- Home
- Sports
- Cricket
- జింబాబ్వేపై కోహ్లీ చీప్ సెంచరీ చేస్తాడేమో.. దానివల్ల ఒరిగేదేమీ లేదు: కివీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు
జింబాబ్వేపై కోహ్లీ చీప్ సెంచరీ చేస్తాడేమో.. దానివల్ల ఒరిగేదేమీ లేదు: కివీస్ మాజీ ఆల్‌రౌండర్ ఆసక్తికర వ్యాఖ్యలు
Virat Kohli: విండీస్ తర్వాత జరగాల్సి ఉన్న జింబాబ్వే సిరీస్ లో విరాట్ కోహ్లీని ఆడించాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నది. జింబాబ్వే వంటి అనామక జట్టుపై ఆడితే అయినా కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేస్తాడని..

సుమారు మూడేండ్లుగా సెంచరీ మార్కు అందుకోలేక చతికిలపడుతున్న టీమిండియా మాజీ సారథి విరాట్ కోహ్లీ ప్రస్తుతం విరామ సమయాన్ని కుటుంబంతో ఎంజాయ్ చేస్తున్నాడు. అతడు విండీస్ సిరీస్ తర్వాత తిరిగి జట్టులోకి వస్తాడా..? రాడా..? అనేది అనుమానంగానే ఉంది.
విండీస్ తో టీ20 సిరీస్ ముగిశాక భారత జట్టు నేరుగా జింబాబ్వే పర్యటనకు వెళ్లాల్సి ఉంది. అక్కడ జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడుతుంది. అయితే ఈ సిరీస్ కు ద్వితీయ శ్రేణి జట్టే వెళ్లే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆగస్టు 18 నుంచి 22 వరకు జింబాబ్వేతో మూడు వన్డేలు ఆడనున్నది టీమిండియా.
Image credit: Getty
ఈ సిరీస్ లో విరాట్ కోహ్లీని ఆడించాలని టీమిండియా యాజమాన్యం భావిస్తున్నది. జింబాబ్వే వంటి అనామక జట్టుపై ఆడితే అయినా కోహ్లీ తిరిగి ఫామ్ లోకి వచ్చి సెంచరీ చేస్తాడని.. తద్వారా అతడిలో ఆత్మవిశ్వాసం పెరిగి ఆసియా కప్ తో పాటు వచ్చే టీ20 ప్రపంచకప్ వరకు మునపటి ఫామ్ అందుకుంటాడని సెలక్టర్లు భావిస్తున్నారు.
ఇదిలాఉండగా కోహ్లీని జింబాబ్వేతో ఆడించడంపై కివీస్ మాజీ ఆల్ రౌండర్ స్కాట్ స్టైరిస్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. జింబాబ్వేతో ఆడి సెంచరీ చేసినా కోహ్లీ ఫామ్ లో పెద్దగా మార్పులేమీ ఉండవని చెప్పాడు.దానికంటే అతడు ఇంకొన్ని రోజులు సెలవు తీసుకోవడమే ఉత్తమమని తెలిపాడు.
స్టైరిస్ మాట్లాడుతూ... ‘కోహ్లీ జింబాబ్వేతో ఆడితే దానివల్ల అతడికి వచ్చే ఉపయోగమేమీ లేదు. ఒకవేళ ఆ జట్టుతో ఆడి కోహ్లీ చీప్ సెంచరీ చేసినా అతడు తిరిగి ఫామ్ లోకి వస్తాడనుకోవడం భ్రమే. నన్నడిగితే అతడు ఇంకొన్ని రోజులు రెస్ట్ తీసుకోవడమే ఉత్తమం.
కోహ్లీ టీ20 ప్రపంచకప్ కు సన్నద్ధమయ్యేలా జట్టు యాజమాన్యం చర్యలు తీసుకోవాలి. ప్రస్తుతానికి కోహ్లీ ఫామ్ కోల్పోయినా అతడు ఇప్పటికీ ప్రమాదకర ఆటగాడే...’ అని తెలిపాడు.
జింబాబ్వే పర్యటనలో కోహ్లీని ఎంపిక చేయాలని సెలక్టర్లు భావిస్తున్నా దీనిపై అతడు ఇంకా స్పందించలేదు. బహుశా ఈ సిరీస్ తర్వాతే ఆసియా కప్ కూడా ప్రారంభమవుతుండటంతో జింబాబ్వే సిరీస్ ను కాదనుకుని నేరుగా ఆసియా కప్ లోనే కోహ్లీ బరిలోకి దిగే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.