర్వాత కేఎల్ రాహుల్, జడేజాలు భారత్ ను విజయానికి చేర్చారు. దీంతో భారత జట్టు మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీ ఛాంపియన్ గా నిలిచింది. రోహిత్ 76 పరుగులు, గిల్ 31 పరుగులు, అయ్యర్ 48 పరుగుల ఇన్నింగ్స్ లను ఆడారు. అలాగే, అక్షర్ పటేల్ 29 పరుగులు, హార్దిక్ 18 పరుగుల ఇన్నింగ్స్ ను ఆడారు. కేఎల్ రాహుల్ 34 పరుగులతో భారత్ ను విజయం పైపు నడిపించాడు. 4 వికెట్ల తేడాతో కీవీస్ పై భారత్ విజయం సాధించింది. రవీంద్ర జడేజా ఫోర్ తో మ్యాచ్ విన్నింగ్ రన్స్ కొట్టాడు.