సౌతాఫ్రికాను దారుణంగా ట్రోల్ చేసిన సచిన్.. ఆరెంజ్ జ్యూస్‌తో పోల్చుతూ..
T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో ఆదివారం అడిలైవడ్ ఓవల్ వేదికగా ముగిసిన సౌతాఫ్రికా-నెదర్లాండ్స్ మ్యాచ్ లో సఫారీ జట్టు అనూహ్య ఓటమిని మూటగట్టుకుంది. తద్వారా ఆ జట్టు సెమీస్ రేసు నుంచి నిష్క్రమించింది.
ఆస్ట్రేలియా గడ్డ మీద జరుగుతున్న టీ20 ప్రపంచకప్ లో సెమీస్ బెర్త్ ఖాయం అనుకుంటున్న తరుణంలో నెదర్లాండ్స్ జట్టు సౌతాఫ్రికాకు భారీ షాకిచ్చిన విషయం తెలిసిందే. అడిలైడ్ ఓవల్ వేదికగా ముగిసిన ఈ మ్యాచ్ లో నెదర్లాండ్స్.. 13 పరుగుల తేడాతో గెలిచి పోతూ పోతూ తనతో పాటు సౌతాఫ్రికాను కూడా ఇంటికి తీసుకెళ్లింది.
ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన నెదర్లాండ్స్.. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 158 పరుగులు చేసింది. అనంతరం దక్షిణాఫ్రికా మోస్తారు లక్ష్య ఛేదనలో 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 145 పరుగులకే పరిమితమైంది. దీంతో ఆ జట్టు 13 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.
ఈ నేపథ్యంలో భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ సౌతాఫ్రికాను దారుణంగా ట్రోల్ చేశాడు. తన సోషల్ మీడియా ఖాతాలలో ఈ మ్యాచ్ కు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ఆసక్తకిర కామెంట్స్ చేశాడు.
నెదర్లాండ్స్ విజయానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ ట్విటర్ వేదికగా స్పందించిన సచిన్.. ‘ఇవాళ ఉదయం నా ఫ్రెండ్ తో బ్రేక్ ఫాస్ట్ కు వెళ్లాను. అతడితో మనం డచ్ కు వెళ్దాం అని చెప్పాను. దీంతో అతడు నా ప్రతిపాదనకు ఉక్కిరిబిక్కిరయ్యాడు...’ అని ట్వీట్ లో రాసుకొచ్చాడు.
అంతేగాక దక్షిణాఫ్రికా బ్యాటింగ్ కు వచ్చి త్వరత్వరగా వికెట్లు కోల్పోయినప్పుడు కూడా సచిన్ తన ఇన్స్టా ఖాతాలో ఓ పోస్ట్ పెట్టాడు. ‘ఈరోజు నేను నా ఉదయాన్ని ఆరోగ్యంగా ప్రారంభించాను. ఉదయం లేవగానే కాస్త ఆరెంజ్ జ్యూస్ తాగాను. దీనిని చూస్తుంటే ఇదే ఫ్లేవర్ ఆఫ్ ది డే’గా ఉంది’ అని రాసుకొచ్చాడు.
ఈ రెండు పోస్టులలో సచిన్ ఎక్కడా సౌతాఫ్రికా పేరు తీసుకురాకపోయినా మాస్టర్ బ్లాస్టర్ టార్గెట్ చేసి సఫారీలనే అని తెలుస్తూనే ఉంది. సఫారీలను ట్రోల్ చేసినా సచిన్.. నెదర్లాండ్స్ ను పొగుడుతూ చేసిన పోస్టులు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక ఈ మ్యాచ్ లో ఓడిన తర్వాత తమకు వచ్చిన అవకాశాన్ని పాకిస్తాన్ సద్వినియోగం చేసుకుంది. తమ చివరి లీగ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ ను ఓడించి సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకుంది. భారత్, జింబాబ్వే చేతిలో ఓడిన ఆ జట్టు అనూహ్యంగా తర్వాత రెండు మ్యాచ్ లలో విజయం సాధించి నేడు బంగ్లాను ఓడించడంతో సెమీస్ కు అర్హత సాధించింది.