ఆర్సీబీ, నన్ను మోసం చేసింది! అది అస్సలు సహించలేకపోయా... యజ్వేంద్ర చాహాల్ కామెంట్స్..
రెండేళ్లుగా యజ్వేంద్ర చాహాల్ టైమ్ ఏమీ బాగోలేదు. టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీకి ఎంపిక కాలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, 2022 టీ20 వరల్డ్ కప్‌కి ఎంపికైనా ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో అయినా చోటు ఉంటుందా? ఉండదో తెలీదు..
ఐపీఎల్ 2021 తర్వాత మెగా వేలానికి ముందు యజ్వేంద్ర చాహాల్‌ని వేలానికి విడుదల చేసింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. విరాట్ కోహ్లీతో పాటు గ్లెన్ మ్యాక్స్‌వెల్, మహ్మద్ సిరాజ్‌లను రిటైన్ చేసుకున్న ఆర్‌సీబీ, చాహాల్‌ని తిరిగి కొనుగోలు చేయడానికి కూడా పెద్దగా ఆసక్తి చూపించలేదు..
‘వేలంలో నా పేరు పెట్టినప్పుడు, నన్ను కచ్ఛితంగా తిరిగి కొనుగోలు చేస్తామని మాట ఇచ్చారు. నేను సరేనని చెప్పా. కానీ వేలంలో నన్ను కొనుగోలు చేయలేదు. కనీసం ఫోన్ చేసి ఇది జరిగిందని చెప్పలేదు. అందుకే నాకు చాలా కోపం వచ్చింది. రెండేళ్లు ఆ కోపం అలాగే ఉండింది..
ఆర్‌సీబీతో జరిగిన మొదటి మ్యాచ్‌లో నేను ఎవ్వరితోనూ మాట్లాడలేదు. కనీసం కోచ్‌లను కూడా కలవలేదు. 2014లో నా ఐపీఎల్ ప్రయాణం అక్కడే మొదలైంది. 8 ఏళ్లు ఆ టీమ్‌కి ఆడాను. భారత జట్టుకి ఎంపిక కావడానికి కూడా ఆర్‌సీబీలో నేను ఇచ్చిన పర్ఫామెన్స్‌లే కారణం..
మొదటి మ్యాచ్ నుంచి విరాట్ భాయ్ నా పైన పూర్తి నమ్మకం పెట్టాడు. నాకు రూ.15 కోట్లు కావాలని ఏ రోజూ ఆడలేదు. ఇప్పుడు యూజీ చాలా డబ్బులు సంపాదించాడని వార్తలు వస్తున్నాయి. నేను వారికి ఒక్కటే చెప్పాలనుకుంటున్నా. నేను ఎవ్వరినీ నాకింత కావాలని అడిగింది లేదు..
ఆర్‌సీబీకి 114 మ్యాచులు ఆడాను. కనీసం ఫోన్ చేసి నాతో మాట్లాడి ఉంటే బాగుండేదని అనిపించింది. వేలం తర్వాత ఏది జరిగినా అది మంచికేనని అనుకున్నా. రాజస్థాన్‌కి వచ్చాక నేను డెత్ బౌలర్‌గా మారాను. అది నాకు ఎంతగానో ఉపయోగపడింది. ఆర్‌సీబీలో నాకు అటాచ్‌మెంట్ ఉంది కానీ రాజస్థాన్ వల్ల నా క్రికెట్ బాగా మెరుగైంది..’ అంటూ కామెంట్ చేశాడు యజ్వేంద్ర చాహాల్..
ఐపీఎల్ 2022 మెగా వేలంలో వానిందు హసరంగ, హర్షల్ పటేల్ వంటి ప్లేయర్లను తిరిగి కొనుగోలు చేసేందుకు ఒక్కొక్కరికీ రూ.10 కోట్లకు పైగా ఖర్చు పెట్టింది ఆర్‌సీబీ. యజ్వేంద్ర చాహాల్‌ని రాజస్థాన్ రాయల్స్ రూ.6.5 కోట్లకు కొనుగోలు చేసింది.
ఐపీఎల్ 2022 సీజన్‌లో 27 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్ గెలిచిన యజ్వేంద్ర చాహాల్, 2023 సీజన్‌లో 21 వికెట్లు తీశాడు. ఆర్‌సీబీ తరుపున అత్యుత్తమంగా 2015 సీజన్‌లో 23 వికెట్లు తీశాడు యజ్వేంద్ర చాహాల్.