- Home
- Sports
- Cricket
- ఆరేళ్ల దాకా నడవలేకపోయా, బాత్రూమ్‌లో కూర్చోడానికి కూడా... షాకింగ్ విషయాలు చెప్పిన షోయబ్ అక్తర్...
ఆరేళ్ల దాకా నడవలేకపోయా, బాత్రూమ్‌లో కూర్చోడానికి కూడా... షాకింగ్ విషయాలు చెప్పిన షోయబ్ అక్తర్...
ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బంతిని వేసిన రికార్డు, పాక్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ సొంతం. 2003 వన్డే వరల్డ్‌కప్‌లో కేప్‌టౌన్‌లో ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 161.3 కి.మీ.ల వేగంతో బౌలింగ్ చేసి, రికార్డు క్రియేట్ చేశాడు షోయబ్ అక్తర్. 19 ఏళ్లుగా ఈ రికార్డు చెక్కుచెదరలేదు...

బుల్లెట్ వేగంతో బంతులు విసురుతూ, రాకాసి బౌన్సర్లతో బ్యాటర్ల వెన్నులో వణుకుపుట్టించే షోయబ్ అక్తర్... ఆరేళ్ల వరకూ సరిగా నడవలేకపోయాడట... ఈ విషయాన్ని స్వయంగా బయటపెట్టాడు అక్తర్...
‘ఇప్పటికీ ప్రతీ రోజూ ఉదయం బాత్రూమ్‌లో ఏడ్చేశాను. నా కాళ్లు కూర్చోగానే లాక్ అయిపోతాయి. వెంటనే లేవలేను. నిల్చోడానికి పాకుతూ, పడుతూ లేస్తూ అపసోపాలు పడాల్సిందే...
నా కెరీర్ ఇలాగే మొదలైంది. 1999లో మాత్రమే నేను గాయాలు, నొప్పి లేకుండా ప్రశాంతంగా గడిపాను. ఆరేళ్ల వరకూ నేను నడవలేకపోయాను. అందరూ పరుగెత్తే వయసులో నేను పాకేవాడిని...
డాక్టర్, మా అమ్మతో ‘ఈ పిల్లాడు సగం అంగ వైకల్యంతో పుట్టాడు. మిగిలిన పిల్లల్లా మామూలుగా నడవలేడు, పరుగెత్తలేడు..’ అని చెప్పాడట...
నా కెరీర్ మొత్తం నొప్పితోనే సాగింది. నా మోకాలి ఎముకలో ఎముక పెరిగింది. ఆ నొప్పి ఎలా ఉంటుందో మీరో ఊహించుకోండి. ఆ నొప్పి మాటల్లో చెప్పలేం...
నేను ఐస్ బాత్ చేస్తూ నిద్రపోయేవాడిని. చాలాసార్లు నన్ను టీమ్ మేట్స్ వచ్చి నిద్రలేపేవాళ్లు. తెల్లవారుజామున 4 అవుతోంది, వెళ్లి బెడ్‌పైన పడుకో... అని చెప్పేవాళ్లు...
టీమ్‌లో ప్లేస్ పోతుందనే భయంతో నేను నా గాయాలను దాచి పెట్టేవాడిని. నేను రెగ్యూలర్‌గా మ్యాచులు ఎందుకు ఆడడం లేదో మీడియాకి అర్థమయ్యేది కాదు...
వాళ్లు రకరకాలుగా రాసేవాళ్లు. నా శరీరంతో, గాయాలతో నేను చూస్తున్న యుద్ధం వారికి తెలీదు కదా...’ అంటూ చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్...
అతి తక్కువ సమయంలో ఎన్నో రికార్డులు కొల్లగట్టిన షోయబ్ అక్తర్, తన కెరీర్ ఆసాంతంగా గాయాలతో ఇబ్బందిపడ్డాడు...
46 టెస్టులు, 163 వన్డేలు, 15 టీ20 మ్యాచులు ఆడిన షోయబ్ అక్తర్, టెస్టుల్లో 178, వన్డేల్లో 247, టీ20ల్లో 19 వికెట్లు పడగొట్టి... 2011 వన్డే వరల్డ్ కప్ తర్వాత రిటైర్మెంట్ ప్రకటించాడు.