ఇండియా - పాక్ మ్యాచ్‌కు వేదిక ఖరారు.. ఐపీఎల్ ముగిసిన వెంటనే వరల్డ్ కప్ షెడ్యూల్..?
ODI World Cup 2023: ఈ ఏడాది అక్టోబర్ నుంచి భారత్ వేదికగా వన్డే వరల్డ్ కప్ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు బీసీసీఐ త్వరలోనే కీలక అప్డేట్స్ ఇవ్వనుంది.

ఈ ఏడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే భారత్ రెండు వరల్డ్ కప్ లు ఆడనుంది. ఇందులో ఒకటి జూన్ 7 నుంచి 11 వరకు ఇంగ్లాండ్ లోని ది ఓవల్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగబోయే ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ కాగా మరొకటి వన్డే వరల్డ్ కప్. వరల్డ్ కప్ అక్టోబర్ లో జరగాల్సి ఉంది.
ఇక ఐసీసీ టోర్నీలు అంటే భారత్ - పాకిస్తాన్ మ్యాచ్ కు ఉండే క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పన్లేదు. ఇరు దేశాల మధ్య నానాటికీ క్షీణిస్తున్న సంబంధాలు.. ఐసీసీ టోర్నీలలో భారత్ - పాక్ మ్యాచ్ లకు కావాల్సినంత క్రేజ్ ను తెచ్చిపెడుతున్నాయి. ఈ మ్యాచ్ అంటేనే అభిమానులు పనులు మానుకుని టీవీల ముందు కూర్చునే పరిస్థితి వచ్చింది.
కాగా ఈ ఏడాది అక్టోబర్ నుంచి జరుగబోయే వన్దే వరల్డ్ కప్ లో కూడా భారత్ - పాక్ మ్యాచ్ మరోసారి అభిమానులను అలరించనుంది. ఈ మ్యాచ్ ను ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియం అయిన గుజరాత్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగనుందని సమాచారం. ఈ మేరకు బీసీసీఐ షెడ్యూల్ కు ఫైనల్ టచ్ ఇస్తున్నట్టు తెలుస్తున్నది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన కథనం మేరకు.. పది జట్లు పాల్గొనబోయే ఈ మెగా టోర్నీలో షెడ్యూల్ రూపకల్పన తుదిదశలో ఉంది. 46 రోజుల పాటు 48 మ్యాచ్ లు జరుగనున్న వరల్డ్ కప్ అక్టోబర్ 5 నుంచి జరగనుందని సమాచారం. దేశంలోని 11 నగరాల్లో (సెమీస్, ఫైనల్స్ తో కలిపి మొత్తం 14) ఈ మ్యాచ్ లను నిర్వహించనున్నారు.
భారత్ - పాక్ మధ్య జరుగబోయే మ్యాచ్ ను అహ్మదాబాద్ లో నిర్వహించేందుకు బీసీసీఐ సిద్ధమైంది. ఈ ఒక్క మ్యాచ్ మినహా పాకిస్తాన్ ఆడే మ్యాచ్ లు చాలావరకూ బెంగళూరు, చెన్నైలలోనే నిర్వహించనున్నారు. అదీ కాకుంటే కోల్కతా కూడా ఆప్షన్ గా ఉంది. బంగ్లాదేశ్ మ్యాచ్ లు ఎక్కువగా కోల్కతా, గువహతి లలో నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నది.
ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఐపీఎల్ - 2023 ముగిసిన తర్వాత విడుదల చేసేందుకు బీసీసీఐ సన్నాహకాలు చేస్తున్నది. భారీ కార్యక్రమం నిర్వహించి వరల్డ్ కప్ నిర్వహణ చేపట్టాలని బీసీసీఐ పెద్దలు భావిస్తున్నారు. దీనిపై త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.