- Home
- Sports
- Cricket
- ఎంత ఆడినా కనికరించని బీసీసీఐ.. సంజూ శాంసన్‌కు బంపరాఫర్ ఇచ్చిన ఐర్లాండ్.. వెళ్తాడా..?
ఎంత ఆడినా కనికరించని బీసీసీఐ.. సంజూ శాంసన్‌కు బంపరాఫర్ ఇచ్చిన ఐర్లాండ్.. వెళ్తాడా..?
Sanju Samson: ప్రతిభ ఉన్నా బీసీసీఐ రాజకీయాలకు బలౌతున్న క్రికెటర్ల జాబితా తీస్తే ప్రస్తుతం ఆ జాబితాలో కేరళ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ముందువరుసలో ఉంటాడు. బీసీసీఐ అతడి టాలెంట్ ను తొక్కేస్తున్నా అతడు మాత్రం సంయమనంతో వ్యవహరిస్తున్నాడు.

భారత క్రికెట్ లో టాలెంట్ ఉన్నా అవకాశాలు రాక కెరీర్ నాశనమవుతున్న క్రికెటర్లలో సంజూ శాంసన్ ముందువరుసలో ఉంటాడు. భారత జట్టు తరఫున 2015లో అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగుపెట్టిన శాంసన్.. ఇప్పటివరకు టీమిండియాకు ఆడింది 27 మ్యాచ్‌లు.
తనకంటే జూనియర్లు, తన తర్వాత జట్టులోకి వచ్చిన ఆటగాళ్లకు సరిగ్గా ఆడకున్నా వరుసగా విఫలమవుతున్నా బీసీసీఐ అవకాశాలు ఇస్తూనే ఉంది. నాలుగైదు సిరీస్ లలో విఫలమైనా వారికి ఛాన్స్ లిచ్చే బీసీసీఐ.. శాంసన్ కు రెండు మ్యాచ్ లలో అవకాశమిచ్చి అతడు ఆడినా ఆడకున్నా పక్కనబెట్టేస్తున్నది. ఒకవేళ జట్టులోకి తీసుకున్నా బెంచ్ లోనే ఉంచుతున్నది.
దేశవాళీ, ఐపీఎల్ లో అత్యుత్తమ ప్రదర్శనతో అదరగొడుతున్న సంజూ.. తనను తాను ప్రతీ సీజన్ లోనూ నిరూపించుకుంటూనే ఉంటున్నాడు. అయినా బీసీసీఐ మాత్రం ఈ కేరళ కుర్రాడి కెరీర్ ను నాశనం చేస్తున్నదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీసీఐ మీద విసిగిపోయి ఉన్న సంజూ శాంసన్ కు ఐర్లాండ్ క్రికెట్ బంపరాఫర్ ఇచ్చినట్టు తెలుస్తున్నది.
ఐర్లాండ్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ ఆడాలని శాంసన్ ను కోరినట్టు సమాచారం. జాతీయ మీడియాలో వచ్చిన కథనాల మేరకు ఐర్లాండ్ క్రికెట్ ప్రతినిధులు శాంసన్ ను సంప్రదించినట్టు తెలుస్తున్నది. తమ దేశం తరఫున ఆడితే ఐర్లాండ్ ఆడే అన్ని మ్యాచ్ లకూ ఆడిస్తామని ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రతినిధులు శాంసన్ కు హామీ ఇచ్చారట.
వికెట్ కీపింగ్ స్కిల్స్ తో పాటు ఐపీఎల్ కెప్టెన్ గా కూడా చేసిన అనుభవమున్న శాంసన్ తమతో పాటు నడిస్తే భారీగా ముట్టజెప్పడానికి కూడా ఐర్లాండ్ బోర్డు ముందుకొచ్చిందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ ఆఫర్ ను సంజూ తిరస్కించినట్టు తెలుస్తున్నది.
అంతర్జాతీయ క్రికెట్ ఆడితే భారత జట్టు తరఫునే ఆడతానని, ఇతర దేశం తరఫున ఆడే ఉద్దేశం తనకు లేదని ఐర్లాండ్ ప్రతినిధులకు సంజూ చెప్పాడని కథనాలు వెలువడుతున్నాయి. బీసీసీఐ అవకాశమిచ్చినా ఇవ్వకున్నా తన ప్రయత్నం తాను చేస్తానని, అంతే తప్ప ఇతర దేశానికి ఆడబోనని వాళ్లకు స్పష్టం చేశాడట. అయితే కొంతమంది సంజూ ఫ్యాన్స్ మాత్రం అతడు వెళ్తేనే బాగుండు అన్న అభిప్రాయంలో ఉన్నారు.
బీసీసీఐ అతడి కెరీర్ ను నాశనం చేస్తున్న నేపథ్యంలో శాంసన్ వేరే దేశం తరఫున ఆడటమే బెటర్ అని, ఉన్ముక్త్ చంద్ కూడా బీసీసీఐతో వేగలేక యూఎస్ఎ తరఫున ఆడటానికి ఒప్పందం కుదుర్చుకోలేదా.?? అని గుర్తు చేస్తున్నారు. మరికొంతమంది మాత్రం బీసీసీఐ ఛాన్సులిచ్చినా ఇవ్వకున్నా సంజూ ఇండియాలోనే ఉంటానని చెప్పడం చూస్తే దేశం పట్ల అతడికి ఉన్న అభిమానం ఏంటో తెలుస్తున్నదని చెప్పుకుంటున్నారు.