- Home
- Sports
- Cricket
- నా వల్ల టీమ్ ఓడిపోయింది.. నెల రోజుల పాటు నా భార్యకు ఫోన్ చేసి ఏడ్చేవాడిని : ఇషాంత్ శర్మ
నా వల్ల టీమ్ ఓడిపోయింది.. నెల రోజుల పాటు నా భార్యకు ఫోన్ చేసి ఏడ్చేవాడిని : ఇషాంత్ శర్మ
టీమిండియా వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మ తన కెరీర్ లో లోయెస్ట్ ఫేస్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఒక్క ఓవర్ వల్ల తన కెరీర్ మొత్తం నాశనమైన విషయాన్ని వెల్లడించాడు.

టీమిండియాలోకి కొత్త బౌలర్లు వస్తుండటంతో వెటరన్ బౌలర్ ఇషాంత్ శర్మకు అవకాశాలు తగ్గిపోయాయి. కానీ భారత జట్టు తరపున వంద టెస్టులు ఆడిన బౌలర్ గా ఇషాంత్ తన పేరిట పలు రికార్డులు బ్రేక్ చేశాడు. పరిమిత ఓవర్ల క్రికెట్ లో అంత గొప్పగా రాణించకపోయినా టెస్టులలో మాత్రం ఇషాంత్ కు మంచి రికార్డులున్నాయి.
ఇషాంత్ తాజాగా క్రిక్ బజ్ నిర్వహిస్తున్న ‘రైజ్ ఆఫ్ న్యూ ఇండియా’ కార్యక్రమంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 2013లో ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చినప్పుడు మొహాలీ వేదిగకా ముగిసిన మ్యాచ్ లో తన వల్ల భారత్ ఓడినందుకు చాలా బాధపడ్డానని, నెలరోజుల పాటు తన భార్యకు ఫోన్ చేసి ఏడ్చేవాడినని చెప్పాడు.
ఇషాంత్ మాట్లాడుతూ.. ‘నా కెరీర్ లో అత్యంత క్షీణ దశ అంటే 2013లో చూశాను. ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు రాగా మొహాలీలో మూడో వన్డే జరిగింది. ఆ మ్యాచ్ లో భారత్ నా వల్లే ఓడిపోయింది. అది నాకు చాలా బాధగా అనిపించింది. మ్యాచ్ ముగిశాక కనీసం నెల రోజుల పాటు నేను కోలుకోలేదు.
అదే రోజు సాయంత్రం ధోని భాయ్, శిఖర్ ధావన్ నా రూమ్ కు వచ్చి నన్ను ఓదార్చారు. ఆ తర్వాత నెల రోజులూ నా భార్యకు ఫోన్ చేసి ఏడ్చేవాడిని. రోజూ ఉదయాన్నే ఫోన్ చేయడం.. కొద్దిసేపు ఏడ్వడం ఇదే నా పనిగా ఉండేది. ఆ ఒక్క మ్యాచ్ వల్ల నేను పరిమిత ఓవర్లకు పనికిరాననే అభిప్రాయం ఏర్పడింది..’అని చెప్పాడు. కాగా ఇషాంత్ కు అప్పటికీ పెళ్లి కాలేదు. 2016లో ఈ ఇద్దరూ వివాహం చేసుకున్నారు.
2013లో భారత పర్యటనలో ఉన్న ఆస్ట్రేలియా.. మొహాలీ వేదిగకా మూడో వన్డే జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇండియా.. నిర్ణీత 50 ఓవర్లలో 303 పరుగులు చేసింది. ధోని (139), కోహ్లీ (68) రాణించారు.
లక్ష్య ఛేదనలో ఆసీస్.. తొలుత తడబడింది. కానీ ఆడమ్ వోగ్స్ (76), జార్జ్ బెయిలీ (43) లు ఆసీస్ ను ఆదుకున్నారు. చివరి 3 ఓవర్లలో ఆసీస్ 44 పరుగులు చేయాల్సి ఉండగా.. జేమ్స్ ఫాల్కనర్ విశ్వరూపం చూపాడు. ఇషాంత్ శర్మ వేసిన 48వ ఓవర్లో ఫాల్కనర్.. ఒక బౌండరీ, నాలుగు సిక్సర్లతో 30 పరుగులు పిండుకున్నాడు.
దీంతో మరో 3 బంతులు మిగిలుండగానే ఆసీస్.. విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ తర్వాత ఇషాంత్ వన్డేలలో పెద్దగా కనిపించలేదు. 2016 తర్వాత అతడు వన్డేలకు పూర్తిగా దూరమయ్యాడు. గతేడాది వరకు టెస్టు క్రికెట్ లో అడపాదడపా కనిపించిన ఇషాంత్.. దక్షిణాఫ్రికా పర్యటన తర్వాత పూర్తిగా కనుమరుగయ్యాడు.