- Home
- Sports
- Cricket
- మేమేమైనా వాటిని ముందుకు జరుపుతున్నామా..? డబ్ల్యూపీఎల్‌లో బౌండరీ లైన్‌పై ముంబై కెప్టెన్ కామెంట్స్
మేమేమైనా వాటిని ముందుకు జరుపుతున్నామా..? డబ్ల్యూపీఎల్‌లో బౌండరీ లైన్‌పై ముంబై కెప్టెన్ కామెంట్స్
WPL 2023 Finals: తొలిసారి జరుగుతున్న ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో బౌండరీ లైన్ మీటర్ ను బీసీసీఐ తగ్గించింది. దీనిపై తాజాగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ స్పందించింది.

ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ లో నేడు ఆఖరి పోరు జరుగబోతుంది. మరికొద్దిసేపట్లో ముంబై ఇండియన్స్ - ఢిల్లీ క్యాపిటల్స్ నడుమ బ్రబోర్న్ స్టేడియం వేదికగా ఫైనల్ జరుగబోతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్ కు ముందు ఢిల్లీ, ముంబై టీమ్ కెప్టెన్లు మెగ్ లానింగ్, హర్మన్‌ప్రీత్ కౌర్ లు విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
తొలిసారి జరుగుతున్న డబ్ల్యూపీఎల్ పై క్రేజ్ పెంచేందుకు గాను బీసీసీఐ పలు చర్యలు తీసుకుంది. ఇందులో భాగంగా.. మహిళలకు స్టేడియాల్లోకి ఉచిత ఎంట్రీ.. టికెట్ల రుసుములు నామమాత్రం (రూ. 100, రూ . 200, రూ. 250) గానే ఉంచింది. వీటితో పాటు బౌండరీ లైన్ ను 60 మీటర్లకు కుదించింది. మార్చి 4న గుజరాత్ జెయింట్స్ - ముంబై ఇండియన్స్ మ్యాచ్ కు ముందే బీసీసీఐ ఈ కీలక నిర్ణయం తీసుకుంది.
తాజాగా ఈ విషయంపై విలేకరుల సమావేశంలో పాల్గొన్న హర్మన్‌ప్రీత్ కౌర్ కు ఇదే ప్రశ్న ఎదురైంది. బౌండరీ లైన్ ను తగ్గించడం వల్లే భారీ స్కోర్లు సాధ్యమవుతున్నాయా..? అని అడిగిన ప్రశ్నకు కౌర్ అదిరిపోయే రిప్లై ఇచ్చింది. అది మా చేతుల్లో లేదని తెలిపింది.
హర్మన్ మాట్లాడుతూ.. ‘మేము బౌండరీ లైన్ లు ఎక్కడ పెట్టాలో చెప్పేవాళ్లం కాదు. అది ఎవరు చేస్తారో వాళ్లను అడగాలి. అది మా చేతుల్లో లేని పని. మీరు ఈ ప్రశ్నను సంబంధిత అధికారులను అడిగితే సమాధానం దొరుకుతుంది..’అని రిప్లై ఇచ్చింది. కౌర్ రిప్లైతో అక్కడ నవ్వులు విరబూసాయి.
కాగా ఆస్ట్రేలియాలో ఉమెన్స్ బిగ్ బాష్ లీగ్ మాదిరే ఇండియాలో డబ్ల్యూపీఎల్ కూడా దేశంలో ఔత్సాహిక క్రికెటర్లకు ఒక మంచి వేదిక అని హర్మన్ చెప్పింది. ఈ లీగ్ వల్ల దేశవాళీలో ఆడే క్రికెటర్లకు మంచి వేదిక దొరుకుతుందని, వచ్చే రెండు మూడేండ్లలో అందుకు సంబంధించిన ఫలితాలను మనం చూడొచ్చని వెల్లడించింది.