- Home
- Sports
- Cricket
- చెత్త ఫామ్ లో విరాట్-రోహిత్.. టీమిండియా ముంగిట కీలక టోర్నీలు.. దాదా షాకింగ్ కామెంట్స్
చెత్త ఫామ్ లో విరాట్-రోహిత్.. టీమిండియా ముంగిట కీలక టోర్నీలు.. దాదా షాకింగ్ కామెంట్స్
Sourav Ganguly on Virat and Rohit: టీమిండియా వెటరన్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి-రోహిత్ శర్మలు గత కొంతకాలంగా చెత్త ఆటతీరుతో తీవ్ర విమర్శల పాలవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు.

టీమిండియా తాజా మాజీ సారథులు విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు గత కొంతకాలంగా ఫామ్ లేమితో తంటాలు పడుతున్నారు. తాజాగా మహారాష్ట్ర వేదికగా జరుగుతున్న ఐపీఎల్ లో ఈ ఇద్దరి ఆటతీరు విమర్శల పాలైంది. భారత జట్టు రాబోయే రోజుల్లో కీలక సిరీస్ లతో పాటు టీ20 ప్రపంచకప్ - 2022 ఆడనున్న నేపథ్యంలో ఈ ఇద్దరి ఫామ్ చర్చనీయాంశమైంది.
ఐపీఎల్ లో వీరి ఫామ్ పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ.. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ స్పందించాడు. ఈ ఇద్దరూ భారత జట్టుకు కీలక ఆటగాళ్లని, వాళ్ల ఫామ్ గురించి ఫ్యాన్స్ ఆందోళన చెందాల్సిన పన్లేదని వ్యాఖ్యానించడటం గమనార్హం.
గంగూలీ మాట్లాడుతూ.. ‘వాళ్లిద్దరి ఫామ్ మీద నాకేం బాధగా లేదు. ఆ ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. టీమిండియాకు బ్యాక్ బోన్ వంటి వారు. టీ20 ప్రపంచకప్ కు ఇంకా చాలా సమయముంది. అప్పటిలోగా వాళ్లు కావాల్సినన్ని మ్యాచులు ఆడతారు. టోర్నీ సమయానికల్లా వాళ్లిద్దరూ పుంజుకుంటారు..’ అని చెప్పాడు.
ఈ సీజన్ లో కోహ్లి.. 13 మ్యాచులలో 19.67 సగటుతో 236 పరుగులు చేశాడు. ఇందులో ఒకే హాఫ్ సెంచరీ ఉంది. ఐపీఎల్ ప్రారంభ సీజన్ మినహా మిగిలిన ఏ సీజన్ లో కూడా కోహ్లి ఇన్ని తక్కువ పరుగులు చేయలేదు. కెరీర్ లో అత్యంత హీన దశ ఎదుర్కుంటున్న కోహ్లి.. అంతర్జాతీయ సెంచరీ చేయక 100 ఇన్నింగ్స్ లు దాటింది.
ఇక రోహిత్ కూడా అంత గొప్పగా ఆడలేదు. ముంబై ఇండియన్స్ తరఫున ఈ సీజన్ లో 12 మ్యాచులాడిన రోహిత్.. 18.17 సగటుతో 218 పరుగులు చేశాడు. 12 మ్యాచులలో రోహిత్ ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయకపోవడం గమనార్హం. అదీగాక ఐదు సార్లు సింగిల్ డిజిట్ స్కోరుకే వెనుదిరిగాడు.
వీళ్లిద్దరి తాజా ఆటతీరుతో ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. భారత జట్టుకు కీలక ఆటగాళ్లైన ఈ ఇద్దరూ ఇలా విఫలమవుతున్న నేపథ్యంలో టీ20 ప్రపంచకప్ లో కూడా భారత్ కు మరో భంగపాటు తప్పదని వాపోతున్నారు. గతేడాది దుబాయ్ లో ముగిసిన పొట్టి ప్రపంచకప్ లో ఓడిన టీమిండియా.. ఈసారి ఎలాగైనా దానిని చేజిక్కించుకోవాలని చూస్తున్నది.
టీ20 ప్రపంచకప్ నకు ముందు భారత జట్టు నాలుగు టీ20 సిరీస్ లు ఆడుతుంది. అందులో జూన్ 9 నుంచి దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచుల టీ20 సిరీస్. రెండోది జులైలో జరుగబోయే ఐర్లాండ్ (రెండు మ్యాచులు) సిరీస్. ఆ తర్వాత ఇంగ్లాండ్, వెస్టిండీస్ తో కూడా భారత్ తలపడుతుంది. ఈ నాలుగు ముగిశాక భారత జట్టు టీ20 ప్రపంచకప్ కోసం ఆసీస్ కు బయల్దేరుతుంది.