- Home
- Sports
- Cricket
- ఇంత అవమానించాక కూడా భారత్‌కు వెళ్తారా..? నేనైతే వెళ్లను.. పీసీబీపై జావేద్ మియాందాద్ ఆగ్రహం
ఇంత అవమానించాక కూడా భారత్‌కు వెళ్తారా..? నేనైతే వెళ్లను.. పీసీబీపై జావేద్ మియాందాద్ ఆగ్రహం
ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ లలో పాల్గొనడంపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) అనుసరిస్తున్న తీరుపై ఆ జట్టు మాజీ క్రికెటర్ జావేద్ మియందాద్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.

భారత్ - పాక్ క్రికెట్ బోర్డులు ఎట్టుకేలకు ఆసియా కప్ లో ఆడేందుకు ఓ నిర్ణయానికి వచ్చిన విషయం తెలిసిందే. భారత జట్టు తాము పాకిస్తాన్ కు వచ్చే అవకాశమే లేదని తేల్చి చెప్పడంతో సుమారు 9 నెలల పాటు జరిగిన చర్చోపచర్చలు, వాదోపవాదాల తర్వాత పీసీబీ ప్రతిపాదించిన హైబ్రిడ్ మోడల్ ప్రకారం ఆగస్టు 31 నుంచి మొదలయ్యే ఈ టోర్నీలో భాగంగా పాక్ లో నాలుగు మ్యాచ్ లు శ్రీలంకలో 9 మ్యాచ్ లు జరుగుతాయి. అయితే ఆసియాకప్ లో హైబ్రిడ్ మోడల్ కు అంగీకారం తెలిపిన తర్వాత పాకిస్తాన్.. భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు కూడా అంగీకారం తెలిపిందన్న వార్తలు వచ్చాయి.
కానీ గత కొన్నిరోజులుగా పీసీబీ పూటకో మారుస్తున్నది. వన్డే వరల్డ్ కప్ లో ఆడేందుకు భారత్ కు వెళ్లాలంటే తమ ప్రభుత్వం అనుమతించాలని.. అంతేగాక తాము అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో అయితే ఆడమని చిత్ర విచిత్రమైన ప్రకటనలు చేస్తున్నది. ఈ వ్యాఖ్యలపై తాజాగా పీసీబీ దిగ్గజ క్రికెటర్ జావేద్ మియందాద్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
మియందాద్ మాట్లాడుతూ.. ‘2012, 2016లలో పాకిస్తాన్ జట్టు భారత్ కు వెళ్లింది. 2012లో ఇరు జట్ల మధ్య వైట్ బాల్ సిరీస్ జరుగగా 2016లో టీ20 వరల్డ్ కప్ జరిగింది. ఇప్పుడు (ఆసియా కప్) పాకిస్తాన్ కు రావడం భారత్ వంతు. ఒకవేళ నేనే గనక పాక్ కెప్టెన్ గా ఉండుంటే నేనైతే భారత్ కు వెళ్లేవాడిని కాదు. అది వరల్డ్ కప్ అయినా సరే ఆడకపోయేవాడిని.
మేం భారత్ తో ఆడేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. అదే తీరుగా వాళ్లు కూడా ఉండాలి. అంతిమంగా పాకిస్తాన్ క్రికెటే మాకు గొప్ప. మేం ఇప్పటికీ మా దేశం నుంచి మెరుగైన ఆటగాళ్లను అందిస్తున్నాం. కావున పాకిస్తాన్.. భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడకపోయినా పెద్దగా పోయేదేమీ లేదు..’అని అన్నాడు.
ఇక ఆసియా కప్ వివాదం ముగిసినా 2025లో అక్కడ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ జరుగనుంది. దీనికి కూడా భారత జట్టు టీమ్ ను పంపదని ఈ విషయంలో పీసీబీ.. వన్డే వరల్డ్ కప్ కు తమ టీమ్ కు భారత్ కు పంపే విషయంలో ఇప్పటికైనా ఆలోచించుకోవాలని సూచించాడు.
అవును. అది (ఛాంపియన్స్ ట్రోఫీలో పంపకపోవడం) వారి ప్రణాళికల్లో ఉంది. వాళ్లు టీమ్ ను పంపరు. ఆసియా కప్ కు కూడా పంపలేదు. ఇకనైనా పాకిస్తాన్ క్రికెట్ టీమ్ వన్డే వరల్డ్ కప్ లో వెళ్లే అంశంపై పునరాలోచించుకుంటే మంచిది..’అని చెప్పాడు.