INDvsAUS 2nd ODI: మళ్లీ విఫలమైన భారత బౌలింగ్... స్మిత్ మెరుపు సెంచరీ, ఆసీస్ భారీ స్కోరు...
INDvAUS: మొదటి వన్డేలో ఘోర ఓటమి తర్వాత కూడా భారత బౌలర్లు ఏ మాత్రం మెరుగవ్వలేదు. మొదటి వన్డేలో భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్న ఆసీస్, రెండో వన్డేలోనూ టాప్ బౌలింగ్ విభాగాన్ని ఉతికి ఆరేసి భారీ స్కోరు చేసింది. స్టీవ్ స్మిత్ మరోసారి మెరుపు సెంచరీ చేయగా డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ మొదటి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం చేశారు. లబుషేన్, మ్యాక్స్‌వెల్ కూడా హాఫ్ సెంచరీలు చేసుకోవడంతో నిర్ణీత 50 ఓవర్లు ముగిసేసరికి 4 వికెట్లు కోల్పోయి 389 పరుగుల భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. టీమిండియాపై వన్డేల్లో ఆస్ట్రేలియాకి ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం.
భారత బౌలర్లు మరోసారి ఆస్ట్రేలియా భారీ భాగస్వామ్యాన్ని బహుమతిగా ఇచ్చారు. ఓపెనర్లు డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ కలిసి మొదటి వికెట్‌కి 142 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు.
భారత బౌలర్ల వైఫల్యం కారణంగా వరుసగా రెండు మ్యాచుల్లోనూ మొదటి వికెట్‌కి శతాధిక భాగస్వామ్యం నమోదుకావడం విశేషం.
కెప్టెన్ ఆరోన్ ఫించ్ 69 బంతుల్లో 6 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 60 పరుగులు చేశాడు... ఫించ్‌ను అవుట్ చేసిన షమీ, భారత జట్టుకి మొదటి బ్రేక్ అందించాడు.
ఫించ్‌ను అవుట్ చేశామన్న ఆనందం భారత జట్టుకు ఎంతోసేపు నిలవలేదు. ఫామ్‌లో ఉన్న స్టీవ్ స్మిత్ వస్తూనే బౌండరీల మోత మోగించాడు...
డేవిడ్ వార్నర్ 77 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 83 పరుగులు చేశాడు... శ్రేయాస్ అయ్యర్ సూపర్ త్రోకి రనౌట్ అయ్యాడు వార్నర్....
గత మ్యాచ్‌లో 62 బంతుల్లో సెంచరీ బాదిన స్టీవ్ స్మిత్, మరోసారి అదే సీన్ రిపీట్ చేశాడు. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ 62 బంతుల్లో శతకం నమోదుచేశాడు స్టీవ్ స్మిత్...
టీమిండయాపై వరుసగా మూడు మ్యాచుల్లోనూ సెంచరీ చేసిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు స్టీవ్ స్మిత్...
టీమిండియాపై వన్డేల్లో, టెస్టుల్లో ఐదేసి సెంచరీలు చేసిన రెండో ఆస్ట్రేలియా ప్లేయర్‌గా నిలిచాడు స్టీవ్ స్మిత్. ఇంతకుముందు రికీ పాంటింగ్ కూడా ఈ ఘనత సాధించాడు.
64 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 104 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్‌ను హార్ధిక్ పాండ్యా అవుట్ చేశాడు. వెన్నెముక గాయం తర్వాత తొలిసారి బౌలింగ్ చేసిన పాండ్యా నాలుగు ఓవర్లు బౌలింగ్ చేశాడు.
నవ్‌దీప్ సైనీ, యజ్వేంద్ర చాహాల్ భారీగా పరుగులు సమర్పించుకోవడంతో హార్ధిక్ పాండ్యాతో 4 ఓవర్లు, మయాంక్ అగర్వాల్‌తో ఒక ఓవర్ బౌలింగ్ చేయించాడు విరాట్ కోహ్లీ...
స్టీవ్ స్మిత్ అవుట్ అయిన తర్వాత ఆసీస్ ప్లేయర్ మార్నస్ లుబషేన్ కూడా హాఫ్ సెంచరీతో చెలరేగాడు. మరోవైపు మ్యాక్స్‌వెల్ భారీ షాట్లతో బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
గత మ్యాచ్‌లో ఆకట్టుకున్న మహ్మద్ షమీ బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించాడు మ్యాక్స్‌వెల్. డెత్ ఓవర్లలో భారత బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకోవడంతో గత మ్యాచ్ కంటే ఎక్కువ పరుగులు చేసింది ఆస్ట్రేలియా.
భారత్‌పై పెద్దగా మంచి రికార్డు లేని లబుషేన్ 61 బంతుల్లో 5 ఫోర్లతో 60 పరుగులు చేయగా మ్యాక్స్‌వెల్ 29 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 63 పరుగులు చేశాడు.
వరుసగా రెండు వన్డేల్లో ప్రత్యర్థికి 350+ పరుగులు సమర్పించుకోవడం భారత జట్టుకి ఇది రెండోసారి. నాలుగేళ్ల క్రితం 2007 జనవరిలో ఇంగ్లాండ్‌పై వరుసగా రెండు మ్యాచుల్లో 350+ స్కోరు సమర్పించుకున్న టీమిండియా బౌలర్లు, ఈసారి మరింత చెత్త రికార్డును నమోదుచేశారు.
భారత బౌలర్లలో మహ్మద్ షమీ, జస్ప్రిత్ బుమ్రా, హార్ధిక్ పాండ్యా తలా ఓ వికెట్ తీయగలిగారు. నవ్‌దీప్ సైనీ 7 ఓవర్లలో 70 పరుగులు ఇవ్వగా, యజ్వేంద్ర చాహాల్ 9 ఓవర్లలో 71 పరుగులు సమర్పించాడు.