చేతన్‌ను బుట్టలో వేసుకోవడానికి భారీ ప్లాన్..! ఓటీటీ కోసమేనా..?
Chetan Sharma: భారత క్రికెట్ ను ఓ కుదుపు కుదిపిన బీసీసీఐ చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ లో అతడు తన పదవిని కోల్పోయాడు. అయితే దీని తెరవెనుక చాలా కథే నడిచిందట..

భారత క్రికెట్ పరువును నడిబజార్లోకి తీసుకొచ్చి బీసీసీఐ రహస్యాలను బట్టబయలు చేసిన చీఫ్ సెలక్టర్ చేతన్ శర్మ స్టింగ్ ఆపరేషన్ తర్వాత తన పదవికి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. కోహ్లీ-గంగూలీ విభేదాలు, టీమిండియా ఆటగాళ్ల ఫిట్నెస్, ఇతరత్రా విషయాలపై అతడు వెల్లడించిన విషయాలు భారత క్రికెట్ ను ఓ కుదుపు కుదిపాయి.
ప్రముఖ టీవీ ఛానెల్ ‘జీ న్యూస్’ తో పాటు ‘వియాన్’లు నిర్వహించిన స్టింగ్ ఆపరేషన్ తర్వాత అతడిని బీసీసీఐ వివరణ కోరినా చేతన్ నేరుగా రాజీనామాకే మొగ్గుచూపాడు. అయితే మొత్తం ఎపిసోడ్ లో విలన్ గా మారిన చేతన్ ను ఇందులో ఇరికించడానికి భారీ ప్రణాళికే ఉందని తెలుస్తున్నది. ఓ ఓటీటీ ప్రాజెక్ట్ కోసం చేతన్ ను బలిపశువు చేశారని సమాచారం.
ఇన్‌సైడ్‌స్పోర్ట్స్ లో వచ్చిన కథనం ఆధారంగా.. చేతన్ ను స్టింగ్ ఆపరేషన్ లో ఇరికించిన సదరు పాత్రికేయులు తాము జర్నలిస్టులమనే విషయాన్ని ఆయన దగ్గర దాచారు. తాము ఒక ఓటీటీ ప్రాజెక్ట్ తీస్తున్నామని... 8 ఎపిసోడ్స్ తో కూడిన ఓ డాక్యుమెంటరీ సిరీస్ అని చేతన్ ను నమ్మించారు. అందుకోసం కంటెంట్ కావాలని అతడిని అడిగారట.
అయితే చేతన్ వీరిని తొలుత నమ్మలేదు. వారితో మాట్లాడటానికి నిరాకరించాడు. కానీ తమకు బీసీసీఐ ఆశీస్సులు ఉన్నాయని.. చేతన్ చెప్పే విషయాలు ఆఫ్ ది రికార్డే తప్ప తన పేరును ఎక్కడా వెల్లడించమని చెప్పారట. చేతన్ ను పూర్తిగా నమ్మించిన తర్వాతే పలు సిట్టింగ్ ల తర్వాత ఈ స్టింగ్ ఆపరేషన్ కు శ్రీకారం చుట్టారు.
కంటెంట్ స్ట్రాటజీలో భాగంగా చేతన్ ను కోహ్లీ- గంగూలీ విభేదాలు, ఆటగాళ్ల ఫిట్నెస్, టీమిండియాకు కొత్త కెప్టెన్, రోహిత్ -కోహ్లీల మధ్య ఇగో వంటి విషయాలపై సమాచారం అడగగా అతడు మొత్తం ఏకరువు పెట్టేశాడు. ఇప్పుడు వీడియోలలో వైరల్ అవుతున్న ముచ్చట్లన్నీ ఓటీటీ కోసమేనని చెప్పిన సదరు వ్యక్తులు.. అతడు ఓపెన్ అయ్యేసరికి దానిని పబ్లిక్ లో పెట్టేశారు. తర్వాత అంతా బహిర్గతమే..
ఈ వీడియోలు బయటకు వచ్చిన తర్వాత చేతన్ తన పదవికి రాజీనామా చేశాడు. వాస్తవానికి శుక్రవారం ఉదయం చేతన్ రాజీనామా వార్త ఓ ఊపు ఊపింది. కానీ ఇప్పటికే పరువు పోయిన బీసీసీఐ ఆ డ్యామేజీని కవర్ చేసేందుకే సాయంత్రం హడావిడిగా ఐపీఎల్ షెడ్యూల్ విడుదల చేసిందని సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. ఐపీఎల్ షెడ్యూల్ లో పడిపోయిన క్రికెట్ ఫ్యాన్స్ చేతన్ విషయాన్ని పట్టించుకోలేదు. ఈ విషయంలో బీసీసీఐ సక్సెస్ అయిందని నెటిజన్లు చెవులు కొరుక్కుంటున్నారు.