విరాట్ కోహ్లీ ఓ అద్భుతమైన కెప్టెన్... రెండో టెస్టు కోసం ఎదురుచూస్తున్నా... జమైకా స్ప్రింటర్ యొహాన్ బ్లేక్
భారత జట్టుకి అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ. స్వదేశంలో అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోనీ రికార్డుకి ఒక్క టెస్టు దూరంలో ఉన్న విరాట్ కోహ్లీ, విదేశాల్లో అత్యధిక విజయాలు అందుకున్న భారత కెప్టెన్‌గా ఉన్నాడు. తొలి టెస్టు ఓటమి తర్వాత అందరూ కోహ్లీ కెప్టెన్సీ తొలగించాలని కామెంట్లు చేస్తుంటే, జమైకా చిరుత యోహాన్ బ్లేక్ మాత్రం విరాట్ కెప్టెన్సీకి వీరాభిమానినంటూ ప్రకటించాడు.
మహేంద్ర సింగ్ ధోనీ నుంచి టెస్టు కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న సమయంలో భారత జట్టు ర్యాంకింగ్స్‌లో ఏడో స్థానంలో ఉంది. అలాంటి టీమిండియాను టాప్ టీమ్‌గా మార్చాడు విరాట్ కోహ్లీ. విదేశాల్లో అసాధ్యమైన విజయాలు సాధించి, భారత జట్టును టాప్ టీమ్‌లలో ఒకటిగా నిలిపాడు. అయితే తొలి టెస్టు ఓటమి తర్వాత రహానేకి కెప్టెన్సీ ఇవ్వాలనే చర్చ వినిపిస్తోంది.
‘భారత్, ఇంగ్లాండ్ మధ్య తొలి టెస్టు చూశాను. ఎంతో గొప్పగా సాగిందీ మ్యాచ్. ముఖ్యంగా జో రూట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. శ్రీలంకపై వరుస సెంచరీలు చేసిన జో రూట్, టీమిండియాపైనా సెంచరీ చేయడం చూసి ఆశ్చర్యమేసింది. ఇంగ్లాండ్ పేసర్ జేమ్స్ అండర్సన్‌కి నేను అభిమానిని అయిపోయా...
38 ఏళ్ల వయసులో అండర్సన్ బౌలింగ్ చూస్తుంటే... వయసు కేవలం ఓ నెంబర్ మాత్రమేనని అనిపిస్తోంది. ఈ వయసులో కూడా అండర్సన్ బౌలింగ్‌లో పదును ఏ మాత్రం తగ్గలేదు... ఇంగ్లాండ్ ప్రదర్శన బాగున్నా, నాలుగో రోజు టీమిండియా కమ్‌బ్యాక్ ప్రదర్శనతో ఆకట్టుకుంది...
ముఖ్యంగా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సారథ్యం నాకెంతో ఇష్టం.తప్పులను అంగీకరించే తత్వం అందరికీ ఉండదు. స్టార్ క్రికెటర్‌గా రాణిస్తున్నా విరాట్ కోహ్లీ తప్పులను అంగీకరిస్తాడు. వైఫల్యాన్ని ఒప్పుకుంటాడు... అందుకే కోహ్లీ అంటే నాకెంతో అభిమానం... జట్టు ప్రణాళికల గురించి ఆలోచిస్తామని కోహ్లీ చెప్పిన మాట నాకెంతో నచ్చింది...
భారత యంగ్ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్, ఛతేశ్వర్ పూజారా బ్యాటింగ్ నాకెంతో నచ్చాయి. ఆస్ట్రేలియాలో ఆఖరి టెస్టులో పూజారా పోరాటాన్ని చూసి ఆశ్చర్యపోయాను. రిషబ్ పంత్ దూకుడైన క్రికెట్‌ను బాగా ఎంజాయ్ చేస్తాను... ఆస్ట్రేలియా టూర్‌లో రహానే మంచి మార్కులు తెచ్చుకున్నాడు. కానీ నా దృష్టిలో కోహ్లీయే టాప్ కెప్టెన్’ అంటూ కామెంట్ చేశాడు జమైకా స్ప్రింటర్ యొహానా బ్లేక్.
2011 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో జమైకా స్ప్రింటర్ యొహానా బ్లేక్, 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణ పతకాన్ని సాధించాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు పందెంలో లెజెండ్‌గా అవతరించిన ఉసేన్ బోల్డ్ కంటే ముందు టాప్ స్ప్రింటర్‌గా, అత్యంత వేగవంతమైన స్ప్రింటర్‌గా రికార్డులు సృష్టించారు యొహానా బ్లేక్.