- Home
- Sports
- Cricket
- కొలంబోలో కుండపోత వర్షాలు! సూపర్ 4 రౌండ్ మ్యాచులు సాగడం కష్టమే... యూఏఈలో పెట్టమంటే..
కొలంబోలో కుండపోత వర్షాలు! సూపర్ 4 రౌండ్ మ్యాచులు సాగడం కష్టమే... యూఏఈలో పెట్టమంటే..
ఆసియా కప్ 2023 టోర్నీకి పాకిస్తాన్ ఆతిథ్యం ఇవ్వాల్సింది. అయితే పాక్‌లో అడుగుపెట్టేందుకు టీమిండియా ఒప్పుకోకపోవడంతో హై బ్రీడ్ మోడల్‌లో పాకిస్తాన్‌లో 4 మ్యాచులు, శ్రీలంకలో 9 మ్యాచులు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది ఆసియా క్రికెట్ కౌన్సిల్...

మొదటి రెండు మ్యాచులు సజావుగా సాగినా, పల్లెకెలెలో జరిగిన ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండానే రద్దయ్యింది. పాక్‌లో షెడ్యూల్ చేసిన మ్యాచులు పూర్తి ఓవర్ల పాటు ఎలాంటి అంతరాయం లేకుండా జరుగుతుంటే, లంకలో మ్యాచులకు వాన అడ్డంకిగా మారింది.
సెప్టెంబర్ 6 నుంచి సూపర్ 4 రౌండ్ మ్యాచులు జరగబోతున్నాయి. సెప్టెంబర్ 6న లాహోర్‌లో మొదటి మ్యాచ్ జరగబోతుంటే ఆ తర్వాత సూపర్ 4 మ్యాచులు, ఫైనల్ మ్యాచ్ అన్నీ కూడా కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియంలోనే జరగాల్సి ఉంది..
అయితే కొలంబోలో ప్రస్తుతం కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా రోడ్లన్నీ జలమయం అయ్యాయి. మోకాళ్ల లోతు నీళ్లు రోడ్లపైకి రావడంతో ఇళ్లన్నీ నీట మునిగాయి.. మరో 3 రోజులు ఇలాగే వర్షాలు కొనసాగితే, సూపర్ 4 రౌండ్ మ్యాచులు సజావుగా సాగడం కష్టమే..
గ్రూప్ మ్యాచులకు వర్షం అంతరాయం కలిగించినా సూపర్ 4 చేరే జట్లపై పెద్దగా ప్రభావం చూపించలేదు. అయితే సూపర్ 4 రౌండ్‌లో ప్రతీ మ్యాచ్ ముఖ్యమే. ఒక్క మ్యాచ్ రద్దు అయినా ఫైనల్ చేరే ఛాన్సులు తగ్గిపోతాయి..
‘వర్షం కారణంగా గ్రేటెస్ట్ కాంటెస్ట్ రద్దు అయ్యింది. ఇది నన్ను చాలా నిరుత్సాహపరిచింది. లంకలో వర్షాకాలం ఎలాంటి పరిస్థితి ఉంటుందని నాకు ముందే తెలుసు. అందుకే పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మెన్‌గా ఉన్నప్పుడు, శ్రీలంకలో కాకుండా యూఏఈలో మ్యాచులు నిర్వహించాల్సిందిగా ఏసీసీకి విన్నవించాను..
అయితే దుబాయ్‌లో వేడి ఎక్కువగా ఉంటుందని వాళ్లు చెప్పారు. ఇంతకుముందు ఏప్రిల్ 2014లో, సెప్టెంబర్ 2020లో ఐపీఎల్ ఆడినప్పుడు దుబాయ్‌లో వేడి తెలియలేదా? గత ఏడాది సెప్టెంబర్ 2022లో ఆసియా కప్ కూడా అక్కడే జరిగిందిగా..
Image credit: Getty
క్రీడలను రాజకీయాలు కమ్మేస్తున్నాయి. ఇది క్షమించరాని నేరం. ఆసియా కప్ మ్యాచులు చూడాలని ఎంతో ఆశగా వేల కిలో మీటర్లు దాటి వచ్చిన వాళ్లకి ఏం సమాధానం చెబుతారు..’ అంటూ ట్వీట్ చేశాడు పీసీబీ మాజీ ఛైర్మెన్ నజం సేథీ..
ఒకవేళ వర్షం కారణంగా సూపర్ 4 రౌండ్ మ్యాచులు సజావుగా సాగకపోతే, ఫైనల్‌పై ఆ ప్రభావం పడుతుంది. ఫైనల్‌లోనూ వర్షం పడితే, ఫైనల్ చేరిన రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సి వస్తుంది. వన్డే వరల్డ్ కప్ ముందు ఇలాంటి రిజల్ట్ వస్తే టీమ్స్‌పై ఆ ప్రభావం పడొచ్చు..