Hardik pandya: శిఖర్ ధావన్ ను అధిగమించిన హార్దిక్ పాండ్యా
Hardik Pandya: భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా మాజీ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ ప్లేయర్ గా నిలిచాడు.

Image Credit: Getty Images
పూణేలో ఇంగ్లాండ్ తో జరిగిన నాల్గో టీ20 మ్యాచ్ లో భారత్ సూపర్ విక్టరీ సాధించింది. ఈ విజయంతో భారత జట్టు ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే సిరీస్ ను కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్ గెలుపుతో భారత స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కీలక పాత్ర పోషించాడు. ఈ క్రమంలోనే అతను భారత మాజీ బ్యాటర్ శిఖర్ ధావన్‌ను అధిగమించి టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన 5వ భారత క్రికెటర్ గా నిలిచాడు.
Image Credit: Getty Images
టీ20 క్రికెట్ లో అత్యధిక పరుగులు చేసిన 5వ భారత క్రికెటర్ హార్దిక్ పాండ్యా
పూణేలో శుక్రవారం ఇంగ్లాండ్‌తో జరిగిన నాల్గవ టీ20లో పాండ్యా ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌లో పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు చేసి, జట్టును 79/5 స్థితి నుంచి 20 ఓవర్లలో 181/9కి చేర్చాడు. అతని పరుగులు 155 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో వచ్చాయి. ఇప్పుడు 113 టీ20లు, 89 ఇన్నింగ్స్‌లలో హార్దిక్ పాండ్యా 28.17 సగటుతో, 141.63 స్ట్రైక్ రేట్‌తో 1,803 పరుగులు చేశాడు. ఇందులో ఐదు అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 71* పరుగులు.
ఇప్పుడు హార్దిక్ పాండ్యా శిఖర్ ధావన్ ను అధిగమించాడు. 68 మ్యాచ్‌లలో ధావన్ 27.92 సగటుతో, 126.36 స్ట్రైక్ రేట్‌తో 1,759 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 92 పరుగులు. తన 66 ఇన్నింగ్స్‌లలో 11 అర్ధ సెంచరీలు సాధించాడు.
టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్ ఎవరు?
టీ20ల్లో భారత్ తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు మాజీ టీ20 ప్రపంచకప్ విజేత కెప్టెన్ రోహిత్ శర్మ. అతను 159 మ్యాచ్‌లు, 151 ఇన్నింగ్స్‌లలో 32.05 సగటుతో, 140.89 స్ట్రైక్ రేట్‌తో 4,231 పరుగులు చేశాడు. అతను ఐదు సెంచరీలు, 32 అర్ధ సెంచరీలు సాధించాడు. అతని అత్యధిక స్కోరు 121* పరుగులు.
అతని తర్వాత విరాట్ కోహ్లీ (125 మ్యాచ్‌లలో 48.69 సగటుతో 4,188 పరుగులు, ఒక సెంచరీ, 38 అర్ధ సెంచరీలు), సూర్యకుమార్ యాదవ్ (82 మ్యాచ్‌లు, 78 ఇన్నింగ్స్‌లలో 38.74 సగటుతో 2,596 పరుగులు, నాలుగు సెంచరీలు, 21 అర్ధ సెంచరీలు) ఉన్నారు.
Hardik Pandya
IND vs ENG: ఒక మ్యాచ్ మిగిలి ఉండగానే టీ20 సిరీస్ కైవసం చేసుకున్న భారత్
మ్యాచ్ విషయానికి వస్తే, ఇంగ్లాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పేసర్ సాకిబ్ మహ్మూద్ (3/35) సంజు శాంసన్, తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌లను ఒకే ఓవర్లోఔట్ చేయడంతో భారత్ 12/3 స్థితికి చేరుకుంది. అయితే, ఆ తర్వాత వచ్చిన అభిషేక్ శర్మ (19 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 29 పరుగులు), రింకు సింగ్ (26 బంతుల్లో 4 ఫోర్లు, ఒక సిక్స్‌తో 30 పరుగులు) కీలక ఇన్నింగ్స్‌లు ఆడడంలో భారత్ 79/5 పరుగులకు చేరుకుంది.
ఆ తర్వాత వచ్చిన హార్దిక్ పాండ్యా (34 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్స్‌లతో 53 పరుగులు), శివమ్ దూబే (30 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్స్‌లతో 53 పరుగులు) మధ్య 87 పరుగుల భాగస్వామ్యంతో భారత్ 20 ఓవర్లలో 181/9 పరుగులు చేసింది. ఓవర్టన్ (4/32), ఆదిల్ రషీద్ (1/35) మంచి బౌలింగ్ తో ఆకట్టుకున్నారు.
182 పరుగుల టార్గెట్ లో బ్యాటింగ్ మొదలుపెట్టిన ఇంగ్లాండ్ కు మంచి శుభారంభం లభించింది. ఫిల్ సాల్ట్ (21 బంతుల్లో 4 ఫోర్లతో 23 పరుగులు), బెన్ డకెట్ (19 బంతుల్లో 7 ఫోర్లతో 39 పరుగులు) ఇంగ్లాండ్‌కు మంచి ఆరంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కు 62 పరుగులు జోడించారు. అయితే, భారత స్పిన్నర్లు రాణించడంతో భారత్ మ్యాచ్ ను తన వైపు లాక్కుంది.
ఇంగ్లాండ్‌ను 95/4 పరుగులతో ఉన్న సమయంలో హ్యారీ బ్రూక్ (26 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 51 పరుగులు) అర్ధ సెంచరీ సాధించాడు, కానీ మరోవైపు వికెట్లు వేగంగా పడ్డాయి. హర్షిత్ (3/33), స్పిన్నర్ రవి బిష్ణోయ్ (3/28) అద్భుత బౌలింగ్ తో ఇంగ్లాండ్ ను దెబ్బకొట్టారు. దీంతో ఇంగ్లాండ్ 166 పరుగులకే పరిమితమై 15 పరుగుల తేడాతో ఓడిపోయింది. శివం దూబే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డును అందుకున్నాడు. భారత్ ఈ సిరీస్‌ను 3-1తో గెలుచుకుంది.