నేనైతే కోహ్లిని టీ20లలో ఆడించను.. టీమిండియా మాజీ ఆటగాడి షాకింగ్ కామెంట్స్
Virat Kohli: పేలవ ఫామ్ తో వరుసగా విఫలమవుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లికి తాను టీ20లలో చోటు ఇవ్వనంటున్నాడు భారత జట్టు మాజీ ఆటగాడు అజయ్ జడేజా.

సుమారు మూడేండ్లుగా అంతర్జాతీయ క్రికెట్ లో సెంచరీ లేక విఫలమవుతున్న విరాట్ కోహ్లి తన ఆటతీరులో మార్పులు చేసుకోలేకపోతున్నాడు. ఇలాగే ఆడితే జట్టులో చోటు దక్కదనే వార్తలు వినిపిస్తున్నా అతడు మాత్రం అదే వైఫల్యాలను కొనసాగిస్తున్నాడు.
కాగా తాను ఒకవేళ టీ20 జట్టును ఎంపిక చేయాల్సి వస్తే మాత్రం విరాట్ కోహ్లిని ఎంపిక చేయనని కరాఖండీగా చెప్పేస్తున్నాడు టీమిండియా మాజీ ఆటగాడు అజయ్ జడేజా.
ఇండియా-ఇంగ్లాండ్ మధ్య శనివారం జరిగిన రెండో టీ20లో కోహ్లి ఒక్కటంటే ఒక్కటే పరుగు చేసి విఫలమయ్యాడు. ఈ నేపథ్యంలో మ్యాచ్ అనంతరం జరిగిన చర్చలో జడేజా ఈ వ్యాఖ్యలు చేశాడు.
అజయ్ జడేజా మాట్లాడుతూ.. ‘విరాట్ కోహ్లి చాలా ప్రత్యేకమైన ఆటగాడు. ఒకవేళ అలా కాకుంటే అతడు కోహ్లినే కాదు. అతడు టెస్టు క్రికెట్ కూడా ఆడి ఉండేవాడు కాదు.
Image credit: Getty
కోహ్లి నెంబర్లను చూపించి అయ్యో అతడు గత కొన్ని మ్యాచులుగా సెంచరీలు చేయడం లేదనడం.. తద్వారా కోహ్లిని తప్పించడం కరెక్ట్ కాదు. ఒక జట్టును ఎంపిక చేసేప్పుడు మీరు (టీమ్ సెలక్షన్ కమిటీ) ఎవరిని ఆడించాలనేదానిపై తుది నిర్ణయం ఉంటుంది.
ఒకవేళ నేను గనక టీ20 జట్టును సెలక్ట్ చేయాల్సి వస్తే మాత్రం టీ20లలో అతడిని తీసుకోను..’ అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒకవైపు కోహ్లిని గొప్ప ఆటగాడని పొగుడుతూనే జడేజా.. తాను సెలక్టర్ అయితే టీ20 లో తీసుకోనని వ్యాఖ్యానించడం గమనార్హం.
ఐపీఎల్ తర్వాత సుమారు నెల రోజుల విరామం తీసుకున్న కోహ్లి.. ఎడ్జబాస్టన్ టెస్టులో రెండు ఇన్నింగ్స్ లలో కలిపి 31 పరుగులే చేశాడు. ఇక ఇంగ్లాండ్ తో రెండో టీ20లో కూడా ఒక్క పరుగు మాత్రమే చేసి ఔటయ్యాడు.