- Home
- Sports
- Cricket
- W W W W W.. రాజ్‌కోట్‌లో వరుణ్ చక్రవర్తి సునామీ.. మూడో భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
W W W W W.. రాజ్‌కోట్‌లో వరుణ్ చక్రవర్తి సునామీ.. మూడో భారత ప్లేయర్‌గా సరికొత్త రికార్డు
IND vs ENG: భారత్, ఇంగ్లాండ్ మధ్య మూడో టీ20 మ్యాచ్ రాజ్‌కోట్‌లో జరిగింది. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి సునామీ సృష్టించాడు. ఇంగ్లాండ్ ఆటగాళ్లకు చుక్కలు చూపిస్తూ మూడో భారత బౌలర్ గా సరికొత్త రికార్డు సాధించాడు.

Varun Chakravarthy
Varun Chakravarthy: భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో భారత్ పై చేయి సాధించినట్టు కనిపించినా మ్యాచ్ ముగిసే సరికి ఫలితం పూర్తిగా మారిపోయింది. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరుసగా మూడోసారి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.
దీంతో తొలుత బ్యాటింగ్ కు వచ్చిన వెంటనే ఇంగ్లిష్ బ్యాట్స్ మెన్ పై భారత బౌలర్లు ఆధిపత్యం చెలాయించారు. రాజ్‌కోట్‌లో వరుణ్ చక్రవర్తి తన పంజా విప్పడంతో ఇంగ్లిష్ జట్టు పేకమేడలా కూలిపోయింది. వరుణ్ చక్రవర్తి మరోసారి తన కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ గణాంకాలు నమోదుచేశాడు.
5 వికెట్లతో అదరగొట్టిన వరుణ్ చక్రవర్తి
భారత్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో వరుణ్ చక్రవర్తి స్పిన్ బౌలింగ్‌కు ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ వద్ద సమాధానం లేకుండా పోతోంది. వరుణ్ చక్రవర్తి మిస్టరీ స్పిన్ మ్యాజిక్ రాజ్‌కోట్‌లో కూడా కనిపించింది. రాజ్‌కోట్‌లో జరిగిన మూడో టీ20లో ఐదు వికెట్లు తీశాడు. దీంతో భారత్ తరఫున ఒకటి కంటే ఎక్కువసార్లు ఐదు వికెట్లు తీసిన మూడో బౌలర్‌గా వరుణ్ చక్రవర్తి రికార్డు సాధించాడు.
దక్షిణాఫ్రికాతో జరిగిన చివరి టీ20 లో భారత్ తరఫున వరుణ్ చక్రవర్తి ఐదు వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు రాజ్‌కోట్‌లో జరిగిన టీ20లో రెండోసారి ఐదు వికెట్లు తీశాడు. దీంతో భారత స్టార్ ప్లేయర్లు భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్ లతో కూడిన ప్రత్యేక క్లబ్‌లో చేరాడు . వీరిద్దరూ టీ20ల్లో భారత్ తరఫున రెండుసార్లు ఐదు వికెట్లు తీసిన రికార్డును కలిగి ఉన్నారు.
భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ 2025 లో ఇప్పటికే 10 వికెట్లు తీసిన వరుణ్ చక్రవర్తి
మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి భారత్-ఇంగ్లాండ్ టీ20 సిరీస్ 2025 లో ఇప్పటికే 10 వికెట్లు తీసుకున్నాడు. రాజ్‌కోట్ టీ20లో జోస్ బట్లర్, జామీ స్మిత్, జేమీ ఓవర్‌టన్, బ్రైడన్ కార్సే, జోఫ్రా ఆర్చర్‌లను అవుట్ చేయడం ద్వారా ఇంగ్లాండ్‌ను దెబ్బకొట్టాడు.
ఇంగ్లండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు, చెన్నైలో జరిగిన రెండో మ్యాచ్‌లో 2 వికెట్లు తీశాడు. దీంతో భారత్, ఇంగ్లాండ్ మధ్య జరిగిన ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో 10 వికెట్లు తీసిన తొలి భారత బౌలర్‌గా కూడా నిలిచాడు.
వరుణ్ చక్రవర్తి టీ20 కెరీర్ ఇదే
2021లో వరుణ్ 6 మ్యాచ్‌లు ఆడి 2 వికెట్లు తీశాడు. ఆ తర్వాత అతనికి భారత జట్టులో చోటుదక్కడం కష్టమైంది. అయితే, దేశవాళీ క్రికెట్ లో అద్భుత ప్రదర్శనలు చేసి 2024 చివరలో తిరిగి జట్టులోకి వచ్చాడు. అప్పటి నుంచి 10 మ్యాచ్‌ల్లో 28 వికెట్లు తీశాడు. 2024లో 7 మ్యాచ్‌లు ఆడి 7 ఇన్నింగ్స్‌ల్లో 17 వికెట్లు తీశాడు.
ఇక 2025లో 3 మ్యాచ్‌ల్లో 10 వికెట్లు తీశాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అతను 17 మ్యాచ్‌లలో 16 ఇన్నింగ్స్‌లలో 14.75 సగటు, 6.84 స్ట్రైక్ రేట్‌తో 30 వికెట్లు తీశాడు. ప్రస్తుత సీరీస్ లో వరుణ్ చక్రవర్తి 10 వికెట్లతో టాప్ లో ఉన్నాడు.
రాజ్ కోట్ లో ఓటమి నుంచి తప్పించుకోలేకపోయిన భారత్
భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరిగిన మూడో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఓటమిని చవిచూసింది. రాజ్‌కోట్‌లో 26 పరుగుల తేడాతో భారత్ పై ఇంగ్లండ్ గెలిచింది. ఇంగ్లాండ్ టీమ్ తొలుత బ్యాటింగ్ లో బెన్ డకెట్ (51), లియామ్ లివింగ్ స్టన్ (43) మెరిశారు. వీరిద్దరి పటిష్ట ఇన్నింగ్స్‌తో ఇంగ్లండ్ టీమ్ భారత్ ముందు 172 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది.
అయితే, భారత్ ఆరంభం నుంచి వరుసగా వికెట్లు కోల్పోయి 26 పరుగుల తేడాతో ఓడిపోయింది. హార్దిక్ పాండ్యా 40 పరుగుల ఇన్నింగ్స్ ఆడినా జట్టును విజయతీరాలకు చేర్చడంలో విఫలమయ్యాడు. భారత్ 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేయగలిగింది.