రాహుల్ ప్లేస్‌లో సర్ఫరాజే కరెక్ట్.. రవిశాస్త్రి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
WTC Finals 2023: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ -2023కి బీసీసీఐ ఎంపిక చేసిన జట్టులో ఇషాన్ కిషన్ ను తీసుకోవడం విమర్శలకు దారి తీస్తున్నది.

ఐపీఎల్ -16 సీజన్ ముగిసిన తర్వాత భారత జట్టు ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా జూన్ 7 నుంచి 11 మధ్య ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మేరకు గతంలోనే ప్రకటించిన జట్టులో కెఎల్ రాహుల్ గాయపడటంతో అతడి స్థానాన్ని బీసీసీఐ ముంబై ఇండియన్స్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ ను ఎంపిక చేసింది.
కిషన్ ఎంపికపై పలువురు పెదవి విరుస్తున్నారు. దేశవాళీలో పరుగుల సునామీ సృష్టిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ ను కాదని ఇషాన్ ను ఎంపిక చేయడం ఎంతవరకు సబబని నెటిజన్లతో పాటు మాజీ క్రికెటర్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా ఇదే వివాదంపై టీమిండియా మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి స్పందించాడు.
Image credit: Getty
శాస్త్రి మాట్లాడుతూ.. ‘భరత్ ఇకనైనా ఆడాలి. ఇంగ్లాండ్ లో ఆడేప్పుడు అక్కడి పరిస్థితులను బట్టి ఇద్దరు స్పిన్నర్లతో ఆడాలని చూస్తే మీరు మీ బెస్ట్ కీపర్ తో ఆడాలి. ఆ కీపర్ మంచి బ్యాటర్ కూడా అయ్యుంటే మరీ మంచిది. ఈ సమయంలో సర్ఫరాజ్ ఖాన్ బాగా ఉపయోగపడతాడు.
దేశవాళీ క్రికెట్ లో అతడు వండర్స్ చేస్తున్నాడు. ఒకవేళ అతడే వికెట్ల వెనుక ఉంటే అది భారత్‌కు మేలు చేసేదే..’ అని అన్నాడు. ఇషాన్ కిషన్ కూడా మంచి వికెట్ కీపరేనని తెలిపిన శాస్త్రి.. గత కొంతకాలంగా అతడు పదే పదే విఫలమవుతున్న విషయాన్ని ప్రస్తావించాడు.
ఇక జయదేవ్ ఉనద్కత్ కూడా గాయంతో సతమతమవుతన్న వేళ అతడు కూడా డబ్ల్యూటీసీ ఫైనల్ నుంచి తప్పుకుంటే పంజాబ్ కింగ్స్ కు ఆడుతున్న అర్ష్‌దీప్ సింగ్ ను ఎంపిక చేయాలని శాస్త్రి అభిప్రాయపడ్డాడు. అతడికి బంతిని స్వింగ్ చేసే టాలెంట్ ఉందని.. అంతేగాక రెడ్ బాల్ క్రికెట్ లో అతడికి మంచి రికార్డు (దేశవాళీలో) కూడా ఉందని శాస్త్రి తెలిపాడు.