INDW vs AUSW : అతిచిన్న వయసులో అదిరిపోయే రికార్డు.. ఏకంగా 627 పరుగులా..!
ICC Womens World Cup 2025 INDW v AUSW : ఆసిస్ ఓపెనర్ ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుత ఫామ్ ను కొనసాగిస్తూ టీమిండియాపై మరోసారి పైచేయి సాధించింది. సెమిఫైనల్లో అద్భుత సెంచరీతో అదరగొట్టింది.

ఆసిస్ ఓపెనర్ రికార్డుల మోత
ICC Womens World Cup 2025 : స్వదేశంలో జరుగుతున్న మహిళల వరల్డ్ కప్ 2025 లో టీమిండియా తడబాటు కొనసాగుతోంది. అదృష్టం బాగుండి చివరి క్షణంలో సెమీఫైనల్ కి చేరినా మన మహిళా క్రికెటర్ల ఆటతీరులో మార్పు రావడంలేదు. కీలకమైన సెమీఫైనల్లో భారత బౌలర్లు తేలిపోయారు... దీంతో ప్రత్యర్థి జట్టు భారీ పరుగులు సాధించింది. ముంబైలోని డివై పాటిల్ స్టేడియంలో జరుగుతున్న వరల్డ్ కప్ సెమీఫైనల్లో మొదట బ్యాటింగ్ కు దిగిన ఆస్ట్రేలియా 338 పరుగులు చేసింది. చివర్లో భారత బౌలర్లు వికెట్లు పడగొట్టినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది.
అదరగొట్టిన లిచ్‌ఫీల్డ్
మ్యాచ్ ఆరంభంలోనే సహచర ఓపెనర్, కెప్టెన్ అలిస్సా హేలీ (5 పరుగులు) వికెట్ పడినా యువ క్రీడాకారిణి ఫోబ్ లిచ్‌ఫీల్డ్ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకుంది. ఈ ఆసిస్ ఓపెనర్ క్రీజులో కుదురుకున్నాక ఆకాశమే హద్దుగా చెలరేగి సెంచరీ చేసింది... కేవలం 93 బంతుల్లోనే 119 పరుగులు చేసింది. ఈమెకు ఎల్లిసె పెర్రి (77 పరుగులు) చక్కని సహకారం అందించడంతో ఆసిస్ భారీ స్కోరు సాధించగలిగింది. చివర్లో గార్డ్నెర్ కేవలం 45 బంతుల్లోనే 63 పరుగులతో మెరిసింది.
అతిచిన్న వయసులో సెంచరీ రికార్డు
ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ సెమీఫైనల్ మ్యాచ్‌లో సెంచరీతో ఫోబ్ లిచ్‌ఫీల్డ్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన అతి పిన్న వయస్కురాలిగా... ఈ మెగా టోర్నమెంట్ చరిత్రలో ఆస్ట్రేలియా తరఫున సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కురాలిగా నిలిచింది. లిచ్‌ఫీల్డ్ 127.95 స్ట్రైక్ రేట్‌తో పరుగులు సాధించి రికార్డులు నెలకొల్పింది.
భారత్ పై లిచ్‌ఫీల్డ్ రికార్డు
ఎప్పటిలాగే టీమిండియాపై తన ఫామ్ ను కొనసాగించింది లిచ్‌ఫీల్డ్. ఇప్పటివరకు భారత్ పై ఆడిన తొమ్మిది ఇన్నింగ్స్‌లలో 69.66 సగటుతో 627 పరుగులు చేసింది. ఇందులో రెండు సెంచరీలు, నాలుగు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఆమె అత్యుత్తమ స్కోరు తాజాగా సాధించిన 119 పరుగులే. మహిళల వన్డేలలో భారత్‌పై ఆమె ఎప్పుడూ 25 పరుగుల కంటే తక్కువ స్కోరుకు ఔట్ కాలేదు.
50 ఓవర్ల ప్రపంచ కప్ నాకౌట్ మ్యాచ్‌లో సెంచరీ చేసిన మూడో ఆసీస్ ప్లేయర్‌గా ఆమె నిలిచింది. కెప్టెన్ హీలీ (2022 ప్రపంచ కప్ ఫైనల్‌లో ఇంగ్లండ్‌పై 170, 2022 సెమీఫైనల్‌లో వెస్టిండీస్‌పై 129), కరెన్ రోల్టన్ (2005 ఎడిషన్ ఫైనల్‌లో భారత్‌పై 107*) సరసన చేరింది. 22 ఏళ్ల 195 రోజుల వయసులో మహిళల ప్రపంచ కప్‌లో సెంచరీ చేసిన రెండో అతి పిన్న వయస్కురాలైన ఆసీస్ ప్లేయర్‌గా నిలిచింది.
సెమీఫైనల్లో ఆడుతున్న జట్లివే..
భారత మహిళల జట్టు (ప్లేయింగ్ XI):
షఫాలీ వర్మ, స్మృతి మంధాన, అమన్‌జోత్ కౌర్, హర్మన్‌ప్రీత్ కౌర్(కెప్టెన్), జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, రిచా ఘోష్(వికెట్ కీపర్), రాధా యాదవ్, క్రాంతి గౌడ్, శ్రీ చరణి, రేణుకా సింగ్ ఠాకూర్
ఆస్ట్రేలియా మహిళల జట్టు (ప్లేయింగ్ XI):
ఫోబ్ లిచ్‌ఫీల్డ్, అలిస్సా హీలీ(వికెట్ కీపర్/కెప్టెన్), ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ, అనాబెల్ సదర్లాండ్, ఆష్లీ గార్డనర్, తహ్లియా మెక్‌గ్రాత్, సోఫీ మోలినెక్స్, అలనా కింగ్, కిమ్ గార్త్, మేగాన్ షుట్.